పూలే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాణించాలి
చిత్తూరు కలెక్టరేట్ : మహాత్మ జ్యోతిబాపూలే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీసీ భవన్‌లో మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదట పీసీఆర్ సర్కిల్ లోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందజేసే సంక్షేమ పథకాలు ఉపయోగించుకుని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలన్నారు. జ్యోతిబా పూలే సంఘ సంస్కర్తగా ఎన్నో సేవలందించారన్నారు. బడుగు, బలహీన వర్గాల మహిళలకు చదువు నేర్పించాలనే ఉద్దేశంతో పూలే సతీమణి సావిత్రిబాయి పూలే దేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సేవలందించారని తెలిపారు. ఆమె చూపిన బాటలో నేడు ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలు పిల్లలను ఉన్నతంగా చదివించుకోవాలని కోరారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యువత, మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. మహిళలకు కుట్టు మిషన్ ల శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్‌లు పంపిణీ చేస్తున్నారన్నారు.జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ..
మానవ వికాసానికి, మనుగడకు ప్రధాన భూమిక పోషించే విద్య ప్రాధాన్యంను పూలే తెలియజేశారన్నారు. ఆ నాటి సమాజంలో ఉన్న అసమానతలను వివక్షను రూపుమాపేందుకు విశేష కృషి చేశారన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళిమోహన్ మాట్లాడుతూ.. పూలే సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం జిల్లాలోని బీసీ మహిళలకు, యువతకు 535 మందికి రూ.11.58 లక్షల విలువ చేసే వివిధ పథకాల మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్ అముద, చుడా ఛైర్మన్ కఠారి హేమలత, బీసీ సంక్షేమ శాఖ అధికారి మునీంద్రయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, బీసీ సంఘాల నాయకులు రవి, చోడప్ప, నాగరాజు, భరత్ పాల్గొన్నారు.
పూలే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాణించాలి


