
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
● 19 మందికి గాయాలు ● ఇద్దరి పరిస్థితి విషమం
శ్రీరంగరాజపురం: ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేసిన సంఘటన మండలంలోని ఏఎం పురం పంచాయతీ దిగువ రిపుంజరాజపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఉపాధి కూలీల కథనం మేరకు.. ఉపాధిహామీ పనుల్లో భాగంగా దిగువ రిపుంజరాజపురంలోని ఉపాధి హామీ కూలీలు సుమారు 30 మంది సోమవారం ఉదయం కొండకాలువ పనులకు వెళ్లారు. గ్రామానికి సమీపంలోని కాలువ పనులు చేస్తున్న కూలీలపై ఉన్నట్టుండి తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో పలువురు కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు శ్రీరంగరాజపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆరోగ్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అనంతరం వారిని 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆంజనేయులు, జారచంద్రుడు పరిస్థితి విషమంగా ఉంది. ఫీల్డ్‌అసిస్టెంట్ కొంత మంది ఉపాధి కూలీలకు బీమా చేయలేదని ఆరోపించారు. గాయపడిన వారిని ఎంపీడీఓ మోహన్‌మురళి, ఏపీఓ లలితకుమారి పరామర్శించారు.