మార్కులు కాదు.. మార్పు తేవాలి! | - | Sakshi
Sakshi News home page

మార్కులు కాదు.. మార్పు తేవాలి!

May 21 2025 1:27 AM | Updated on May 21 2025 1:27 AM

మార్క

మార్కులు కాదు.. మార్పు తేవాలి!

● జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో 11 అంశాలపై సర్వే ● నాలుగు రోజుల క్రితం రాష్ట్రశాఖ మార్కుల వెల్లడి ● 76.36 మార్కులతో జిల్లా వెనకడుగు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో 50 పీహెచ్‌సీలున్నాయి. ఏడాది క్రితం వరకు రోజువారీగా ఒక్కో పీహెచ్‌సీకి 100 నుంచి 150 వరకు ఓపీలొచ్చేవి. ఇప్పుడు ఈ సంఖ్య తగ్గుముఖం పట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్య సేవలు గాలిలో దీపంలా మారాయి. క్షేత్ర స్థాయిలో తూతూమంత్రంగా వైద్య సేవలు అందుతున్నాయి.

వదలని నిర్లక్ష్యపు జబ్బు

మాతా శిశు సంక్షేమ కార్యక్రమాల విషయాన్ని జిల్లాలోని వైద్యులు, సిబ్బంది పూర్తిగా గాలికొదిలేశారు. గర్భిణుల గుర్తింపులో నిర్లక్ష్యం చేస్తున్నారు. హైరిస్క్‌ కేసుల విషయంలో చూసీచూడనట్లు ఉండిపోతున్నారు. ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్య సేవలందించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. పీహెచ్‌సీలో సుఖ ప్రసవాలు చేయాలనే లక్ష్యాన్ని అలక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి.

ముఖం చాటేస్తున్నారు

పీహెచ్‌సీకి వచ్చే రోగులపై వైద్యులు, సిబ్బంది ముఖం చాటేస్తున్నారు. మధ్యాహ్నంపైగా పలు చోట్ల డాక్టర్లు ఉండడం లేదు. మీటింగ్‌ల పేరుతో డుమ్మా కొడుతున్నారు. కొందరు యూనియన్‌ పేర్లు చెప్పుకుని కాలయాపన చేస్తున్నారు. దీంతో పీహెచ్‌సీల్లో అరకొర వైద్య సేవలందుతున్నాయి. వచ్చిన వారికి కొన్ని మందు బిల్లలు ఇచ్చి పంపించేస్తున్నారు. చాలా చోట్ల వైద్య సేవలు కనుమరుగవుతున్నాయి. సీజనల్‌ వ్యాధుల సమయంలో అధికారులు, సిబ్బంది చోద్యం చూస్తున్నారు.

పనితీరుకు ఒక మార్కు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో అందించే సేవలు, పనితీరు ఆధారంగా జిలాల్లకు మార్కులు కేటాయించారు. సీజనల్‌ వ్యాధుల కట్టడి నుంచి మాతాశిశు ఆరోగ్యం వరకు 11 అంశాల్లో సంతృప్తి స్థాయి, లోటుపాట్లను లెక్కించారు. జిల్లా వారీగా మార్కులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో చిత్తూరు జిల్లా 76.36 మార్కులతో వెనకబడింది. కొన్ని సేవల్లో పర్వాలేదనిపించింది.

11 అంశాల వారీగా కేటాయించిన మార్కులు

అంశం మార్కులు

గర్భవతుల సేవలు – 12.07

శిశు సంక్షేమం, రొటీన్‌ టీకాలు – 8.15

కుటుంబ నియంత్రణ – 2.06

విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు – 9.87

సంక్రమిత, అసంక్రమిత వ్యాధులు – 5.70

ఆర్‌బీఎస్‌కే – 3.53

జాతీయ ఆరోగ్య మిషన్‌ – 8.20

ఆస్పత్రుల నాణ్యత, సేవలు – 1.86

అభ(ఆయుష్మాన్‌ భారత్‌), అటెండెన్స్‌ – 4.95

సీజనల్‌ వ్యాధులు – 9.14

నిధుల కేటాయింపు – 4.35

నిర్లక్ష్యమంటే కుదరదు

పీహెచ్‌సీలో వైద్య సేవలు పక్కాగా అమలు చేస్తున్నాం. విధుల్లో అలసత్వం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. కచ్చితంగా నిర్ణీ త సమయంలో వైద్యు లు అందుబాటులో ఉండాలి. ఆరోగ్య, వైద్యసేవలను పల్లెల్లో విస్తృతం చేయాలి. గర్భవతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సీజనల్‌ వ్యాధుల కట్టడికి చ ర్యలు తీసుకుంటాం. అధికారులు, సిబ్బంది మారాలి. సేవల్లో మెరుగైన మార్పులు కనబరచాలి.

– సుధారాణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు

తప్పుల తడక

వైద్య, ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వీటిని ఫొటోలతో సరిపెట్టేస్తున్నారు. చాలాచోట్ల ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు విదులకు పంగనామాలు పెడుతున్నారు. సర్వేలను సాకుగా చూపించి వైద్య ఆరోగ్య సేవలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎన్‌సీడీ సర్వేలన్నీ కూడా తప్పుల తడకగా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇంట్లోనే కూర్చుని సర్వేలను పూర్తి చేస్తున్నారు. అసంక్రమిత వ్యాధిగ్రస్తులను, అనుమానిత కేసులను గుర్తించడంలో విఫలమవుతున్నారు. సర్వేలో బతికున్నవాళ్లను కూడా చంపేస్తున్నారు. దీంతో ఈ సర్వే తప్పుల తడకగా ఉందని రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇంటికొచ్చి వైద్య సేవలందిస్తున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మార్కులతో సరిపెట్టొద్దని..మార్పు తీసుకోరావాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

మార్కులు కాదు.. మార్పు తేవాలి! 1
1/1

మార్కులు కాదు.. మార్పు తేవాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement