ఈవీ జోరుకు భారత్‌ రెడీ..  ప్లాంటు యోచనలో వోల్వో!

Volvo Cars Plans To Go Fully Electric In India By 2025 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా 2018 జనవరిలో అమ్ముడైన ఎలక్ట్రిక్‌ కార్ల సంఖ్య ఎంతో తెలుసా. జస్ట్‌ 25 మాత్రమే. ఒక నెలలో 1,000 యూనిట్ల విక్రయాలు నమోదు కావడానికి పరిశ్రమ 2021 మార్చి వరకు వేచి చూడాల్సి వచ్చింది. అటువంటి విపణిలో గతేడాది రోడ్డెక్కిన 38,000 ఎలక్ట్రిక్‌ కార్లను చూస్తుంటే కంపెనీలకు కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి.

మూడవ అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌గా అవతరించిన భారత్‌లో వేగం అందుకోవడం ఆలస్యమైనా ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పుంజుకుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఈవీల తయారీ కోసం భారత్‌లో గ్లోబల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలని స్వీడన్‌ దిగ్గజ సంస్థ వోల్వో యోచించడం చూస్తుంటే రానున్న రోజుల్లో ఇక్కడి పరిశ్రమ నూతన శిఖరాలను తాకడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌లో ఏటా ఒక ఎలక్ట్రిక్‌ కారును ప్రవేశపెట్టనున్నట్టు ఓల్వో ప్రకటించింది. దేశంలో 2025 నాటికి పూర్తి ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీగా అవతరించాలన్నది ఈ సంస్థ లక్ష్యం.

2030 నాటికి 1 కోటి.. 
దేశీయ ఈవీ మార్కెట్‌ 2022–2030 మధ్య 49 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుందని 2023 ఎకనమిక్‌ సర్వే అంచనా వేసింది. 2030 నాటికి ఏటా 1 కోటి యూనిట్ల స్థాయికి భారత్‌ చేరుతుందని జోస్యం చెబుతోంది. మరోవైపు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా జమ్ము కశ్మీర్‌లోని సలాల్‌ హైమన ప్రాంతంలో 59 లక్షల టన్నుల లిథియం నిక్షేపాలను కనుగొన్నట్టు గనుల మంత్రిత్వ శాఖ నివేదించింది. లిథియం నిల్వలు చాలా అరుదు. ఈ వనరులతో బ్యాటరీల దిగుమతులపై ఆధారపడడం గణనీయంగా తగ్గుతుంది. అలాగే ఈ నిల్వల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారులకు భారత్‌ కీలకం కానుంది. ఈవీ అమ్మకాలు పెరిగేందుకూ దోహదం చేయనుంది. 2030లో ఎలక్ట్రిక్‌ కార్లు 3,76,000 యూనిట్లు అమ్ముడవుతాయన్న అంచనాలు ఉన్నాయి.

వరుస కట్టిన కంపెనీలు.. 
భారత ఎలక్ట్రిక్‌ కార్ల పరిశ్రమలో 80 శాతం వాటాతో టాటా మోటార్స్‌ దూసుకెళుతోంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎక్స్‌యూవీ400 మోడల్‌ను ఆవిష్కరించడంతో మార్కెట్‌ ఒక్కసారిగా హీటెక్కింది. హ్యుండై, కియా మోటార్స్‌ మోడల్స్‌ అధిక ధరల్లో ఉన్నాయి. అయితే మారుతీ సుజుకీ 2025 నాటికి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్యాసింజర్‌ కార్ల విభాగంలో అగ్రశేణి సంస్థ అయిన మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్‌ కార్ల విపణిలోకి రంగ ప్రవేశం చేస్తే పోటీ మరింత తీవ్రతరం కానుంది. సిట్రియోన్‌ ఈసీ3, ఎంజీ ఎయిర్‌ ఈవీ, బీవైడీ సీల్, టాటా ఆల్ట్రోజ్‌ ఈవీ, టాటా పంచ్‌ ఈవీ, వోల్వో సీ40 రీచార్జ్‌ ఈ ఏడాది ఇక్కడి రోడ్లపై పరుగు తీయనున్నాయి. దీర్ఘకాలిక లక్ష్యంతో చార్జింగ్‌ మౌలిక వసతులనుబట్టి ఆచితూచి మోడళ్లను విడుదల చేస్తామని కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. 

(ఇదీచదవండి: బ్యాలన్స్‌షీట్‌ పటిష్టంగా ఉంది.. ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్‌ భరోసా)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top