Weird Stalemate for Tesla and India Hopes on Union Budget - Sakshi
Sakshi News home page

టెస్లా-భారత్‌ చర్చలపై ప్రతిష్టంబన.. ఎలన్‌ మస్క్‌ ఏం అడుగుతున్నాడు? భారత్‌ ఏం చెబుతోంది?

Published Thu, Jan 20 2022 3:06 PM

Weird Stalemate For Tesla And India Hopes On Union Budget - Sakshi

భారత్‌ టెస్లా కంపెనీల మధ్య డీల్‌ కొలిక్కి రావడం లేదు. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను భారత్‌లోకి దిగుమతి చేయడంతో పాటు సొంత షోరూంలతో వాహనాలను అమ్ముకోవాలన్న టెస్లా ఆశలపై కేంద్రం నీళ్లు జల్లుతూ వస్తోంది. ఈ తరుణంలో ఇరు వర్గాల చర్చల విషయంలో  ప్రతిష్టంబన నెలకొన్నట్లు తాజా సమాచారం. 


టెస్లా-భారత ప్రభుత్వాల మధ్య ఏడాది కాలంగా సాగుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. ట్యాక్స్‌ మినహాయింపులు కోరుతూ తమ మార్గం సుగమం చేయాలని ఈ అమెరికా ఆటోమేకర్‌,  భారత ప్రభుత్వాన్ని బతిమాలుతోంది. అందుకు భారత్‌ ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఏ దేశంలో లేని విధంగా భారత్‌లోనే దిగుమతి సుంకం అధికంగా ఉందంటూ మొదటి నుంచి  టెస్లా సీఈవో మస్క్ చెప్తున్న విషయం తెలిసిందే. 

ఇందుకు సంబంధించి న్యూ ఢిల్లీ కేంద్రంగా పలు దఫాలుగా.. టెస్లా ప్రతినిధులు భారత అధికారులతో లాబీయింగ్‌ చేస్తున్నారు. టారిఫ్‌లు తగ్గించమని కోరుతున్నారు. కానీ, టెస్లా విజ్ఞప్తులకు భారత ప్రభుత్వం కరగడం లేదు. పెట్టుబడులకు సంబంధించిన స్పష్టమైన హామీ ఏదీ ఇవ్వనందున టెస్లాకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని తేల్చేసి చెప్పింది. ఈ తరుణంలో.. 

చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్నట్లు టెస్లాతో దగ్గరి సంబంధాలు ఉన్న ఓ ప్రతినిధి వెల్లడించినట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారం టెస్లాకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించారాయన. 

మరోవైపు భారత్‌లో విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న వాహనాలపై వాటి ధర 40వేల డాలర్లులోపు ఉంటే 60 శాతం, 40వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే 100 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు. ఈ ప్రకారం.. టెస్లా తన కార్లను రేట్లు పెంచుకుని అమ్ముకోవాల్సి  వస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ మార్కెట్‌ టెస్లాకు భారంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రధాని కార్యాలయంతో పాటు ఆర్థిక, వాణిజ్య శాఖలు సైతం టెస్లా డిమాండ్లను సమీక్షించినప్పటికీ..  స్పందించేందుకు మాత్రం నిరాకరిస్తున్నాయి.   

టెస్లా అడుగుతోంది ఇదే.. 
అధిక దిగుమతి సుంకాల వల్ల ఈ కారు ధర రూ.60 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ భావిస్తుంది. దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహన అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని టెస్లా కేంద్రంతో వాదిస్తుంది. అదనంగా 10 శాతం సోషల్‌ వెల్‌ఫేర్‌ సర్‌చార్జిని కూడా మాఫీ చేసే అంశంపై కూడా కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది.

కష్టమే!
ప్రస్తుతం జరగబోయే బడ్జెట్‌ మీదే టెస్లా ఆశలు పెట్టుకుంది. సమావేశాల్లో దిగుమతి సుంకాల మీద ఏదైనా ప్రకటన చేస్తారేమోనని ఆశగా చూస్తోంది. అయితే ఇది జరగకపోవచ్చనే వాదన సైతం వినిపిస్తోంది. భారత్‌లో ఇప్పటివరకు ఏ విదేశీ కంపెనీకి.. ఆ కంపెనీ డిమాండ్‌ చేసిన మినహాయింపును భారత ప్రభుత్వం ఇచ్చింది లేదు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్తున్నా టెస్లా వినడం లేదు.  టెస్లా ప్రతినిధులు ఈమధ్య ట్యాక్స్‌ అండ్‌ కస్టమ్స్‌ విభాగం అధికారులను కలిశారు. అంతకు ముందు ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించి.. ప్రధాని మోదీతో ఎలన్‌ మస్క్‌కు చర్చించే అవకాశం ఇవ్వమని కోరారు కూడా. 

గతంలో ఇదే తరహాలో కొన్ని ఫారిన్‌ కంపెనీలు మోదీ ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ.. స్థానిక ఉత్పత్తిని ప్రొత్సహించే ఉద్దేశంతో ఆయా కంపెనీల డిమాండ్‌ను కేంద్రం స్వాగతించలేదు. 2017లో యాపిల్‌ కంపెనీ భారత్‌లో ‘ట్యాక్స్‌ కన్సెసన్స్‌’ కావాలని, దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరింది. తద్వారా ఐఫోన్స్‌ తయారీని స్థానికంగా చేపడతామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ యాపిల్‌ డిమాండ్‌లలో చాలామట్టుకును మోదీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ తరుణంలో మేక్‌ ఇన్‌ ఇండియా విషయంలో బలంగా ఉన్న మోదీ ప్రభుత్వం.. టెస్లాకు మినహాయింపులు ఇవ్వడం కష్టమే అంటున్నారు అధికారులు.

చదవండి: టెస్లా కోసం కేంద్రానికి ఆ రాష్ట్ర మంత్రి లేఖ..!

Advertisement

తప్పక చదవండి

Advertisement