Credit Suisse: కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే'..పశ్చిమ, ఆసియా దేశాలతో పోలిస్తే

Women Directors Increase 17 Percent In Indian Corporate Companies - Sakshi

ముంబై: బోర్డుల్లో మహిళా ప్రాధాన్యతలో ఇతర పశ్చిమ, ఆసియా దేశాలతో పోలిస్తే కార్పొరేట్‌ ఇండియా వెనుకడుగులో ఉంది. అయితే ఇటీవల కంపెనీ బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. దీంతో తాజాగా మహిళా డైరెక్టర్ల శాతం 17.3 శాతానికి బలపడింది. ఇదే సమయంలో ప్రపంచ సగటు 24 శాతంగా నమోదైనట్లు క్రెడిట్‌ స్వీస్‌ రీసెర్చ్‌ సంస్థ రూపొందించిన నివేదిక వెల్లడించింది.

46 దేశాలలో 3,000 కంపెనీలకు చెందిన 33,000 మంది ఎగ్జిక్యూటివ్స్‌ను పరిగణనలోకి తీసుకుని సర్వేను తయారు చేసినట్లు క్రెడిట్‌ స్వీస్‌ తెలియజేసింది. వీటిలో 12 ఆసయా పసిఫిక్‌ మార్కెట్లలోని 1,440 సంస్థలను సైతం కవర్‌ చేసినట్లు పేర్కొంది. అయితే సర్వేలో దేశీయంగా ఎన్ని కంపెనీలూ, ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించిందీ క్రెడిట్‌ స్వీస్‌ వెల్లడించలేదు. నివేదికలోని ఇతర అంశాలు చూద్దాం.. 

2015తో పోలిస్తే.. గత ఆరేళ్లలో దేశీ కార్పొరేట్‌ బోర్డుల్లో స్త్రీలకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. దీంతో 2015లో వీరి సంఖ్య 11.4 శాతంగా నమోదుకాగా.. 2021కల్లా మరో 6 శాతం పుంజుకుంది. ఈ బాటలో గత రెండేళ్లలో యాజమాన్యంలోనూ స్త్రీ ప్రాతినిధ్యం 2 శాతం బలపడింది. ఫలితంగా 2019లో నమోదైన 8 శాతం వాటా 2021కల్లా 10 శాతానికి చేరింది. 

కాగా.. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో 17.3 శాతం వాటాతో ఎపాక్‌ ప్రాంతంలో భారత్‌ మూడో కనిష్ట ర్యాంకులో చేరింది. దక్షిణ కొరియా(8 శాతం), జపాన్‌(7 శాతం) కంటే ముందు నిలిచింది. మహిళా సీఈవోలలో 5 శాతం, సీఎఫ్‌వోలలో 4 శాతం వాటాను కలిగి ఉంది. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కుటుంబ సభ్యులుకాకుండా స్వతంత్ర మహిళా డైరెక్టర్‌ను తప్పనిసరి చేసినప్పటికీ చాలా కంపెనీలు నిబంధనలు పాటించడంలో వెనుకబడి ఉన్నాయి. 

ఇక ప్రపంచస్థాయిలో 2015–2021 మధ్య కాలంలో బోర్డులో మహిళల ప్రాతినిధ్యం 8.9 శాతంమేర పెరిగింది. యూరప్‌లో 34.4 శాతం, ఉత్తర అమెరికాలో 28.6 శాతం చొప్పున మహిళలకు ప్రాధాన్యత లభిస్తోంది. ఆసియా పసిఫిక్‌ సగటు 17.3 శాతంకాగా.. లాటిన్‌ అమెరికాలో ఇది 12.7 శాతంగా నమోదైంది.

చదవండి: ఆఫీసులకు రమ్మంటే.. వీళ్ల రియాక్షన్‌ ఇది!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top