నేడు అంబేడ్కర్‌ జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

నేడు అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

Apr 14 2025 12:26 AM | Updated on Apr 14 2025 12:26 AM

నేడు అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

నేడు అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలో సోమవారం అంబేడ్కర్‌ 135వ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంబేడ్కర్‌ జయంతి వేడుక లు సోమవారం జిల్లా కేంద్రంలో ఉదయం 9 గంటలకు దర్గా సర్కిల్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. అక్కడ నుంచి అంబేడ్కర్‌ చిత్ర పటంతో ర్యాలీగా మెసానికల్‌ మైదానం వద్ద ఉన్న అంబేడ్కర్‌ భవనానికి వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, అధికారులు, విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

నేడు ప్రజా సమస్యల

పరిష్కార వేదిక రద్దు

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 14 వ తేదీన డాక్టర్‌. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి ప్రభుత్వ సెలవుదినం కావడంతో ప్రజా సమస్యల వేదిక రద్దు చేయడం జరిగిందన్నారు.

మామిడి చెట్లు నరికి భూ ఆక్రమణ

– టీడీపీ నాయకుల దౌర్జన్యం

గంగాధర నెల్లూరు : కూటమి ప్రభుత్వం అండతో ఓ టీడీపీ నేత చెలరేగిపోతున్నాడు. తహసీల్దార్‌ కార్యాలయంలో మకాం వేసి వైఎస్సార్‌సీపీ నాయకులనే టార్గెట్‌ చేస్తున్నారు. వారి భూములను దౌర్జన్యంగా ఆక్రమించి దాడులకు తెగబడుతున్నారు. బాధితుడి కథనం మేరకు గంగాధర నెల్లూరు మండలంలోని కుప్పనపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త శంకర్‌రెడ్డికి చెందిన సర్వే నం.840లో మూడెకరాల 30 సెంట్లు పొలం ఉంది. ఈ భూమిలో మామిడి చెట్లు, టేకు చెట్లను పెంచుతూ వ్యవసాయం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే శంకర్‌రెడ్డికి చెందిన భూమిలో దాదాపు 110 మామిడి చెట్లు, 50 టేకు చెట్లను అదే గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన యువరాజురెడ్డి, గంగిరెడ్డి నరికివేసి భూ ఆక్రమణకు తెగబడ్డారని పేర్కొన్నారు. ఈ మేరకు బాధితుడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడేళ్ల కిందట రూ.లక్షలు ఖర్చు చేసి చెట్లు పెంచి పెద్దవి చేయగా నేడు కూటమి ప్రభుత్వం రాగానే ఇలా దౌర్జన్యకాండ చేస్తున్నారని వాపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్‌ ఎంబీసీ వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 72,923 మంది స్వామివారిని దర్శించుకోగా 35,571 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.33 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

పత్రికా స్వేచ్ఛను కాపాడండి

– ‘సాక్షి’పై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆందోళన

కుప్పం : కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను అణగదొక్కేందుకు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తోందని కుప్పం జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. ‘సాక్షి’ ఎడిటర్‌ ధనంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు పాత్రికేయులపై అక్రమ కేసులు నమోదు చేయడంపై నిరసన చేపట్టారు. అనంతరం కుప్పం అర్బన్‌ ఎస్‌ఐ బాబుకు వినతిపత్రాన్ని అందజేశారు. అక్రమ కేసులను ఉపసంహరించుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ఈ సందర్భంగా జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం అక్రమాలను వెలికితీస్తున్న ‘సాక్షి’ పత్రికపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు కేసులు నమోదు చేసి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం చట్టరీత్యా నేరమన్నారు. ‘సాక్షి’పై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకొని ప్రజల పక్షాన నిలబడుతున్న పత్రికను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు వెంకటాచలం, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉదయ్‌ రెడ్డి, స్థానిక పాత్రికేయులు హరినాథ్‌, నాగరాజ్‌, గణేష్‌, రవికుమార్‌, వెంకటేష్‌, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement