ఎన్‌ఎఫ్‌ఐ మ్యాన్యువల్‌లో అనుమతి లేని మందులు | Unapproved Drugs Found in India Official Medical Guide DCGI Demands | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎఫ్‌ఐ మ్యాన్యువల్‌లో అనుమతి లేని మందులు

Oct 10 2026 9:04 AM | Updated on Oct 10 2026 9:04 AM

Unapproved Drugs Found in India Official Medical Guide DCGI Demands

దేశీయ ఔషధ నియంత్రణ, ప్రామాణిక వ్యవస్థలో రెండు కీలక అంశాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. భారత ఫార్మాకోపియా కమిషన్ (ఐపీసీ) ఇటీవల విడుదల చేసిన 7వ ఎడిషన్ ‘నేషనల్ ఫార్ములేరీ ఆఫ్ ఇండియా’ (ఎన్‌ఎఫ్‌ఐ 2026)లో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) నుంచి అధికారిక అనుమతి లేని కనీసం ఐదు రకాల మందులు, వాటి వేరియంట్లు ఉన్నట్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

వైద్యులు, ఫార్మసిస్టులకు ప్రామాణిక మార్గదర్శిగా భావించే ఎన్‌ఎఫ్‌ఐ మ్యాన్యువల్‌లో మిథిలీన్ బ్లూ జెల్/ఇంజెక్షన్, ఫ్లూమాజెనిల్, ఫోలినిక్ యాసిడ్, పైరిడోస్టిగ్మైన్, ఆల్టెప్లేస్ వంటి ఔషధాలు సీడీఎస్‌సీఓ ఆమోదం లేకుండానే చేర్చినట్లు గుర్తించారు. అంతర్జాతీయంగా దేశీయ ఫార్మా నియంత్రణ వ్యవస్థ విశ్వసనీయతపై ఇది ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని ఐపీసీకి పంపిన ప్రత్యేక లేఖలో డీసీజీఐ స్పష్టం చేసింది. ఈ పొరపాటుపై సమగ్ర నివేదిక కోరడంతోపాటు ఎన్‌ఎఫ్‌ఐ 2026 ఆన్‌లైన్ వర్షన్ అందుబాటులో లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రిస్క్రిప్షన్ ఔషధాల ప్రకటనల వ్యాప్తికి చెక్

మరొకవైపు, షెడ్యూల్ H, H1, X ల కిందకు వచ్చే ప్రిస్క్రిప్షన్ ఆధారిత ఔషధాల (యాంటీబయాటిక్స్, సైకోట్రోపిక్ డ్రగ్స్) పంపిణీ, ప్రచారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు కేవలం తయారీదారులకు మాత్రమే పరిమితమైన ప్రకటనల ముందస్తు అనుమతి నిబంధనలను ఇప్పుడు రిటైలర్లు, హోల్‌సేలర్లు, పంపిణీదారులకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది.

డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB) ప్రతిపాదనల మేరకు డ్రగ్స్ రూల్స్, 1945 లోని రూల్ 65 కింద నూతనంగా సబ్‌-రూల్ (22)ను చేర్చుతూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ప్రిస్క్రిప్షన్ ఔషధాలను విచ్చలవిడిగా ప్రచారం చేయడం ఇకపై చట్టరీత్యా నేరమవుతుంది. ఔషధాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, ప్రజారోగ్య పరిరక్షణకు ఈ సవరణలు కీలకమైనవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: భారత్‌కు ‘స్టార్‌లింక్’ నిజంగా సంజీవనియా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement