విప్రో లాభం రూ. 3,053 కోట్లు

Wipro Q3 Results: Firm Net Profit Rises 3pc To Rs 3053 Crore - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 2.8 శాతం బలపడి రూ. 3,053 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 14 శాతం ఎగసి రూ. 23,229 కోట్లకు చేరింది.

మార్చితో ముగియనున్న పూర్తి ఏడాదికి ఐటీ సర్వీసుల ఆదాయం 11.5–12 శాతం మధ్య పుంజుకోనున్నట్లు తాజాగా అంచనా(గైడెన్స్‌) ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్‌)తో పోలిస్తే నికర లాభం 15 శాతం, ఆదాయం 3 శాతం వృద్ధి చూపాయి. 

డీల్స్‌ రికార్డ్‌..
ప్రపంచ అనిశ్చితుల్లోనూ క్యూ3లో రికార్డ్‌ నెలకొల్పుతూ మొత్తం 4.3 బిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్‌ పేర్కొన్నారు. ఇది 26 శాతం వృద్ధికాగా.. వీటిలో బిలియన్‌ డాలర్ల విలువకు మించిన భారీ ఆర్డర్లను సైతం పొందినట్లు తెలియజేశారు. క్యూ4(జనవరి–మార్చి)లోనూ ఇదే స్థాయి ఆర్డర్లు పొందే వీలున్నట్లు అంచనా వేశారు. క్లయింట్లతో లోతైన సంబంధాల ద్వారా అత్యధిక స్థాయిలో డీల్స్‌ కుదుర్చుకోగలుగుతున్నట్లు వివరించారు.

ట్రాన్స్‌ఫార్మేషన్‌ లక్ష్యాలు, వ్యయ క్రమబద్ధీకరణ తదితర అంశాలలో క్లయింట్లకు అందిస్తున్న సమర్థవంత సేవలు ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేశారు. పూర్తిస్థాయి క్లౌడ్‌ సర్వీసులు, ఇంజనీరింగ్‌ సర్వీసులు ఆర్డర్‌బుక్‌కు దన్నుగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు యథాతథంగా రూ. 396 వద్ద ముగిసింది.  

ఇతర హైలైట్స్‌ 
  ►
క్యూ2తో పోలిస్తే విప్రో ఉద్యోగుల సంఖ్య నికరంగా 435 తగ్గి 2,58,744ను తాకింది.  
  ​​​​► ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు 1.8 శాతం తగ్గి 21.2 శాతానికి చేరింది.  
  ​► ఐటీ సర్వీసుల నిర్వహణ మార్జిన్లు 1.2 శాతం బలపడి 16.3 శాతానికి చేరాయి.  
   ఐటీ సర్వీసుల ఆదాయం 6.2 శాతం వృద్ధితో 280.35 కోట్ల డాలర్లను తాకింది.  
   ఐటీ ప్రొడక్టుల ఆదాయం 2.08 కోట్ల డాలర్లు(రూ. 170 కోట్లు)గా నమోదైంది.

చదవండి: గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఫేక్‌ ‘చాట్‌జీపీటీ’ యాప్స్‌ కలకలం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top