● రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ ● చిత్తూరు నగరంలో ఉద్యాన పంటల సదస్సు ● హాజరైన మామిడి రైతులు, కొనుగోలుదారులు ● గిట్టుబాటు ధర కల్పించాలన్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు జిల్లాలో మామిడి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని, ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు భవనంలో శుక్రవారం మామిడి రైతులు, కొనుగోలుదారులతో ఉద్యాన పంటల సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల డైరెక్టర్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులతో పాటు చిత్తూరు నగర మేయర్ అముద, పూతలపట్టు ఎమ్మెల్యే కె.మురళీ మోహన్, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో మామిడి ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఒక హెక్టార్‌కు 12 మెట్రిక్ టన్నులు ఉండగా..దేశంలోని గుజరాత్ లాంటి రాష్ట్రాలలో ఒక హెక్టార్‌కు 15 వేల మెట్రిక్ టన్నుల ఉత్పాదకత ఉందని, ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మన దేశంలో ఒక హెక్టార్‌కు సుమారు 9 మెట్రిక్ టన్నులు ఉండగా బ్రెజిల్ లాంటి దేశాలలో 20 నుంచి 25 మెట్రిక్ టన్నులు ఉత్పాదకతను కలిగి ఉందన్నారు. ఉత్పాదకత లేని మామిడి తోటలను తిరిగీ పునరుజ్జీవం చేసేలా పంట తెగులు నివారణపై శాస్త్రజ్ఞులతో పరిశోధనలు చేయిస్తున్నామని, బయో లిక్విడ్ వాడకం ద్వారా భూసారం పెంచగలిగితే ఉత్పాదకత పెరిగే పరిస్థితి ఉందని, తద్వారా గతంలో రూ. 5 వేల వరకు ఆదాయం పొందే రైతు రూ.30 వేల వరకు ఆదాయం చూడొచ్చన్నారు.
70 వేల హెక్టార్లలో మామిడి..
జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఉత్పత్తి పరంగా, నాణ్యతా పరంగా చిత్తూరు జిల్లా మామిడికి చాలా ప్రాధాన్యం ఉందన్నారు. జిల్లాలో దాదాపు 75 వేల మంది రైతులు మామిడి పంటపై ప్రధానంగా ఆధారపడి ఉన్నారన్నారు. దాదాపు 90 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉండగా అందులో 70 వేల హెక్టార్ల వరకు మామిడి ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.25 కోట్లతో మామిడి పంట విస్తరణ, క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు.
మామిడికి మార్కెట్ సౌకర్యం కల్పించాలి
జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు అధికంగా మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారని, మామిడి పంట, ఇతర పంటలను విక్రయించడానికి తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. మామిడి రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక సదస్సును ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపాలని భావించిందన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు క్యూ లైన్ , నడకదారిలో ఉచితంగా అందిస్తున్న ఆహారం, పాలు, మజ్జిగతో పాటు మామిడి జ్యూస్‌ను కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని అసెంబ్లీలో నివేదించామన్నారు. రైతు సంఘ నాయకులు మామిడిబోర్డు ఏర్పాటు చేయాలని వినతి చేశారు. ఉద్యాన పంటల మార్కెటింగ్‌కు సంబంధించి కల్‌గుడి–ఫో కనెక్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు హరినాథ్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ మైక్రో ఇరిగేషన్ వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ దేవ మునిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా ఉద్యాన, వ్యవసాయ, ఏపీ ఎంఐపీ, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు మధుసూదన్ రెడ్డి, మురళీ కృష్ణ, బాల సుబ్రమణ్యం, శోభారాణి, సైంటిస్ట్‌లు సంబంధిత అధికారులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
మామిడి ఉత్పాదకత పెంచాలి


