ఇష్టారాజ్యంగా మింగేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యంగా మింగేస్తున్నారు!

May 12 2025 6:46 AM | Updated on May 12 2025 6:46 AM

ఇష్టా

ఇష్టారాజ్యంగా మింగేస్తున్నారు!

చెరువు చుట్టూ పదూళ్లకు ఆదరువు.. చెరువే మనుగడకు ఆధారం..తొలకరికి ఆవాసం.. సిరులకు ప్రాకారం.. చెరువే సమస్తం.. మన నేస్తం.. అలాంటి నీటి వనరులను అభివృద్ధి చేసి వినియోగించుకోవాలి. అయితే వాటికి రక్షణ లేకుండా పోతోంది. పైగా అవి అక్రమణలకు అడ్డాగా మారుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు కళ్లున్న ధృతరాష్ట్రుల్లా చేష్టలుడిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితంగా వందలాది ఎకరాల విస్తీర్ణంతో అలరారే చెరువులు చిక్కి శల్యమై.. చివరకు కనుమరుగవుతున్నాయి.

కబ్జాలకు కారణాలివే..

● అధికార యంత్రాంగం ఉదాసీనత.

● చెరువుల సరిహద్దులు నిర్దేశించకపోవడం.

● చిత్తూరు, తిరుపతి నగరాల్లో భూములకు భారీ డిమాండ్‌ రావడం.

● తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లను అడ్డుకోలేక పోవడం.

● రెవెన్యూ, ఇరిగేషన్‌, పురపాలక, నగరపాలక అధికారుల మధ్య సమన్వయలోపం.

● చట్టంలోని లొసుగుల కారణంగా ఆక్రమణలు గుర్తించినా తొలగించే పరిస్థితి లేకపోవడం.

● చెరువును పూడ్చి అందులో అక్రమంగా నిర్మించి న నివాసాలకు విద్యుత్‌,నీటి వసతి కల్పించడం.

● అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులే పలుచోట్ల చెరువుల్లో వెంచర్లు వేయడం.

● వరదలొచ్చి మునిగినప్పుడే తప్ప మిగిలిన సమయాల్లో అధికారులు ఆక్రమణలపై దృష్టి పెట్టకపోవడం.

చిత్తూరు కలెక్టరేట్‌ : చెరువు అంటేనే రైతాంగానికి, నీటి నిల్వలకు కల్పతరువు. కానీ అవే చెరువులు మరికొద్ది రోజుల్లో పుస్తకాల్లో మాత్రమే చదువుకునే స్థితికి చేరుకునేలా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కబ్జాలకు గురవుతున్నాయి. రెండు జిల్లాల్లో వేల సంఖ్యలో చెరువులు ఆక్రమణల చెరలో పడినట్లు చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు వెల్లడిస్తున్నారు. ఈ లెక్కన కనిపించకుండా పోవడానికి మరెంతో కాలం పట్టేట్టు లేదు. ఇటీవల పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో చెరువుల పరిరక్షణకు తీసుకొచ్చిన హైడ్రా చట్టం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కారు చెరువులు కబ్జాకు గురవుతున్నా చూసీ చూడనట్టు మిన్నకుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆక్రమణల పర్వం ఇలా..

● చిత్తూరు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోని గిరింపేట గంగినేని చెరువు నగరంలో ప్రధానమైనది. ఇది 45 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఇప్పటికే 10 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి.. చెరువు సమీపంలో 125–1 సర్వే నంబర్‌తో 1975లో డీకేటీ పట్టా ఇచ్చారు. దాన్ని మళ్లీ అధికారులే 1978లో రద్దు చేశారు. అలాగే నగర శివారులోని జడియం చెరువు, కట్టమంచి చెరువు, దుర్గానగర్‌ కాలనీలోని కుమ్మరివాని కుంట చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని చెరువుల్లో దాదాపు 75 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి.

● నగరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలం ఎస్‌బీఆర్‌పురం చెరువు ఆక్రమణకు గురైంది. ఆ చెరువు మొత్తం విస్తీర్ణం 487 ఎకరాలు. అందులో 48 ఎకరాలు, 439 ఎకరాలకు మునక పట్టాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జీవో నంబర్‌ 188 ప్రకారం చెరువులో నీరు లేనప్పుడు మాత్రమే రైతులు సాగు చేయాలి. అయితే స్థానిక టీడీపీ నాయకుడు చెరువులో గ్రావెల్‌ పోసి లెవల్‌ చేసుకుని దాదాపు 2 ఎకరాలు ఆక్రమించుకున్నారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు.

● తిరుపతి నగరంలోనే 8 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పార్టీలకు చెందిన నేతలు పోటాపోటీగా ఆక్రమించేస్తున్నారు. కొందరు నేతలు రెవెన్యూ అధికారులకు ముందే చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఖాళీగా ఉన్న చెరువు స్థలాన్ని ఆక్రమిస్తున్నాం. దాని జోలికి రాకండి అంటూ ఆదేశిస్తున్నారు. దీంతో కొందరు రెవెన్యూ అధికారులు ఆక్రమణలపై తమకు సమాచారం ఉన్నప్పటికీవాటి జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నాచెరువు 77.46 ఎకరాలు, శెట్టిపల్లె చెరువు 55.25 ఎకరాలు, చెన్నాయగుంట 52.56 ఎకరాలు, పాన్‌ చెరువు 49.40 ఎకరాలు, కొరమీనుగుంట 32.20 ఎకరాలు, పూలవాని గుంట 23.82 ఎకరాలు, గొల్లవాని గుంట 29.04 ఎకరాలు, మంగళం చెరువు 75.98 ఎకరాలు ఉంది. మొత్తంగా 8 చెరువుల విస్తీర్ణం 395.71 ఎకరాలు అయితే ఇందులో 100 ఎకరాలకు పైగానే ఆక్రమణలకు గురైంది.

● తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం జంగాలపల్లెలోని సాగునీటి చెరువు 15 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆ చెరువు స్థలాన్ని నాయుడుపేటకు చెందిన వ్యక్తులు ఆక్రమించుకున్నారు.

● తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు చెరువు విస్తీర్ణం సుమారు 156 ఎకరాలు. అందులో 50 ఎకరాల వరకు రైతులు ఆక్రమించుకుని సాగు చేస్తున్నారు.

● తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాళెంలోని చెరువు ఆక్రమణకు గురవుతోంది. సర్వే నంబర్‌ 839లోని 11 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది . అది రోడ్డుకు ఆనుకుని ఉండడంతో అక్రమంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అధికారులు ఈ విషయం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.

● చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో మొత్తం 787 చెరువులున్నాయి. ఇందులో మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులు (100 ఎకరాల విస్తీర్ణం ఉన్నవి) 57 వరకు ఉన్నాయి. చిన్నపాటి కుంటలు 60 వరకు ఆక్రమణలకు గురై కనుమరుగయ్యాయి. మిగిలిన వంద చెరువులు 10 నుంచి 30 శాతం వరకు కబ్జాల బారిన పడ్డాయి. ఈ చెరువుల కింద ఆయకట్టు గతంలో 20 వేల హెక్టార్లుగా ఉండగా ఇప్పుడు 2 వేల హెక్టార్‌లలో మాత్రమే పంటలు సాగు చేస్తున్నారు.

● సత్యవేడు మండలం మాదనపాళెం గ్రామంలోని చెరువు ఆక్రమణ చెరలో చిక్కుకుంది. కొందరు అక్రమార్కులు దర్జాగా ఇళ్ల నిర్మాణం చేపట్టేశారు. మాదనపాళెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 839లో 11 ఎకరాల విస్తీర్ణంలో ఇరిగేషన్‌ చెరువు ఉంది. దీని ఆయకట్టు భూములను శ్రీసిటీ సెజ్‌కు కేటాయించారు. ఇదే అదునుగా కబ్జాదారులు రెచ్చిపోయి అక్రమ నిర్మాణాలు చేపట్టారు.

చిట్టమూరు మండలం జంగాలపల్లి

చెరువులో ఆక్రమణలు

ఆక్రమణలో చిత్తూరు జిల్లా కేంద్రంలోని గంగినేనిచెరువు

తిరుపతి జిల్లా కేంద్రంలో ఆక్రమణలో చెన్నాయగుంట చెరువు

కబ్జాకు గురైన సత్యవేడు మండలం మాదనపాలెం గ్రామ చెరువు

అడిగేదెవరు.. ఆపేదెవరు?

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెరిగిపోతున్న చెరువుల హద్దులు

నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు

యథేచ్ఛగా ప్లాట్లు వేసి విక్రయాలు

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పట్టణాలు, నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్నారు. వందల సంఖ్యలో జల వనరులు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చిన వాటిలో కొన్ని ఆక్రమణల పాలై కనుమరుగు కాగా మరికొన్ని మురుగునీటి కాసారాలుగా మారుతున్నాయి. గట్లు, కాలువతోపాటు చెరువుల భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నా రు. చెరువుల్లో ఏర్పాటు చేసిన వెంచర్లతో రూ.వందల కోట్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతోంది.

2వేల వరకు కబ్జా కోరల్లో..!

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మొత్తం 8,063 చెరువులు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో దాదాపు 2 వేల చెరువులు ఆక్రమణలకు గురైనట్లు తెలుస్తోంది. వీటిలో అత్యధికంగా రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చేసిన కబ్జాలే ఎక్కువ. సామాన్యుడు చెరువు గట్టుపై చిన్న పాక వేస్తే అధికారులు వెంటనే స్పందిస్తారు. ఆగమేఘాలపై వాటిని తొలగించేస్తారు. అదే ఆక్రమణలకు పాల్పడిన కూటమి ప్రజాప్రతినిధుల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇష్టారాజ్యంగా మింగేస్తున్నారు!1
1/2

ఇష్టారాజ్యంగా మింగేస్తున్నారు!

ఇష్టారాజ్యంగా మింగేస్తున్నారు!2
2/2

ఇష్టారాజ్యంగా మింగేస్తున్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement