
టెండర్ లేకుండానే పనులా?
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండుకు సంబంధించిన స్థలం. గతంలో ఇక్కడ వేసిన రోడ్డుకు ఆర్టీసీ సంస్థ నుంచే నిధులు కేటాయించారు. పిలవని పేరంటానికి తామున్నామంటూ ప్రస్తుతం దాదాపు రూ.45 లక్షల వ్యయంతో మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ ఫుట్‌పాత్ నిర్మిస్తోంది. రూ.45 లక్షలు ఏ మురికివాడ అభివృద్ధి, శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులకో వెచ్చిస్తే పన్నులు చెల్లించే ప్రజలు హర్షిస్తారు. ఇక ఈ పనులు చేయడానికి కార్పొరేషన్ ఆన్‌లైన్ టెండర్లు పిలవగా, మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు సమయం ఉంది. ఆపై ఎవరెవరు టెండర్లు వేసారో చూసి, తక్కువ మొత్తం కోట్ చేసిన వారికి పనులు అప్పగించాలి. నెల్లూరులోని పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ నుంచి అనుమతి పొందాలి. వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. ఇవన్నీ జరగడానికి 30 రోజుల సమయం పడుతుంది. అసలు ఆన్‌లైన్ టెండర్లు తెరవకుండానే, టెండరు ఎవరికి వచ్చాయో తెలియకుండా పనులు చేసేస్తున్నారు. కార్పొరేషన్ ఏఈఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తుండటం విశేషం. చిత్తూరులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ నిధుల్లోని దాదాపు రూ.43 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ప్రహరీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హై రోడ్డు విస్తరణపై ప్రభుత్వం నుంచి పరిహారంపై ఎలాంటి ప్రకటన రాకమునుపే.. కొంగారెడ్డిపల్లె రోడ్డు విస్తరణ తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా అత్యవసరంగా రూ.43 లక్షలతో నిర్మిస్తున్న ఈ పనులకు కార్పొరేషన్‌లోని ఏ నిధులు వెచ్చించాలి..? అంచనాలు ఎంత..? ఆన్‌లైన్ టెండరు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభించాలి..? ఇలాంటి ఏ ఒక్క నిబంధన పట్టించుకోకుండా ప్రజాధనం నిబంధనలకు విరుద్ధంగా వెచ్చిస్తున్నారు.
లెటర్ ఇస్తే సరిపోతుందా..?
అభివృద్ధి పనుల విషయంలో ఆన్‌లైన్‌లో ఒకరికన్నా ఎక్కువ మంది పోటీపడితే.. స్వయాన ఇంజినీరింగ్ అధికారులు దళారులుగా అవతారం ఎత్తుతున్నారు. టెండరు వచ్చిన వ్యక్తి నుంచి పలు కారణాలతో తాను ఈ పని చేయలేకపోతున్నానంటూ లెటర్లు తీసుకుంటున్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్దం. కానీ అధికారులు ఏమాత్రం వీటిని పట్టించుకోవడంలేదు. కార్పొరేషన్‌లో టెండర్ల వ్యవహారంలో దాదాపు అధికార పార్టీ నాయకులే పాల్గొంటున్నారు. ఎవరికి టెండరు వస్తే వాళ్లు పనులు చేసుకోవచ్చు. కానీ ఇలా టెండర్లు పూర్తవకుండానే పనులు చేయడంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ పొరపాట్లను సరిదిద్దుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది.
రూ.కోట్ల పనులు నామినేట్‌గా తమ్ముళ్లకే
నిబంధనలు గాలికి.. ఇష్టానుసారంగా పనులు
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇష్టారాజ్యం
టెండర్ లేకుండానే తమ్ముళ్లకు పనుల పంపకాలు
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సివిల్ పనులు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. తమ అనుచరులకు పనులు కట్టబెట్టడానికి అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేయడం, వీటిని అమలు చేయడంలో అధికారులు కనీస నిబంధనలు పాటించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రూ.లక్ష దాటిన ప్రతి ఒక్క పనికి ఆన్‌లైన్ టెండరు పిలవాల్సి ఉంది. కానీ ఎలాంటి టెండర్లు లేకుండానే నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.కోట్ల వ్యయంతో పనులు చేసేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో..? రేపు టెండర్లలో పోటీ వస్తే ఏం చేయాలి..? సరైన పత్రాలు లేకుండా టెండరు తిరస్కరణకు గురైతే పరిస్థితి ఏంటి..? అనే విషయలపై అధికారులు ఏమాత్రం ఆలోచించడంలేదు.
తప్పని తేలితే చర్యలు
అభివృద్ధి పనుల్లో నిబంధనలు పాటించకుండా ఉండటం అంటూ ఏమీ లేదు. కొన్ని పనులు కౌన్సిల్ ముందస్తు అనుమతితో అత్యవసర దృష్ట్యా చేయిస్తున్నాం. వాటర్ వర్క్స్, లైట్స్, టాయ్‌లెట్స్ అనేవి అత్యవసరం. నామినేటెడ్ పనులు ప్రత్యేకించి ఒకరికి ఇవ్వడంలేదు. టెండర్ల దశలో ఉన్న అంశాలకు ముందస్తుగానే పనులు ప్రారంభించడం నా దృష్టికి రాలేదు. దీనిపై ఇంజినీరింగ్ అధికారుల నుంచి సంజాయిషీ తీసుకుంటా. తప్పని తేలితే చర్యలు తీసుకుంటాం.
– నరసింహ ప్రసాద్, కమిషనర్, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్
విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తాం
కార్పొరేషన్ అధికారులు తప్పు మీద తప్పు చేస్తున్నారు. టెండర్లు పూర్తవకుండానే పనులు చేయడం చట్ట విరుద్దం. అలాంటప్పుడు మీకు నచ్చినవాళ్లకు పనులు అప్పగించుకోండి. టెండర్లు ఎందుకు పిలవడం. నగర అభివృద్ధిని మా పార్టీ ఎప్పుడూ స్వాగతిస్తుంది. కానీ అదే సమయంలో నిబంధనలు పాటించకుండా అంతా మా ఇష్టం అంటే కుదరదు. నాయకులు చెప్పారని అధికారులు ఇష్టం వచ్చినట్లు చేస్తే, రేపు దోషులుగా నిలబడేది అధికారులే. విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేస్తాం. – ఎంసీ.విజయానందరెడ్డి, చిత్తూరు సమన్వయకర్త, వైఎస్సార్‌సీపీ

టెండర్ లేకుండానే పనులా?

టెండర్ లేకుండానే పనులా?

టెండర్ లేకుండానే పనులా?