ప్రభుత్వ వైద్యంపై ప్రైవేట్ పడగ! | previous govt took steps to bring radiology services under the government's auspices | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యంపై ప్రైవేట్ పడగ!

Oct 9 2026 5:45 AM | Updated on Oct 9 2026 5:45 AM

previous govt took steps to bring radiology services under the government's auspices

రేడియాలజీ సేవలూ పీపీపీకే   

2014–19 మధ్య పదేళ్ల కాంట్రాక్ట్‌ రూపంలో సేవలన్నీ ప్రైవేట్‌కు..

ఇప్పుడు కూడా ఆ కాంట్రాక్టులు యథావిధిగా పీపీపీకే

ఇప్పటికే పీపీపీ రేడియాలజీ సేవలకు ఏటా రూ.60 కోట్లకు పైగా చెల్లిస్తున్న సర్కారు

రాబోయే రోజుల్లో ఈ వ్యయం రెట్టింపయ్యే అవకాశం

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రేడియాలజీ సేవలు చేపట్టేలా గత ప్రభుత్వంలో అడుగులు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగం స్వయం సమృద్ధిని తుంగలో తొక్కి పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) ప్రాజెక్ట్‌ల రూపంలో ముక్కలు ముక్కలుగా చంద్రబాబు సర్కారు అమ్మేస్తోంది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్‌కు, పేదల ఆపద్భాందవి ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు, పక్క రాష్ట్రాల్లో విఫలమైన డింక్‌ (డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌) కార్యక్రమాన్ని సంజీవని పేరిట ప్రజల నెత్తిన రుద్దడం ద్వారా ఖజానాకు ప్రభుత్వం పెద్దఎత్తున గండికొడుతోంది. 

ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో రేడియాలజీ (సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ) సేవలను మరో పదేళ్లపాటు పీపీపీకి ఇవ్వడానికి చంద్రబాబు సర్కారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 2014–19 మధ్య రేడియాలజీ సేవలను పదేళ్లకు పచ్చ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ), డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ (డీఎస్‌హెచ్‌) ఇలా అన్ని ఆస్పత్రుల్లోని రేడియాలజీ సేవలను హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌కు కట్టబెట్టడం కోసం వైద్య శాఖలో పైళ్లు వేగంగా కదులుతున్నాయని విస్తృత ప్రచారం నడుస్తోంది. తొలుత హెచ్‌ఎల్‌ఎల్‌కు సేవలన్నీ కట్టబెట్టి.. ఆ సంస్థ నుంచి ప్రభుత్వ పెద్దల అస్మదీయులకు సబ్‌ కాంట్రాక్ట్‌లు అప్పగించేలా పావులు కదుపుతున్నారని సమాచారం. 

ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించేలా..
వైద్యరంగంలో బయటి సంస్థల దోపిడీకి క్రమంగా అడ్డుకట్టవేసి ప్రభుత్వ రంగంలోనే అన్నిరకాల సేవలను బలోపేతం చేయడం కోసం గత వైఎస్‌ జగన్‌ సర్కారు అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ వైద్యసేవల కల్పన అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ)లో డయగ్నోస్టిక్స్‌ విభాగం అభివృద్ధికి అడుగులు వేసింది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ రివాల్వింగ్‌ ఫండ్‌ నుంచి ఆస్పత్రులకు సీటీ, ఎంఆర్‌ఐ, క్యాథల్యాబ్స్‌ వంటి సౌకర్యాలు కల్పించి ఎంఎస్‌ఐడీసీ ద్వారా వాటిని నిర్వహించేలా అడుగులు వేశారు.

ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప జీజీహెచ్‌లల్లో ప్రభుత్వమే సీటీ స్కాన్‌ యంత్రాలను సమకూర్చింది. ఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో సిబ్బందిని నియమించి, వాటిని నిర్వహిస్తోంది. మిగిలిన చోట్ల పీపీపీ కాంట్రాక్టర్ల కాలపరిమితి ముగిసినప్పుడు కొత్తగా పీపీపీకి ఇవ్వకుండా ప్రభుత్వమే యంత్రాలు సమకూర్చి నిర్వహించేలా ప్రణాళికలు రచించారు. తద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు, ప్రైవేట్‌ వ్యక్తుల దోపిడీకి అడ్డుకట్టకు వీలుండేది. 

కమీషన్ల కోసం ఖజానాకు గండి..
ప్రస్తుతం పీపీపీ రేడియాలజీ సేవల కోసం ప్రభుత్వం ఏటా రూ.60 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. భవిష్యత్‌లో ఇది రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ రంగంలోనే పరికరాలు కొని ఆస్పత్రులను మరింత స్వయం సమృద్ధి చేసేలా గత ప్రభుత్వంలో అడుగులు వేశారు. ఆ విధానం ప్రకారం ప్రభుత్వమే పరికరాలను కొనుగోలు చేస్తే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులు చేయడం ద్వారా వచ్చే డబ్బుతో పరికరాలకు ఈఎంఐ చెల్లించడంతో పాటు సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వడానికి వీలుంటుంది. ఇలా కొన్నేళ్లకు ఈఎంఐలు పూర్తయ్యాక పరికరాలన్నీ పూర్తిగా ప్రభుత్వానికి మిగిలిపోతాయి. ఈ ఉత్తమమైన విధానాన్ని గాలికొదిలేసి కమీషన్ల కోసం పీపీపీ ప్రాజెక్ట్‌లను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఖజానాకు ప్రభుత్వ పెద్దలు గండికొడుతున్నారు.

‘ముఖ్య’నేత సతీమణి సిఫార్సు.. ప్రభుత్వ యంత్రాలు ప్రైవేట్‌కు..
ప్రస్తుతం పీపీపీ సేవలు నిర్వహిస్తున్న సంస్థలు లాభాపేక్షతో ఒకే స్కాన్, ఎంఆర్‌ఐను రెండు, మూడు రకాలుగా విభజించి దొంగ బిల్లులు పెట్టుకోవడం, ఫేక్‌ రెఫరల్‌ స్లిప్స్‌తో స్కాన్‌లు చేసినట్టుగా చూపించడం.. అవసరం లేకున్నా రోగులకు ఒకటి కంటే ఎక్కువ స్కాన్‌లు నిర్వహించడం ద్వారా పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా 2019–­24 మధ్య ప్రభుత్వం ఆధ్వర్యంలో సేవల నిర్వహణ కోసం కొనుగోలు చేసిన యంత్రాలను సైతం ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) సాకుతో ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తున్నారు.

కాకినాడ జీజీహెచ్‌లో గుండె సంబంధిత చికిత్సల కోసం గత ప్రభుత్వంలో రూ.7 కోట్లతో క్యాథల్యాబ్‌ను సమకూర్చారు. ఇప్పుడు ‘ముఖ్య’నేత సిఫార్సుతో ఈ అధునాతన పరికరాన్ని ఓఅండ్‌ఎం కింద ప్రైవేట్‌కు అప్పగించేశారు. ఏకంగా సింగిల్‌ బిడ్‌ వచ్చినా ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు ఇదే కాంట్రాక్టర్‌ అనంతపురం, ఒంగోలు జీజీహెచ్‌ల్లోని క్యాథ్‌ల్యాబ్‌లను హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే డీఎంఈ నుంచి ప్రభుత్వానికి వెళ్లినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement