
● నల్లబెల్లం పేరిట అన్నదాతల అరెస్టులు ● సారా తయారీకి బె
చిత్తూరు అర్బన్ : జిల్లాలో రైతులు పండించే ప్రధాన పంటల్లో చెరకు ఒకటి. ఇక్కడి నల్లరేగడి భూముల కారణంగా చాలా వరకు బెల్లం నలుపు రంగులో తయారవుతుంది. కొన్ని రకాల రసాయనాలు, ప్రాసెసింగ్ చేస్తే బెల్లం రంగు మారుతుంది. కానీ గిట్టుబాటు ధర దక్కదు. దీంతో చాలా మంది నల్లబెల్లాన్ని తయారు చేసి మండీలు, అవసరం ఉన్న వాళ్లకు, ట్రేడర్లకు అమ్ముతున్నారు. ఇదే ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. నల్లబెల్లం తయారీ, విక్రయాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆంక్షలు అతిక్రమిస్తున్న అన్నదాతలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి జైలుకు పంపుతోంది. ప్రభుత్వ చర్యలపై రైతులు, రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు.
నవోదయంలో చీకట్లు
నాటుసారా తయారీ, విక్రయాలను అరికట్టడానికి కూటమి ప్రభుత్వం నవోదయం 2.0ను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా సారా తయారు చేస్తున్న కుటుంబాలను ఆ ఊబి నుంచి బయటపడేసి, వాళ్ల జీవన ప్రమాణాలు మార్చడానికి రుణాలు, ఇతర ప్రత్యామ్నాయ పనులను కల్పించాల్సిన ప్రభుత్వం రైతులపై పడింది. నాటు సారా తయారీకి నల్లబెల్లం తప్పనిసరిగా వాడతారని, నల్లబెల్లం తయారు చేస్తున్న రైతులపై నిఘా ఉంచాలని, ఎవరెవరికి నల్లబెల్లం విక్రయిస్తున్నారు..? కొనుక్కునే వ్యక్తి ఆధార్ తీసుకున్నారా..? కిలో ఎంతకు అమ్ముతున్నారు..? అయిదు కిలోలకు పైబడి ఎవరికి అమ్ముతున్నారు..? అని వివరాల సేకరిస్తున్నారు. వాస్తవానికి బెల్లం తయారు చేసిన రైతులు దాన్ని మార్కెట్‌కు తరలించాలంటే తన రవాణాకు కిలో కు రూ.3, మార్కెట్‌లో కమిషన్ రూ.3 అదనపు సుంకంగా చెల్లించాలి. తీరా బెల్లాన్ని విక్రయించిన తరువాత తన పెట్టుబడి దక్కని పరిస్థితి. దీంతో కొందరు రైతులు బెల్లాన్ని మార్కెఫెడ్‌లో విక్రయించడంతో పాటు గ్రామాల్లో అమ్ముతుంటారు. రైతు ల నుంచి బెల్లాన్ని కొన్నవాళ్లు దాన్ని ఫ్యాక్టరీలకు వాడతారో.. పశువులకు దాణాగా ఉపయోగిస్తారో అన్నదాతలకు తెలియదు. కానీ ఎవరైనా సారా తయారు చేస్తూ పట్టుబడితే, నిందితులు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుని బెల్లం విక్రయించారనే నెపంతో రైతులను అరెస్టు చేయడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది.
బెల్లం తయారీలో రైతులు
‘ఈ చిత్రంలో భార్య, బిడ్డలతో తన చెరకు తోట, ట్రాక్టర్‌తో కలిసి ఉన్న రైతు పేరు పెరుమాల్. గతేడాది ఆయుధపూజ నేపథ్యంలో చెరకు పంట ఓ మోస్తరుగా వస్తుండడంతో ఇలా ఫొటో తీసుకున్నాడు. కానీ ఇప్పుడు పెరుమాల్ చిత్తూరు జిల్లా జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు.. కారణం.. పెరుమాల్ రైతు కావడం, తన వద్ద నల్లబెల్లం కొన్న వ్యక్తులు సారా తయారు చేశారంట.’
సారాకు బెల్లం విక్రయిస్తే అరెస్టు తప్పదు
సారా తయారీకి నల్లబెల్లాన్ని విక్రయిస్తే చట్టపరంగా ముందుకు వెళతాం. సారా తయారీ వాళ్లకు బెల్లం అమ్మారని తెలిసాకే అరెస్టు చేశాం. నవోదయంలో భాగంగా నాటు సారా తయారీ అరికట్టడానికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి, బెల్లం వ్యాపారులు, రైతులకు అవగాహన కల్పించాం. ఫ్యాక్టరీలు, పశువుల కోసం నల్లబెల్లం అమ్మితే పర్లేదు. సారా కోసం అమ్మితే మాత్రం అరెస్టు తప్పదు. – శ్రీనివాస్,
ఎకై ్సజ్ సూపరింటెండెంట్, చిత్తూరు
గిట్టుబాటు ధర ఎక్కడ ?
జిల్లాలో దాదాపు 5 వేల హెక్టార్లలో చెరకు పంట సాగువుతోంది. ఇందులో చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల, రూరల్, నగరి, నిండ్ర, విజయపురం, గంగాధర నెల్లూరు, కార్వేటినగరం, పెనుమూరు, పుంగనూరు, పులిచెర్ల, ఎస్.పురం, వెదురుకుప్పం మండలాల్లో చెరకు పంట ఎక్కువగా పండిస్తున్నారు. వీటిల్లో 4500 హెక్టార్లలో పండే పంటను ఫ్యాక్టరీలకు విక్రయిస్తుండగా మిగిలిన 500 హెక్టార్ల నుంచి బెల్లం తయారీ చేస్తున్నారు. ఒక హెక్టారుకు 70 టన్నుల వరకు బెల్లం తయారు చేస్తున్నారు. ఇందులో దాదాపు 5 వేల టన్నుల వరకు నల్లబెల్లం ఉత్పత్తి అవుతోంది. కిలో నల్లబెల్లాన్ని మార్కెట్‌లో ట్రేడర్లకు విక్రయిస్తే రూ.24–27 మధ్య ధర వస్తుంది. ఇందులోనే రవాణా చార్జీలు, దళారుల కమీషన్లు పోనూ చేతికి రూ.15 దక్కడం గగనంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో నల్లబెల్లానికి గిట్టుబాటు ధర కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం.. మార్కెఫెడ్ ద్వారా బెల్లాన్ని కొనుగోలు చేయిస్తూ రైతులను ఆదుకుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యింది.
అరెస్టులపై ఉద్యమిస్తాం
ఎక్కడైనా సారా తయారు చేసే వాళ్లను అరెస్టు చేస్తారు. కానీ ఇక్కడ బెల్లం తయారు చేసే రైతులను అరెస్టు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం.? నాటుసారా పేరిట రైతులను అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు. పొలాన్ని నమ్ముకున్న కుటుంబం రోడ్డున పడుతోంది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఆపకపోతే ఉద్యమం తప్పదు.
– నాగరాజన్, సీపీఐ, జిల్లా కార్యదర్శి
ప్రభుత్వానికి దమ్ముంటే పంటను కొనుగోలు చేయాలి
వైఎస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు మార్క్‌ఫెడ్ ద్వారా నల్లబెల్లాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. సారాను నివారించడానికి పీడీ యాక్టులు పెట్టాం. కానీ టీడీపీ అధికారంలోకి వస్తేనే బెల్లం రైతులపై పడుతారు. గతంలోనూ అంతే, ఇప్పుడూ అదే కొనసాగుతోంది. మా నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులను అరెస్టు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే జిల్లాలో బెల్లం రైతులకు ఇబ్బందులు తప్పవు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నల్లబెల్లానికి గిట్టుబాటు ధర కల్పించి, పంటను కొనుగోలు చేయాలి. – ఎంిసీ.విజయానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, చిత్తూరు

● నల్లబెల్లం పేరిట అన్నదాతల అరెస్టులు ● సారా తయారీకి బె

● నల్లబెల్లం పేరిట అన్నదాతల అరెస్టులు ● సారా తయారీకి బె

● నల్లబెల్లం పేరిట అన్నదాతల అరెస్టులు ● సారా తయారీకి బె

● నల్లబెల్లం పేరిట అన్నదాతల అరెస్టులు ● సారా తయారీకి బె