అల్లుడికి తీసిచ్చిన అప్పు తీర్చలేదని..
బంగారుపాళెం: అప్పు తీర్చలేద ఆగ్రహించిన మామ అల్లుడిపై దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మండలంలోని మహాసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. మహాసముద్రం గ్రామానికి చెందిన అర్జునయ్య తన అల్లుడు బంగారుపాళెం దళితవాడకు చెందిన నరేష్‌కు వేరొకరి వద్ద పూచీకత్తుగా ఉండి రూ.1.5 లక్షలు అప్పు తీసి ఇచ్చాడు. తీసి ఇచ్చిన డబ్బులు సకాలంలో తీర్చలేదని అల్లుడిపై ఒత్తిడి చేశాడు. దీంతో మామ అల్లుడి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆగ్రహించిన మామ అర్జునయ్య అల్లుడు నరేష్‌పై కత్తితో దాడి చేసి గాయపరచాడు. నరేష్ ఫిర్యాదు మేరకు మామ అర్జునయ్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
పోలీసు గ్రీవెన్స్‌కు
30 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీలు సాయినాథ్, రాంబాబు ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. మొత్తం 30 ఫిర్యా దులు అందినట్టు వారు పేర్కొన్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
బంగారుపాళెం: మండలంలోని కల్లూరుపల్లెకు చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు.. కల్లూరుపల్లెకు చెందిన లక్ష్మి(26) గుడిపాల మండలం, అనుప్పల్లెకు చెందిన సురేష్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా నాలుగేళ్ల క్రితం భర్తను వదిలిపెట్టి స్వగ్రామం కల్లూరుపల్లెలో ఉంటోంది. ఈ క్రమంలో గుండ్లకట్టమంచికి చెందిన గిరితో లక్ష్మి సహజీవనం చేస్తోంది. గత కొన్ని రోజులుగా లక్ష్మి ప్రవర్తనపై గిరికి అనుమానం కలిగి వేధింపులకు గురి చేస్తుండడంతో ఆమె మనస్తాపంతో ఈ నెల 7న మహాసముద్రం టోల్‌ప్లాజా వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరింది. ఆపై చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మి ఆదివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తల్లి లైలా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


