
అప్రమత్తంగా ఉండాలి
యాదమరి : ప్రతి బాంబు బెదిరింపు కాల్స్‌ను నిజమైందిగా భావించి వెంటనే స్పందించాలని ఎట్టి పరిస్థితిల్లోనూ అశ్రద్ధ వహించరాదని అడిషనల్ ఎస్పీ శివానందకిషోర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఐఓసీఎల్‌లో బాంబు స్క్వాడ్ సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణాలకు ముప్పు ఎదురైనప్పుడు సమర్థవంతంగా, శాసీ్త్రయంగా స్పందించే విధంగా అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. ఐఓసీఎల్ వంటి ప్రాముఖ్యమైన ప్రదేశాలలో ఎటువంటి అవాంఛనీయ ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తంగా ఉండటమే లక్ష్యంగా మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తరహా డ్రిల్లుతో పోలీసు సిబ్బంది స్పందన వేగాన్ని పరీక్షించడం, పరిష్కార సామర్థ్యాన్ని మెరుగుపరచడం ముఖ్య లక్ష్యమన్నారు. అలాగే ఐఓసీఎల్ వంటి కీలక స్థలాల్లో ఎప్పటికప్పుడు భద్రతా వ్యవస్థను పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మహబూబ్ భాష, ఎస్సై ఈశ్వర్, తహసీల్దార్ పార్థసారథి, ఐఓసీఎల్ సీటీఎం ప్రసాదరావు పాల్గొన్నారు.