Xiaomi :మరోసారి సంచలనం సృష్టించిన షావోమీ..!

Xiaomi Became Number One Smartphone Brand Globally - Sakshi

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ మరో సంచలనాన్ని సృష్టించింది. 2021 జూన్‌ నెలలో మొట్టమొదటి సారిగా ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా షావోమీ నిలిచింది. ఈ ఏడాది జూన్‌ మాసంలో షావోమీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. డేటా పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్‌ ప్రకారం ఆఫ్రికా, చైనా, యూరోప్‌, మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతాల్లో షావోమీ స్మార్ట్‌ఫోన్‌లను విస్తరించడంతో అమ్మకాలు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది.

షావోమీ సంస్థను 2010లో స్థాపించగా కంపెనీ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌ను 2011 సంవత్సరంలో విడుదల చేసింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా షావోమీ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. షావోమీ అమ్మకాలు మే నెలతో పోలిస్తే జూన్‌ నెలలో గణనీయంగా 26 శాతం పెరిగాయి.  ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల పరంగా షావోమీ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్‌లు 17.1 శాతం మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది.  షావోమీ బ్రాండ్‌ తరువాత ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో  శాంసంగ్ 15.7 శాతం, ఆపిల్‌ 14.3 శాతం వాటాలను సొంతం చేసుకున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అత్యధిక అమ్మకాలు జరిపిన  రెండో బ్రాండ్గా షావోమీ నిలిచింది. షావోమీ ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. ఆఫ్రికా, చైనా, యూరప్‌, మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతాల్లో  హువావే స్మార్ట్‌ఫోన్‌  వెనక్కి తగ్గడంతో  ఆ గ్యాప్‌ను షావోమీ భర్తీ చేసిందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ డైరక్టర్‌ తరుణ పాఠఖ్‌ వెల్లడించారు. జూన్‌ నెలలో చైనా, యూరప్‌, మిడిల్‌ ఈస్ట్‌, భారత మార్కెట్లలో షావోమీ స్మార్ట్‌ఫోన్స్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వియత్నాంలో కోవిడ్‌-19 వేవ్‌ రాకతో శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఉత్పత్తి కూడా దెబ్బతింది. ఈ కారణంగానే శాంసంగ్‌ వెనుకబడి ఉండవచ్చునని కౌంటర్‌పాయింట్‌ సంస్థ తమ నివేదికలో పేర్కొంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top