కానిస్టేబుల్‌కు కన్నీటి వీడ్కోలు
– అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
చౌడేపల్లె : అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్‌లో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తోటి జయప్రకాష్(42)కు చౌడేపల్లె మండలం బయ్యపల్లె గ్రామంలో బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మార్గ మధ్యలో జయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 5 వతేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ భరోసా ఇచ్చారు. అంత్యక్రియలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. రూరల్ ఇన్‌స్పెక్టర్ కళా వెంకటరమణ, ఎస్‌ఐ నాగేశ్వరరావు, ఏఆర్ పోలీసులు అధికారిక లాంఛనాలతో జయప్రకాష్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.


