
జగనన్నను కలిసిన మాజీ మంత్రి రోజా
నగరి : మాజీ సీఎం వైఎస్ జగన్‌ను మాజీ మంత్రి ఆర్కేరోజా మంగళవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కలిశారు. వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు.
పలువురు సీఐలకు
స్థాన చలనం
చిత్తూరు అర్బన్ : జిల్లాలో పలువురు ఇన్‌స్పెక్టర్లను (సీఐ) అటాచ్‌మెంట్‌పై బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ చందోలు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు ట్రాఫిక్‌లో పనిచేస్తున్న జి.నిత్యబాబును చిత్తూరు తూర్పు (తాలూక), తాలూకలో పనిచేస్తున్న బి.శ్రీనివాసరావును చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్, వేకెంట్ రిజర్వు (వీఆర్)లో ఉన్న కె.లక్ష్మీనారాయణను చిత్తూరు ట్రాఫిక్, మహిళా స్టేషన్‌లో పనిచేస్తూ, వన్‌టౌన్‌లో అదనపు విధులు నిర్వర్తిస్తున్న సీఐ ఎం.మహేశ్వరను వన్‌టౌన్‌కే పరి మితం చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎంపీటీసీ ఎన్నిక షెడ్యూల్ జారీ
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని రామకుప్పం మండలం మనేంద్రం ప్రాంతం ఎంపీటీసీ ఎన్నిక షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల అధికారి నీలంసాహ్ని జారీ చేశారని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. మంగళవార జెడ్పీ కార్యాలయంలో వివరాలను తెలియజేశారు. గతంలో ఆ ప్రాంతం ఎంపీటీసీగా ఉన్న శాంతికుమారి చనిపోవడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడిందని గుర్తు చేశారు. 30న నామినేషన్ దాఖలు, ఆగస్టు 1న స్వీకరణకు చివరి రోజు, 2న పరిశీలన, 3 అప్పిల్, 4న అప్పిళ్ల పరిష్కారం, 5న నామినేషన్ ఉపసంహరణ, అభ్యర్థుల ప్రకటన, 12న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు తదుపరి విజేతల ప్రకటన ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణ పనులు చేపట్టామని వివరించారు.
పది రోజుల్లో మార్పు చూపాలి
చౌడేపల్లె : స్కూల్‌కు పది రోజుల తరువాత మళ్లీ వస్తా.. వంట గది మార్చాలి... కట్టెల పొయ్యిపై బదులు గ్యాస్‌పై మధ్యాహ్న భోజనం రుచిగా నాణ్యతగా చేయాలని డీఈఓ వరలక్ష్మి వంట నిర్వాహకులు, హెచ్‌ఎంను హెచ్చరించారు. మంగళవారం చౌడేపల్లె ఉన్నత పాఠశాలను డీఈఓ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తిని రుచి చూశారు. గ్యాస్ పొయ్యిపై వంట చేయకుండా కట్టెల పొయ్యిపై ఎందుకు చేస్తున్నారు.? కచ్చితంగా గ్యాస్ పొయ్యిపై వంట చేయాలని వంట నిర్వాహకులకు సూచించారు. మెనూ ప్రకారం కూరగాయలు, పప్పు వినియోగించాలని నాణ్యత పాటించాలని ఆదేశించారు. వంట గది పరిశుభ్రత పాటించలేదని, వంట నిర్వహణ ప్రదేశాన్ని మార్పుచేయాలని హెచ్‌ఎం నాగరాజరెడ్డికి సూచించారు. ఉన్నత పాఠశాల ఆవరణంలో నాడు–నేడు ద్వారా గత ప్రభుత్వంలో చేపట్టి అసంపూర్తిగా మిగిలిన తరగతి గదుల నిర్మాణ పనులకు నిధులు మంజూరునకు కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు. విద్యా బోధనపై ప్రత్యేక దృష్టి సారించి రానున్న ‘పది’పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని డీఈఓ సూచించారు. ఆమె వెంట ఎంఈఓ–2 తిరుమలమ్మ, సీఆర్పీలు ఉన్నారు.
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కార్వేటినగరం : మండల కేంద్రంలోని ఆర్కేఎస్సార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ స్వరూప పేర్కొన్నారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృత్తి విద్యలో ఖాళీగా ఉన్న ఎంఎల్‌టీ కోర్సు బోధించడానికి అతిథి అధ్యాపకులు అవసరమన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మెడికల్ గ్రాడ్యుయేట్స్ లేదా ఎంఎస్సీ మైక్రో బయాలజీలో 50 శాతం మార్కులు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆగష్టు 1వ తేదీ ఉదయం 10 గంటలకు కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

జగనన్నను కలిసిన మాజీ మంత్రి రోజా