కారుకు లాయర్‌ స్టిక్కర్లు.. చేసేది దొంగతనాలు! | - | Sakshi
Sakshi News home page

కారుకు లాయర్‌ స్టిక్కర్లు.. చేసేది దొంగతనాలు!

Jan 8 2026 7:05 AM | Updated on Jan 8 2026 7:05 AM

కారుకు లాయర్‌ స్టిక్కర్లు.. చేసేది దొంగతనాలు!

కారుకు లాయర్‌ స్టిక్కర్లు.. చేసేది దొంగతనాలు!

● చిత్తూరులో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌ ● రూ.50 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు సీజ్‌ ● నిందితులపై 185కు పైగా కేసులు..35 కేసుల్లో వాంటెడ్‌ ● మీడియాకు వివరాలు వెల్లడించిన చిత్తూరు ఎస్పీ డూడీ

చిత్తూరు అర్బన్‌: కారుకు న్యాయవాది లోగో ఉన్న స్టిక్కర్లు వేసుకుని వెళ్లడం.. చీకటైతే తాళాలు వేసిన ఇళ్లను పగులగొట్టి చోరీలకు పాల్పడడం అటవాటు చేసుకున్న అంతర్రాష్ట్ర దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన రాయపాటి వెంకయ్య (49), షేక్‌ నాగుల్‌ మీరా (27), యక్కంటి తులసిరామిరెడ్డి (26)ని అరెస్టు చేసిన పోలీసులు.. దాదాపు రూ.50 లక్షల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు, కార్లు, స్కూటర్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో ఎస్పీ తుషార్‌ డూడీ, పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు. గతేడాది జూలై 15వ తేదీన పలమనేరు పట్టణంలోని అయ్యాకన్ను వీధిలో ఉంటున్న బాలాజీ అనే వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దీనిపై అదే నెల 18వ తేదీ బాధితుడి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం పలమనేరు శివారుల్లోని చిత్తూరు–బెంగళూరు జాతీయ రహదారిపై నాగమంగళం బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రాయపాటి వెంకయ్య (49), షేక్‌ నాగుల్‌ మీరా (27), యక్కంటి తులసిరామిరెడ్డి (26)ను అదుపులోకి తీసుకుని విచారించారు. పలమనేరులో చేసిన చోరీలో 210 గ్రాముల బంగారు, వజ్రాభరణాలు, పుంగనూరులో జరిగిన మరో చోరీలో 76 గ్రాముల బంగారు, ఓ చైన్‌స్నాచింగ్‌ కేసులో 13 గ్రాములు, క్రిష్ణగిరిలో జరిగిన చైన్‌ స్నాచింగ్‌లో 13 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు, బైకుల్లో వెళ్లి.. ఇళ్లలో చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కారు, రెండు ద్విచక్ర వాహనాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వీటి విలువ రూ.50 లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

వందల కొద్దీ కేసులు

పట్టుబడిన నిందితులపై వందల కొద్దీ కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. పలమనేరు, పుంగనూరు, గంగవరం, బెంగళూరు, కర్ణాటకలోని ముల్‌బాగల్‌, బంగారుపేట, కోలార్‌, తమిళనాడులోని కృష్ణగిరి, గుంటూరు ప్రాంతాల్లో సైతం కేసులు నమోదయ్యాయన్నారు. ప్రధాన నిందితుడు వెంకయ్యపై వందకు పైగా కేసులుంటే, మీరాపై 75 కేసులు, తులసిరామిరెడ్డిపై పదికి పైగా కేసులు ఉన్నట్టు వెల్లడించారు. 35 కేసుల్లో నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారని తెలిపారు.

లాకర్లలో బంగారం

కాగా గంగవరంలో నిందితులు చేసిన చోరీలో దోచుకున్న బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్‌లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇక కోలార్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో కేజీ బంగారు ఆభరణాలు, ముల్‌బాగిల్‌లో రూ.15 లక్షల నగదు, నంగిలి, మధురై ప్రాంతాల్లో కూడా చోరీలకు పాల్పడినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదించిన సీఐ మోహన్‌రెడ్డి, ఏఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ.. నగదు ప్రోత్సాహకాలు అందచేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ రాజశేఖర్‌ రాజు, ట్రైనీ ఐపీఎస్‌ తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement