భారత్‌ వృ‍ద్ధిరేటు అప్‌గ్రేడ్‌

World Bank Revises Gdp Growth Forecast For India To 6.9 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలను పలు అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సంస్థలు తగ్గిస్తున్న నేపథ్యంలో ప్రపంచబ్యాంక్‌ ఇందుకు భిన్నంగా మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. నిజానికి అక్టోబర్‌లోనే బహుళజాతి బ్యాంకింగ్‌ దిగ్గజం భారత్‌ 2022–23 వృద్ధి రేటును 7.5 శాతం నుంచి 1 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి దిగివచ్చింది.

అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్‌ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొంది. దీనితోపాటు రెండవ (సెప్టెంబర్‌) త్రైమాసికంలో భారత్‌ ఎకానమీ వృద్ధి రేటు అంచనాలకు మించి 6.3 శాతంగా నమోదుకావడమూ తమ తాజా ఎగువముఖ సవరణకు కారణమని వివరించింది.

భారత్‌ ఎకానమీ మొదటి త్రైమాసికంలో 13.5 శాతం పురోగతి సాధించిన సంగతి తెలిసిందే. ‘నావిగేటింగ్‌ ది స్ట్రోమ్‌’ (తుపానులో ప్రయాణం) శీర్షికన  ప్రపంచ బ్యాంక్‌ విడుదల చేసిన ఇండియా డెవలప్‌మెంట్‌ అప్‌డేట్‌ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు... 

క్షీణిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు భారతదేశ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం చూపుతాయి. అయితే ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కె ట్లతో పోలిస్తే భారత్‌ ఎకానమీ అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనగలుగుతోంది.  

మంచి డిమాండ్‌ వాతావరణంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తోంది.  

అయితే అంతర్జాతీయ పరిణామాలపై నిరంతర నిఘా అవసరం.  అభివృద్ధి చెందిన దేశాల కఠిన ద్రవ్య పరపతి విధానాలు, రూపాయి పతనం, కమోడిటీ ధరల తీవ్రత, ఆయా అంశాల నేపథ్యంలో కరెంట్‌ అకౌంట్‌ సవాళ్లు దేశం ఎదుర్కొనే వీలుంది. దీనితోపాటు ఎగుమతుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి అవసరం.  

2023–24లో ఎకానమీ వృద్ధి రేటు 6.6%గా నమోదుకావచ్చు. 

భారీ పన్ను వసూళ్ల నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2022–23లో లక్ష్యాల మేరకు జీడీజీలో 6.4%కి (విలువలో రూ.16.61 లక్షల కోట్లు) కట్టడి కావచ్చు.

ఫిచ్‌ 7% అంచనా యథాతథం 
కాగా, ఫిచ్‌ రేటింగ్‌ 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్‌ వృద్ధి అంచనాలను యథాతథంగా 7 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top