మూడు రోజుల పాటు కుప్పంలో సీఎం పర్యటన
కుప్పం: సీఎం చంద్రబాబునాయుడు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నట్టు కలెక్టర్ సుమిత్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గుడుపల్లె మండలం అగస్త్య ఇంటర్‌నేషనల్ పాఠశాల ప్రాగణంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారన్నారు. అక్కడ టీచర్స్ ట్రైనింగ్ సెంటర్, కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని స్వర్ణ నవదిశ కేంద్రాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆపై కుప్పం మండలం పరిధిలోని కంగుంది గ్రామంలో ఏర్పాటు చేసినా వంద అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అక్కడే హోం స్టే, బౌల్డిరింగ్ ఫెస్టివల్ జరిగిన ప్రదేశాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం శాంతిపురం మండలం, కడపల్లి వద్ద తన స్వగృహానికి చేరుకుని బస చేస్తారు. రెండో రోజు శనివారం ఉదయం 10 గంటలకు గుడుపల్లె మండలం, బెగ్గిలపల్లి గ్రామంలో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. తర్వాత తులసి నాయనపల్లి గ్రామం వద్ద బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం 5 వేల మందికి బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు తుమ్మిసి మోడల్ స్కూల్‌లో జరిగే పలు సమావేశాల్లో పాల్గొననున్నట్టు కలెక్టర్ వెల్లడించారు.


