
ద్రవిడ వర్సిటీ
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులకు అప్పులు
10 ఏళ్లలోపు ఆ రుణాన్ని చెల్లించాలి
జీఓ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆందోళనలో తాత్కాలిక ఉద్యోగులు
కుప్పం : ద్రవిడ వర్సిటీకి రూ.5.20 కోట్లు రుణాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జీఓ విడుదల చేసింది. అయితే ఈ నిధులను వర్సిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించుకోమని గానీ ఎక్కడా చెప్పలేదు. పైగా ఈ నిధులను 10 ఏళ్లలోపు మళ్లీ చెల్లించాలని జీఓలో పొందుపరిచారు. కాగా మూడేళ్లలోపు అదనపు బడ్జెట్ కింద నిధులు మంజూరు చేస్తామని.. వీటిని సైతం 10 ఏళ్లలోపు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ నిధులను వర్సిటీలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ జీతాలు చెల్లించేందుకే అని వర్శిటీ అధికారులు స్పష్టం చేశారు.
వేతనాలు నేరుగా అందించకుండా అప్పుగా ఇవ్వడంపై ఒప్పంద ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయంలో గత సంవత్సర కాలానికి పైగా తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్శిటీని ప్రక్షాళన చేసి వీరి జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశగా ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశే మిగులుతోంది. మొదట్లో ఆరు నెలల జీతాలు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ఏడాదికి పైగా జీతాలు రావాల్సి ఉండగా వర్సిటీ అధికారులు ఉన్నత విద్య శాఖ అధికారులకు నివేదికలు పంపారు. అయితే 235 మందికి ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వడం కుదరదని ఇప్పటికే చేతులెత్తేశారు.
ముఖ్యమంత్రి కుప్పం పర్యటన సందర్భంగా..
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం కుప్పంకు విచ్చేస్తున్న నేపథ్యంలో వర్సిటీలోని హెలీప్యాడ్‌కు చేరుకుని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. వర్సిటీలో గత సంవత్సర కాలంగా జీతాలు అందక అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఉద్యోగుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉండకూడదన్న భావనతో వర్సిటికీ రూ.5.20 కోట్లు రుణాన్ని మంజూరు చేస్తూ జీఓను విడుదల చేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీస వేతనాలు అందక
కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వర్సిటీని అభివృద్ధి చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశగా ఎదురు చూస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వీరికి ఎలాంటి అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడంతో పాటు కనీసం జీతాలను వారికి నేరుగా అందించకుండా వర్సిటీకి అప్పుగా ఇవ్వడంతో ఆందోళనకు గురవుతున్నారు. వర్సిటీ ఏర్పాటుకు భూములు అందించినా కనీస వేతనాలను తమకు అందించకుండా చేస్తుండండంతో తమ భవిష్యత్తు అంధకారం నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.