
సఖ్యత లేకనే వివాదాలు
చిత్తూరు కలెక్టరేట్ : పలు ప్రాంతాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య సఖ్యత లేకనే వారి మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని డీఆర్‌వో మోహన్ కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా విభిన్న ప్రతిభావంతులశాఖ ఆధ్వర్యంలో ఒక రోజు ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007, ట్రాన్స్‌జెండర్ హక్కుల చట్టం 2019పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులతో సహా ఎవరైనా సీనియర్ సిటిజన్ తన సొంత సంపాదన, సొంత ఆస్తి నుంచి తనను తాను కాపాడుకోలేక పోయినప్పుడు ప్రాథమికంగా ఆర్‌డీవో అధ్యక్షతన ఉన్న ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సీనియర్ సిటిజన్, తల్లిదండ్రులకు ఆహారం, వైద్యం, వసతి తదితర ప్రాథమిక అవసరాలను తప్పనిసరిగా నెరవేర్చాలన్నారు. ఎవరైనా విస్మరిస్తే చట్టం ప్రకారం మూడు నెలల జైలుశిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తారన్నారు.
తల్లిదండ్రుల సంక్షేమం వారసులదే
తల్లిదండ్రుల సంక్షేమం వారసులదేనని సీనియర్ న్యాయవాది హిమబిందు అన్నారు. వృద్ధులు, తల్లిదండ్రులు తాము పొందాల్సిన హక్కులకు భంగం కలిగితే ఆర్‌డీవో పరిధిలోని ట్రిబ్యునల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓరియెంటేషన్ కార్యక్రమంలో డీఎస్పీ సాయినాథ్, డిప్యూటీ కలెక్టర్ అనుపమ, డీఈవో వరలక్ష్మి, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ ఉమాదేవి పాల్గొన్నారు.