పశ్చిమాసియాపైనే ఫోకస్‌! | West Asia war, crude oil prices likely to steer stock markets this week | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియాపైనే ఫోకస్‌!

Mar 23 2026 5:37 AM | Updated on Mar 23 2026 6:09 AM

West Asia war, crude oil prices likely to steer stock markets this week

యుద్ధ భయాలు, చమురు ధరల ఎఫెక్ట్‌ 

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకూ ప్రాధాన్యత 

ఈ వారం స్టాక్‌ మార్కెట్లపై నిపుణులు 

ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేయగల కీలక ఆర్థిక అంశాలు కొరవడిన నేపథ్యంలో పశ్చిమాసియా పరిస్థితులే దారి చూపనున్నాయి. దీంతో చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు, రూపాయి మారకం తదితర అంశాలు కీలకంగా నిలవనున్నాయి. గురువారం(26న) శ్రీరామ నవమి సందర్భంగా దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. వివరాలు చూద్దాం...                        

రోజులు గడిచేకొద్దీ పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం ముదురుతోంది. యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకనున్నట్లు యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించిన తదుపరి పరిస్థితులు మరింత వికటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. దీంతో ఆసియా మొదలు అమెరికా వరకూ స్టాక్‌ మార్కెట్లు పతనాన్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనలే ప్రధానంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. శ్రీరామ నవమి(26న) సెలవుతో ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది.  

గణాంకాల విడుదల 
దేశీయంగా ఈ వారం మార్చి నెలకు రేపు(24న) హెచ్‌ఎస్‌బీసీ ఫ్లాష్‌ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. తయారీ, సర్వీసులు, కాంపోజిట్‌ వివరాలు వెల్లడికానున్నాయి. తద్వారా బిజినెస్‌ యాక్టివిటీ ముందస్తు అంచనాలకు వీలున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. ఈ బాటలో 28న ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మ్యాన్యుఫాక్చరింగ్‌ గణాంకాలు విడుదలకానున్నాయి.  

హార్ముజ్‌పై ఫోకస్‌ 
కొద్ది రోజులుగా హార్ముజ్‌ ద్వారా జల రవాణా దాదాపు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్‌ సరఫరాలకు విఘాతం ఏర్పడుతోంది. దీంతో పశ్చిమాసియా పరిస్థితులు కీలకంగా మారినట్లు ఎన్‌రిచ్‌ మనీ సీఈవో పొన్మూడి ఆర్‌. పేర్కొన్నారు. సమీప కాలంలో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని అంచనా వేశారు. బ్రెంట్‌ చమురు 100 డాలర్ల ఎగువన కదులుతుండటం దేశీయంగా వాణిజ్య లోటును పెంచడంతోపాటు రూపాయిని బలహీనపరుస్తున్నట్లు ఆర్థికవేత్తలు విశ్లేషించారు. చమురు ధరలతో పలు దేశాలలో ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తుండటంతో కేంద్ర బ్యాంకులు కఠిన పరపతి విధానాలవైపు చూపు సారించవచ్చని వివరించారు. 
 

గత వారం అక్కడక్కడే 
తీవ్ర ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు దాదాపు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నికరంగా 31 పాయింట్ల స్వల్ప నష్టంతో 74,533 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 37 పాయింట్లు క్షీణించి 23,115 వద్ద స్థిరపడింది.

సాంకేతికంగా ఈ వారం
యుద్ధ భయాల నుంచి గత వారం నెమ్మదిగా రికవరీ బాట పట్టిన దేశీ స్టాక్‌ మార్కెట్లను ప్రయివేట్‌ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ దెబ్బకొట్టింది. మరోపక్క ముడిచమురు ధరల మంట సెంటిమెంటుకు షాకివ్వడం దీనికి జత కలసింది. దీంతో చివరికి మార్కెట్లు దాదాపు యథాతథంగా ముగిశాయి. అయితే సాంకేతికంగా చూస్తే ఈ వారం పశ్చిమాసియా ప్రకంపనల ఆందోళనలతో బలహీనపడటానికే అధిక వీలుంది. విదేశీ ఇన్వెస్టర్లు భారీస్థాయిలో విక్రయాలకు పాల్పడుతుండటం బ్లూచిప్స్‌ను పడగొడుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

→ నిఫ్టీకి తొలుత 22,900 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. తదుపరి 22,300–22,200 స్థాయిలో కొనుగోళ్లకు వీలుంది. ఒకవేళ తొలి మద్దతుస్థాయి నుంచి బలపడితే.. 23,800–24,000 వరకూ పుంజుకోవచ్చు. సమీప కాలంలో 22,900– 24,000 శ్రేణిలో కదిలేందుకు వీలుంది.

ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు.. 
యుద్ధ భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఇటీవల దేశీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలోనే ఇప్పటివరకూ నగదు విభాగంలో ఏకంగా రూ. 88,180 కోట్ల(9.6 బిలియన్‌ డాలర్లు) విలువైన స్టాక్స్‌ విక్రయించారు. ఇందుకు ధరల పెరుగుదలపై యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఆందోళనలు వ్యక్తం చేయడానికితోడు.. డాలరుతో మారకంలో రూపాయి పతనంకావడం సైతం కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ముదురుతున్న పశ్చిమాసియా యుద్ధం, ముడిచమురు ధరలతో కార్పొరేట్‌ ఫలితాలు నీరసించవచ్చన్న ఆందోళనలు ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. కాగా.. అంతకుముందు నెల(ఫిబ్రవరి)లో గత 17 నెలల్లోనే అత్యధికంగా ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం!  

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement