
ఇదీ ఎన్నికల హామీ
కాణిపాకం : మహిళలకు ఉచిత బస్సు హామీ మాటల గారడీలా కనిపిస్తోంది. ఉచితం కేవలం పల్లె వెలుగును మాత్రమే పరిమితం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్త ప్రయాణంతో పాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల ప్రయాణం ఉండదనే అనుమానాలు మహిళల్లో వ్యక్తం అవుతోంది. దీనికి తోడు డ్రైవర్, కండక్టర్, బస్సులు కొరత వేధిస్తోంది. పల్లెకు అరకొర సేవలతో నెట్టుకొస్తున్నారు. పల్లె వెలుగులో డొక్కు బస్సులు, కాలం చెల్లినవే ఉన్నాయని, ఆంక్షలు లేని ఉచిత బస్సును ప్రవేశ పెట్టాలని మహిళలు కోరుతున్నారు.
బస్సుల సంఖ్య పెంచకుండా..
ప్రస్తుతం జిల్లాలో 1.20 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే మరో 10 నుంచి 20 శాతం మంది అధికంగా ప్రయాణించే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి నివేదికలను పంపారు. అయితే ఆ దిశగా బస్సుల సంఖ్య పెంచకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఉన్న బస్సులు సైతం ఉచితానికి మొరాయిస్తున్నాయి. అల్ట్రా బస్సులు ఉచితంలో చేర్చిన జిల్లాలో ఆ బస్సులు లేవు. అలాగే ఒక్క సిటీ బస్సు కూడా తిరగడం లేదు. ఎక్స్‌ప్రెస్ సర్వీసులను కూడా ఉచితానికి ఇవ్వరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేస్తే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అరకొర అని చెప్పవచ్చు. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్త ఉచిత ప్రయాణానికి ఎసరు పెడుతున్నారని పలువురు మహిళలు విమర్శలు గుప్పిస్తున్నారు.
బస్సు కండీషన్ అంతంతే....
గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలో ఆర్టీసీ సేవలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. డిపోలలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న బస్సుల్లో చాలా వరకు కండీషన్‌లో లేవు. కాలం చెల్లాయి. కుప్పం, పలమనేరు, చిత్తూరు వన్ వంటి డిపోల్లో బస్సులు డొక్కు బడ్డాయి. ఎక్కడిక్కడికి నిలిచిపోతున్నాయి. ప్రమాదం నుంచి తప్పించుకున్న ఘటనలు చూస్తున్నాం. మరోవైపు డ్రైవర్లు, కండక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని భర్తీ చేయలేదని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పల్లెకు బస్సులు కరువు
జిల్లా వ్యాప్తంగా 697 పంచాయతీలుంటే వీటి కింద సుమారు 6 వేల గ్రామాలున్నాయి. ఆర్టీసీ నష్టాలను సాకుచూపి కేవలం 164 రూట్లల్లో మాత్రమే బస్సులను తిప్పుతున్నాయి. ఈ మార్గాల్లోని 708 గ్రామాలకు మాత్రమే పల్లె వెలుగు సేవలు అందుతున్నాయి. మిగిలిన గ్రామాలకు పల్లె వెలుగు సేవలు అందని ద్రాక్షలా మారాయి. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేని గ్రామాల ప్రజలు ఆటోలపై ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు బడులు, కళాశాలకు వెళ్లడానికి కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయకపోవడంతో ఆటోలలో ప్రమాదకరంగా ప్రయణిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తేనే ఉచిత బస్సు ప్రయోజనాలను మహిళలు పొందగలుగుతారు. లేకపోతే కూటమి ప్రభుత్వం ప్రచారానికి మాత్రమే ఈ పథకం అమలు పరిమితం కానుంది.
సరిపడా బస్సులు ఏవీ?
జిల్లావ్యాప్తంగా 5 ఆర్టీసీ బస్సు డిపోల పరిధిలో మొత్తం 463 బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆర్టీసీ బస్సులు 392, అద్దె బస్సులు 71 దాకా నడుస్తున్నాయి. వీటిలోఆర్టీసీకి సంబంధించిన పల్లె వెలుగు బస్సులు 232, అద్దె బస్సుల కింద 35 పల్లె వెలుగు బస్సులు తిరుగుతున్నాయి. ఇవే జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే ఆయా రూట్లలో బస్సులు తక్కువగా ఉండటం, రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆర్టీసీ సర్వీసులపై గతేడాదిగా విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణమంటే కొంత ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం మహిళలు 11,49,661 మంది ఉన్నారు. ఇంత మంది మహిళలున్నా కేవలం 232 పల్లెవెలుగు బస్సులకు మాత్రమే ఉచిత సదుపాయం ఇవ్వడమేంటని మహిళామణులు ప్రశ్నిస్తున్నారు.
ఉచిత బస్సుకు కండీషన్లు పెట్టొద్దు
ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తామంది. ఈ మేరకు ఉచిత బస్సును అమలు చేయాలి. మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సుల సౌకర్యం కల్పించాలి. పల్లె వెలుగు మాత్రమే పరిమితం చేయకుండా..అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
– కోకిల, కుప్పం
ఉచితంపై వెనుకడుగు వేయొద్దు
ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది నెరవేర్చాలి. ఉచిత బస్సు విషయంలో వెనకడుగు వద్దు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణించేలా బస్సు సౌకర్యం కల్పించాలి. కొన్ని బస్సులకు మాత్రమే ప్రయాణాన్ని సర్దుబాటు చేయొద్దు. చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి. ఆటోల ప్రయాణంతో అవస్థలు పడుతున్నాం. – సరిత, యాదమరి
●
వేధిస్తున్న బస్సుల కొరత
ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తామంటున్న ప్రభుత్వం
కేవలం పల్లె వెలుగు బస్సులకే
పరిమితమా?
జిల్లా వరకే పరిమితం చేయనున్న వైనం
ఉచితం ఉమ్మడి జిల్లాకు కూడా అనుమానమే!
అరకొరగానే సిబ్బంది
మాట తప్పొద్దంటున్న మహిళలు
ఏడాదిగా ఊరిస్తూ..
సూపర్–6లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమన్న హామీని ఏదాది దాటినా అమలు చేయకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తూ వస్తోంది. గత కొంత కాలంగా ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం ప్రారంభిస్తామని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు అమలుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంక్షలు పెట్టి ఉచిత బస్సు ప్రయాణాన్ని నెట్టుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల ముందు కూటమి నేతలు ఇంటింటికి తిరిగి రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఊదరగొట్టారు. తాజాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కేవలం పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్ బస్సులలో మాత్రమే సదుపాయం ఉంటుందని అక్కడక్కడా చెబుతుండడంపై మహిళలు అసహనం వ్యక్తం చేసున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎక్కడా పల్లెవెలుగు, అల్ట్రా డీలక్స్ బస్సులలో మాత్రమే ఉచితమని చెప్పలేదు. తీరా అధికారం చేపట్టిన తరువాత చంద్రబాబు హామీలపై ఆంక్షలు పెట్టారని మహిళలు ఆరోపిస్తున్నారు. చిరువ్యాపారాలు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థినులు పట్టణాలకు వెళ్లాలంటే ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. వాటిలో ప్రయాణ సదుపాయం ఇవ్వకపోతే ఉపయోగమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న ఒకటి అర పల్లె వెలుగు బస్సులో ప్రయాణించడం కష్టమని పెదవి విరుస్తున్నారు..

ఇదీ ఎన్నికల హామీ

ఇదీ ఎన్నికల హామీ