
‘ఫిడే’ తాజా ర్యాంకింగ్స్‌లో తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ ఘనత
ఉజ్‌కప్ చెస్ టోర్నీలో టైటిల్ సాధించడంతో ర్యాంక్ మెరుగు
టాప్–6లో ముగ్గురు భారత గ్రాండ్‌మాస్టర్లకు చోటు
లుసానే (స్విట్జర్లాండ్): ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న తమిళనాడు చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద... ఓపెన్ విభాగంలో భారత కొత్త నంబర్‌వన్ ప్లేయర్‌గా అవతరించాడు. ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 19 ఏళ్ల ప్రజ్ఞానంద 2779 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. గతవారం ఉజ్బెకిస్తాన్ రాజధాని తాషె్కంట్‌లో జరిగిన ఉజ్‌కప్ చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద విజేతగా నిలవడంతో అతని ర్యాంక్ మెరుగైంది. ఇదే టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, కొన్నాళ్లుగా భారత నంబర్‌వన్‌గా ఉన్న ఇరిగేశి అర్జున్ 2776 పాయింట్లతో నాలుగు నుంచి ఐదో ర్యాంక్‌కు పడిపోయాడు.
క్లాసికల్ ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్, భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 2776 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. వెరసి టాప్–6లో ముగ్గురు భారత గ్రాండ్‌మాస్టర్లు ఉండటం విశేషం. ఓవరాల్‌గా టాప్–100లో భారత్ నుంచి విశ్వనాథన్ ఆనంద్ (13వ స్థానం), అరవింద్ చిదంబరం (24), విదిత్ సంతోష్ గుజరాతి (26), పెంటేల హరికృష్ణ (30), నిహాల్ సరీన్ (37), రౌనక్ సాధ్వాని (44), మురళీ కార్తికేయన్ (75), అభిమన్యు పురాణిక్ (93) ఉన్నారు.
మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే; 2839 పాయింట్లు) ‘టాప్’ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... హికారు నకముర (అమెరికా; 2807 పాయింట్లు) రెండో స్థానంలో, ఫాబియానో కరువానా (అమెరికా; 2784 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు.
ఐదో ర్యాంక్‌లో హంపి
మహిళల క్లాసికల్ ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, భారత స్టార్ కోనేరు హంపి ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుంది. గత నెలలో ఆరో స్థానంలో ఉన్న హంపి తాజా ర్యాంకింగ్స్‌లో 2536 పాయింట్లతో ఐదో ర్యాంక్‌కు చేరుకుంది. హైదరాబాద్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కూడా ఒక స్థానం పురోగతి సాధించి 2488 పాయింట్లతో 12వ ర్యాంక్‌ను అందుకుంది. 2478 పాయింట్లతో వైశాలి 15వ ర్యాంక్‌లో, 2463 పాయింట్లతో దివ్య దేశ్‌ముఖ్ 18వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.