డిజిటల్‌ చెల్లింపుల్లో 90 శాతం వాటా యూపీఐదే | UPI To Account For 90percent Of Retail Digital Payments | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ చెల్లింపుల్లో 90 శాతం వాటా యూపీఐదే

May 29 2023 4:50 AM | Updated on May 29 2023 6:52 AM

UPI To Account For 90percent Of Retail Digital Payments - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ)లో లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి 2026–27 నాటికి రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో 90 శాతం వాటా ఆక్రమించనున్నాయి. రోజుకు 100 కోట్ల స్థాయికి చేరనున్నాయి. పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం 2022–23లో రిటైల్‌ సెగ్మెంట్‌లో మొత్తం లావాదేవీల పరిమాణంలో యూపీఐ లావాదేవీల వాటా 75 శాతంగా ఉంది.

దేశీయంగా మొత్తం డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌ ఏటా 50 శాతం (పరిమాణం పరంగా) పెరుగుతూ వస్తోంది. ఇది 2022–23లో 103 బిలియన్‌ లావాదేవీల స్థాయిలో ఉండగా 2026–27 నాటికి 411 బిలియన్‌ లావాదేవీలకు చేరనుంది. ఇందులో ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు 83.71 బిలియన్లుగా ఉండగా అప్పటికి 379 బిలియన్లకు (రోజుకు దాదాపు 1 బిలియన్‌) చేరతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదికలో వివరించింది. నివేదికలో మరిన్ని
విశేషాలు..

► క్రెడిట్‌ కార్డ్‌ సెగ్మెంట్‌ మెరుగ్గా వృద్ధి చెందుతోంది. 2024–25 నాటికి డెబిట్‌ కార్డు లావాదేవీలను మించనుంది.
► క్రెడిట్‌ కార్డుల జారీ వచ్చే అయిదేళ్లలో 21 శాతం మేర వృద్ధి చెందనుండగా.. డెబిట్‌ కార్డుల జారీ మాత్రం స్థిరంగా 3 శాతం స్థాయిలోనే కొనసాగనుంది. డెబిట్‌ కార్డును ఎక్కువగా నగదు విత్‌డ్రాయల్‌కే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు యూపీఐతో కూడా విత్‌డ్రా చేసుకునే వీలుండటంతో డెబిట్‌ కార్డుల వినియోగం తగ్గనుంది.  
► 2022–23లో బ్యాంకులు, ఫిన్‌టెక్, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు కార్డుల ద్వారా
వచ్చిన మొత్తం ఆదాయంలో క్రెడిట్‌ కార్డుల వ్యాపారం వాటా 76 శాతంగా ఉంది. దీంతో ఆయా సంస్థలకు ఇది ఆకర్షణీయమైన వ్యాపారంగానే కొనసాగనుంది. 2021–22తో పోలిస్తే 2022–23లో క్రెడిట్‌ కార్డుల జారీ ద్వారా ఆదాయం 42 శాతం పెరిగింది. వచ్చే అయిదేళ్లలో ఇది వార్షికంగా 33 శాతం వృద్ధి చెందనుంది.

Advertisement
 
Advertisement
Advertisement