కార్మికుల వేతనాలు పెంపు | Uttar Pradesh Raises Minimum Wages Noida Factory Unrest Effective April 1 | Sakshi
Sakshi News home page

కార్మికుల వేతనాలు పెంపు

Apr 14 2026 11:33 AM | Updated on Apr 14 2026 11:42 AM

Uttar Pradesh Raises Minimum Wages Noida Factory Unrest Effective April 1

ఉత్తరప్రదేశ్‌లోని పారిశ్రామిక రంగంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న అశాంతికి తెరదించుతూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ వర్గాల కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ఈ కొత్త వేతన రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఇస్తాయని తెలిపింది. నోయిడాలో వేలాది మంది ఫ్యాక్టరీ కార్మికులు వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపరచాలని సోమవారం చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

సవరించిన వేతనాల వివరాలు

గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపమ్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడిస్తూ, ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.

గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్

ఈ కీలక పారిశ్రామిక ప్రాంతాల్లో వేతనాలు అత్యధికంగా ఉన్నాయి. నైపుణ్యం లేని కార్మికులకు నెలకు రూ.13,690 (గతంలో రూ.11,313), సెమీ స్కిల్డ్‌ వర్కర్లకు రూ.15,059, నైపుణ్యం కలిగిన కార్మికులకు రూ.16,868 వేతనం నిర్ణయించారు.

ఇతర మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో..

  • నైపుణ్యం లేని వారు: రూ. 13,006

  • సెమీ స్కిల్డ్‌: రూ. 14,306

  • నైపుణ్యం కలిగిన వారు: రూ.16,025

మిగిలిన జిల్లాల్లో..

  • నైపుణ్యం లేని వారు: రూ.12,356

  • సెమీ స్కిల్డ్‌: రూ.13,591

  • నైపుణ్యం కలిగిన వారు: రూ.15,224

  • సమతుల్య విధానం - ప్రభుత్వ వివరణ

యజమానుల సంఘాలు, కార్మిక సంస్థలతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాతే ఈ సమతుల్య, ఆచరణాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవైపు కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే అయినప్పటికీ, మరోవైపు పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రపంచ ఆర్థిక సవాళ్లు, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, పడిపోతున్న ఎగుమతులను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు

సోషల్ మీడియాలో కార్మికులకు నెలకు రూ.20,000 ఏకరీతి కనీస వేతనం నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. జాతీయ స్థాయిలో ‘ఫ్లోర్ వేజ్’ నిర్ణయించే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని, ఇప్పటి వరకు అటువంటి నోటిఫికేషన్ ఏదీ జారీ చేయలేదని స్పష్టం చేసింది.

యాజమాన్యాలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిశ్రమల యజమానులకు పలు సూచనలు చేశారు. వాటి ప్రకారం.. సకాలంలో వేతనాలు చెల్లించాలి. అదనపు పని గంటలకు(ఓటీ) సరైన పరిహారం ఇవ్వాలి. బోనస్, వారపు సెలవులు, సామాజిక భద్రతా ప్రయోజనాలను అమలు చేయాలి. ముఖ్యంగా మహిళా కార్మికులకు అత్యంత సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలి. త్వరలోనే పూర్తిస్థాయి వేతన బోర్డును ఏర్పాటు చేసి, దాని సిఫార్సుల మేరకు తుది వేతన నిర్ణయ ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇండెక్సేషన్ ఆధారంగా మధ్యంతర పెంపును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

Advertisement
 
Advertisement
Advertisement