రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
కుప్పం రూరల్: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కుప్పం – మల్లానూరు రైల్వే స్టేషన్ల మధ్య గోపనపల్లి వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ రమేష్ కథనం.. కుప్పం మండలం, గోపనపల్లి గ్రామానికి చెందిన లోకనాథన్ (49) మంగళవారం రాత్రి గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కాగా లోకనాథన్ మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు కానిస్టేబుల్ రమేష్ తెలిపారు.
ప్రమాదంలో భార్య మృతి
భర్త పరిస్థితి విషమం
తవణంపల్లె: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో భార్య మృతిచెందగా.. భర్త పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన మండలంలోని తెల్లగుండ్లపల్లె బ్రిడ్జి కింద తిరుపతి– బెంగళూరు హైవే సర్వీస్ రోడ్డులో చోటుచేసుకుంది. తవణంపల్లె ఎస్‌ఐ డాక్టర్ నాయక్ కథనం.. మండలంలోని కర్నంవాండ్లవూరుకు చెందిన కె.మురగయ్య(66), భార్య కె.బుజ్జమ్మ(45) మోటారు సైకిల్ టీవీఎస్ సూపర్ ఎక్స్‌ల్(ఎపి 03 బిబి 5464)లో సొంత పనిపై చిత్తూరు వెళ్తూ తిరుపతి– బెంగళూరు హైవే సర్వీస్ రోడ్డును దాటుతున్నారు. ఇంతలో తెల్లగుండ్లపల్లె దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య బుజ్జమ్మ తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త మురగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. బుజ్జమ్మ మృతదేహాన్ని శవపరీక్ష కోసం చిత్తూరు ప్రధాన ఆస్పత్రికి తరలించి, మృతురాలు అల్లుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. గుర్తు తెలియన వాహనాన్ని పట్టుకోవడానికి సీసీ కెమెరాల ఫుటేజీలని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య


