
కిలో మామిడికి రూ.12 చెల్లించాల్సిందే
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మామిడి రైతులకు ప్రభుత్వ నిర్ణయం మేరకు కిలోకు రూ.12 కచ్చితంగా చెల్లించాల్సిందేనని మామిడి రైతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ డిమాండ్ చేశారు. ఆ సంఘం నాయకులు మంగళవారం కలెక్టర్‌ను కలిసి పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్, మురళీమోహన్ ప్రభుత్వ నిర్ణయం ఉల్లంఘించి రూ.12 అమలు చేయని ఫ్యాక్టరీ యజమానులు, ర్యాంపు నిర్వాహకులపై కఠిన చర్యలుంటాయని వెల్లడించారన్నారు. వారి నిర్ణయం మేరకు ప్రభుత్వం వెంటనే తోతాపురి కి ప్రకటించిన మద్ధతు ధర రూ.12 సత్వరం రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు ఆనందనాయుడు, ప్రధాన కార్యదర్శి హరిబాబుచౌదరి, కోశాధికారి సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు మునీశ్వరరెడ్డి, మునిరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.