breaking news
Radiology
-
విశాఖ కేంద్రంగా రిమోట్ రేడియాలజీ సేవలు
దొండపర్తి(విశాఖ దక్షిణ): దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు టెలీ రేడియాలజీ సేవలు అందించేందుకు ‘టెలీ రేడియాలజీ సొల్యూషన్స్(టీఆర్ఎస్).. విశాఖ మెడ్‌టెక్ జోన్లో నూతన కేంద్రాన్ని ప్రారంభించింది. దేశంలోని ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టెలీ రేడియాలజీ సొల్యూషన్స్ సీఈవో, చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ అర్జున్ కల్యాణ్‌పూర్ మాట్లాడుతూ దేశంలో 70 శాతం గ్రామీణ, ఇతర ప్రాంతాల ప్రజలు రేడియాలజీ సేవల కోసం మెట్రో, పెద్ద నగరాలకు వెళ్లాల్సి వస్తోందని, మెడ్‌టెక్ జోన్లో ఏర్పాటు చేసిన నూతన కేంద్రం ద్వారా ఆలోటు తీరుతుందన్నారు. యువ రేడియాలజిస్టులు, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజిస్టులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర సహాయక సిబ్బందికి ఉపాధి అవకాశాలను కూడా ఈ హబ్ సృష్టిస్తుందన్నారు. ఏపీ మెడ్‌టెక్ జోన్ ఎండీ అండ్ సీఈవో డాక్టర్ జితేంద్రశర్మ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద వైద్య పరికరాల తయారీ పార్కుగా ఉన్న ఏపీ మెడ్‌టెక్ జోన్.. రేడియాలజిస్టులు అందుబాటులో లేని ప్రదేశాల్లో టీఆర్ఎస్ సహకారంతో సీటీ స్కానర్, ఎంఆర్ఐ వంటి స్థానిక మెడ్‌టెక్ ఉత్పత్తుల వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. -
వైద్య పరీక్షలకు ప్రైవేటుకెందుకు?
సాక్షి, సిద్దిపేట: గతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షల కోసం వెళ్తే ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపేవారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటోందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రికి కానీ, స్కానింగ్ సెంటర్లకు కానీ వెళ్లొద్దని.. ఏ వైద్య పరీక్ష కావాలన్నా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని చెప్పారు. మంగళవారం సిద్దిపేటలోని జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రేడియాలజీ ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు. పట్టణ శివారులో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పీహెచ్సీ నుంచి వచ్చే వారికి 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసేందుకు టీ డయాగ్నొస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేశామన్నారు. పీహెచ్‌సీలకు గుండెనొప్పితో వచ్చేవారి కోసం ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్ తదితర సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 రేడియాలజీ ల్యాబ్‌లు, హైదరాబాద్ జంట నగరాలలో అదనంగా మరో 10 ల్యాబ్‌లు ప్రారంభిస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. అన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులలో రూ.40 వేల విలువ గల ఇంజెక్షన్ ఉచితంగా ఇస్తూ.. ప్రమాదకరమైన గుండెపోటు (స్టెమీ) రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. అన్నీ జిల్లాల్లో ఈ ‘స్టెమీ’కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు 70 ఏళ్లలో కేవలం 3 కళాశాలలు వస్తే, ఇవాళ ఏడేళ్లలో 33 మెడికల్ కళాశాలలు తెచ్చుకున్నామన్నారు. దేశంలోనే ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 8 మెడికల్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు. గతంలో ఎంబీబీఎస్ సీట్లు 700 మాత్రమే ఉండేవని, ఇప్పుడు 2,840 సీట్లు పెరిగాయని తెలిపారు. రాబోయే రోజుల్లో 5,240 సీట్ల పెంపునకు కృషి చేస్తామన్నారు. మా తండ్రివయ్యా హరీశ్‌రావు స్థానిక ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో మంత్రి హరీశ్‌రావు పలువురికి సొంత ఖర్చుతో కంటి ఆపరేషన్లు చేయించారు. ఆపరేషన్ చేయించుకున్న విఠలాపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు బాలవ్వ వద్దకు వెళ్లిన మంత్రి.. ‘అవ్వా నేనెవరినీ..?’ అం టూ ప్రశ్నించారు. దానికి ఆమె ‘మా తండ్రివయ్యా హరీశ్‌రావు నువ్వు..’అంటూ బదులిచ్చింది. కాగా ‘నీకు మంచిగ చూశారా, ఇక నుంచి నీకు కండ్లు మంచిగ కనపడతాయి, మీ ఊరు నుంచే కంటి పరీక్షలు మొదలు పెట్టాం..’అని మంత్రి చెప్పారు. -
థెరపినిచ్చే కిరణాలు...
ట్రీట్మెంట్స్ విత్ రేడియాలజీ చికిత్సారంగంలో ఈరోజు సీటీ స్కాన్ అంటేనో, ఎమ్మారై అంటేనో తెలియని వారు ఉండరంటే అతి అతిశయోక్తి కాదు. ఈ రంగంలో జరిగిన అభివృద్ధి అంతా ఇంతా కాదు. ఇరవై ఏళ్ల కిందట ఒక అధ్యయనం నిర్వహించడానికి 20 నిమిషాలు పడితే... ఇవ్వాళ్ల ఆ పనికి కేవలం రెండు సెకండ్లు చాలు! ఇదే వ్యాధినిర్ధారణ విషయంలో, చికిత్సారంగంలో ఓ విప్లవం తెచ్చింది. కేవలం సమయం, సునిశితత్వం పరంగానే కాదు. సంస్థల మధ్య పోటీ పెరుగుతూ ఆర్థిక కోణంలోనూ గతంలో సగటు రోగికి అందుబాటులో లేని కొన్ని ప్రక్రియలు ఇప్పుడు అతడి చెంతకు వచ్చాయి. అంతేకాదు... దీర్ఘకాలంలో జరిగే ఖర్చులు ముందే నివారితమయ్యాయి. మరిన్ని ప్రాణాలు నిలిచాయి. వీటన్నింటికీ కారణం... రేడియేషన్ ద్వారా వెలువడే కిరణాల సాయంతో వ్యాధి నిర్ధారణలతో పాటు కొన్ని చికిత్సలూ చేయడం సాధ్యం కావడమే. ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎమ్మారై వంటివి శరీరంలోని ఏ భాగంలోనైనా వ్యాధి నిర్ధారణలో తోడ్పడతాయన్న సంగతి తెలిసిందే. కానీ చికిత్సలో ఈ రేడియేషన్ తరంగాలు ఎలా ఉపయోగపడతాయి, ఏయే వ్యాధులకు ఉపయోగపడతాయన్న విషయాన్ని తెలుసుకోవడం కోసమే ఈ కథనం. వేరికోసీల్స్ కొందరిలో శుక్రకణాలను చేరవేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడి వృషణాల వాపు, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ అడ్డంకుల వల్ల పురుషుల్లో వంధ్యత్వం రావచ్చు. ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు ఈ అడ్డంకులను తొలగించడం వల్ల వేరికోసీల్స్కు చికిత్స జరగడంతో పాటు పురుషుల్లో శుక్రకణాల ప్రవాహానికి అడ్డంకులు తొలగి పిల్లలు పుట్టడానికి అవకాశాలు పెరుగుతాయి. బయాప్సీలు ఏదైనా ఒక అవయవం నుంచి చిన్న కండరాన్ని సేకరించే ప్రక్రియను ‘బయాప్సీ’ అంటారు. ఇమేజింగ్ గెడైన్స్ ప్రక్రియ ద్వారా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు సాధ్యమైనంత తక్కువ/చిన్న గాటుతో ఇప్పుడు కండను సేకరించడం సాధ్యమవుతోంది. రక్తనాళాల జబ్బులకు... వేరికోజ్ వెయిన్స్ రక్తనాళాల్లో రక్తం ఒకేవైపు పయనిస్తుందన్న విషయం తెలిసిందే. మంచి రక్తం ధమనుల్లో, చెడు రక్తం సిరల్లో ప్రవహిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో రక్తాన్ని ఇలా ఒకే వైపునకు ప్రవహింపజేస్తూ... వెనక్కు రాకుండా చూసే కవాటాలు (వాల్వ్స్) బలహీనపడటం వల్ల రక్తం మునుపటిలా ప్రవహించక సిరల్లో పోగుపడుతుంది. దాంతో చాలా సందర్భాల్లో కాళ్లపై సిరలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. దీనివల్ల చూడటానికి బాగుండకపోవడమే (కాస్మటిక్గానే) కాదు... నొప్పులు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో రేడియేషన్ కిరణాలను ఉపయోగించి ఇలా వాల్వ్స్ దెబ్బతిన్న రక్తనాళాల్లోకి ట్యూబ్‌లను పంపి, వాటి ద్వారా లేజర్ కిరణాలను పంపి చికిత్స చేస్తారు. ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో ఇంటర్వెన్షనల్ ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ లేదా స్క్లీరోథెరపీ అంటారు. దాంతో కవాటాలు బలహీనపడ్డ రక్తనాళాలు శాశ్వతంగా మూసుకుపోతాయి. ఆ పనిని ఆరోగ్యకరమైన ఇతర సిరలు చేస్తాయి. ఫలితంగా రక్తప్రవాహం మునుపటిలాగే జరుగుతుంది. సిరలు ఉబ్బి కనిపించడం, నొప్పులు రావడం తగ్గుతాయి. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (పీఏడీ) సాధారణంగా మంచి రక్తాన్ని తీసుకుపోయే ధమనుల గోడలు చాలా మృదువుగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో అవి గట్టిబారడం, పెళుసుబారినట్లుగా కావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితినే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. ధమని ఇరు చివరలా ఇలా జరిగితే... దీనివల్ల రక్తం మధ్యలోనే పోగుపడినట్లుగా అవుతుంది. దాంతో నొప్పి, చర్మంపైన పుండ్లు రావడం, ఒక్కోసారి ఆ పుండ్లు కుళ్లిపోవడం (గ్యాంగ్రీన్) జరగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో రక్తనాళంలోకి అంతకంటే సన్నటి నాళాన్ని మళ్లీ ప్రవేశపెట్టి యాంజియోప్లాస్టీ ప్రక్రియతోగానీ లేదా కొంత ఒత్తిడి కలిగించిగానీ ఆ ధమనిని వెడల్పు చేస్తారు. ఇందుకు రేడియాలజీ ప్రక్రియ సహాయం తీసుకుంటారు. డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ) రక్తనాళాల్లోని సిరల్లో చెడురక్తం, ధమనుల్లో మంచి రక్తం ప్రవహిస్తాయన్నది తెలిసిందే. శరీరం లోపల ఉండే ఏదైనా సిరలో రక్తం గడ్డ కట్టడం జరిగితే ఆ భాగంలో వాపు కనిపిస్తుంది. సాధారణంగా కాళ్లలో ఎక్కువగా కనిపించే ఈ కండిషన్లో కాలుకు విపరీతంగా వాపు రావడం, దానిపైన ఉండే చర్మపు రంగు మారిపోవడం, తీవ్రమైన నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే డీప్ వీన్ థ్రాంబోసీస్ (డీవీటీ) అంటారు. ఒకవేళ డీవీటీ దీర్ఘకాలం పాటు కొనసాగితే అది పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ లేదా పల్మునరీ ఎంబోలిజమ్ అనే పరిస్థితికి దారితీయవచ్చు. పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్‌లో రక్తం గడ్డకట్టిన పై భాగంలో వాపు వచ్చి, చర్మంపైన పుండ్లు పడతాయి. ఇక పల్మునరీ ఎంబోలిజమ్ అన్నది ప్రాణాపాయం కలిగించే స్థితి. ఇందులో గడ్డకట్టిన రక్తపు ముద్ద మరింత చిన్న చిన్న గడ్డలుగా విడిపోయి రక్తప్రవాహంతో కలిసి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించవచ్చు. దీన్నే పల్మునరీ ఎంబోలిజమ్ అంటారు. ఫలితంగా శ్వాసతీసుకోవడం కష్టమై ప్రాణాపాయం సంభవించవచ్చు. తొలుత డీప్‌వీన్ థ్రాంబోసిస్ ఉన్న చోటికి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు రక్తనాళాల్లోకి మరింత సన్నటి నాళాన్ని (క్యాథెటర్‌ను) ప్రవేశపెట్టడం ద్వారా రక్తపు గడ్డ ఉన్న ప్రాంతానికి చేరతారు. అక్కడ బెలూన్ యాంజియోప్లాస్టీ ప్రక్రియ ద్వారాగానీ లేదా స్టెంటింగ్ ద్వారాగానీ ఆ అడ్డు తొలగించి చికిత్స చేస్తారు. ఫలితంగా రక్తప్రవాహం మళ్లీ మునపటి స్థితికి వస్తుంది. పల్మునరీ ఎంబోలిజమ్ ముందు చెప్పుకున్నట్లుగా గడ్డ కట్టిన రక్తం ముద్దలు మళ్లీ చిన్న చిన్న ముక్కలుగా మారి రక్తప్రవాహంలో కలిసి ఊపిరితిత్తులను చేరుతాయి. ఇది ప్రాణాపాయ స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఊపిరి ఆడకపోవడం, నీసరం, నిస్సత్తువ, గుండెదడ, స్పృహతప్పిపడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్లు దాన్ని పల్మునరీ ఎంబోలిజమ్గా నిర్ధారణ చేసి ‘క్యాథెటర్ డెరెక్టైడ్ థ్రాంబోలైసిస్’ ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తారు. అంటే కాలు లేదా చేతిలోని ప్రధాన రక్తనాళంలోకి మరింత సన్నటి నాళాన్ని పంపి దాని చివర గడ్డకట్టిన రక్తపు ముద్దను చెల్లాచెదురు చేసే (క్లాట్ బస్టింగ్) మందులను ఉపయోగిస్తారు. దాంతో రక్తపు గడ్డ రక్తప్రవాహాన్ని అడ్డగించలేనంత చిన్న చిన్న ముక్కలుగా చెదిరిపోయి ప్రాణాపాయం తప్పుతుంది. ఐవీసీ ఫిల్టర్ ప్లేస్మెంట్ చికిత్స పల్మునరీ ఎంబోలిజమ్ వ్యాధి చరిత్ర ఉన్న రోగులు గానీ లేదా ఇలా జరిగేందుకు అవకాశం ఉన్న రోగుల విషయంలో డాక్టర్లు ఒక ముందు జాగ్రత్త / నివారణ చర్యను చేపడతారు. అదేమిటంటే... గుండెకు చెడు రక్తాన్ని తీసుకుపోయే ‘వేన-కేవా’ అనే అత్యంత ప్రధాన రక్తనాళంలోకి గానీ లేదా ఊపిరితిత్తుల్లోకి గానీ ఈ రక్తపు గడ్డలు ప్రవేశించకుండా ముందుగానే అక్కడ రక్తపు గడ్డలను అడ్డుకునే ‘ఫిల్టర్ల’ను అమర్చుతారు. దీనికోసం రేడియేషన్ థెరపీ చికిత్స సహాయం తీసుకుంటారు. ఈ ప్రక్రియనే ‘ఐవీసీ ఫిల్టర్ పేస్‌మెంట్’ అంటారు. ఫలితంగా పల్మునరీ ఎంబోలిజమ్ను ముందుగానే నివారించవచ్చు. అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్స్ (ఏఏఏ) కడుపు/పొట్టకు రక్తాన్ని చేరవేసే ప్రధాన రక్తనాళమైన అబ్డామినల్ అయోర్టా బలహీనపడటం వల్లగానీ లేదా అది తన ఎలాస్టిసిటీ కోల్పోయి మామూలు పరిమాణం కంటే ఎక్కువగా సాగిపోయి వెడల్పు కావడం వల్లగానీ తీవ్రమైన పొట్టనొప్పి లేదా వీపునొప్పి వస్తాయి. ఇలాంటి స్థితిలో ఎలాస్టిసిటీ కోల్పోయి సాగిపోయి బలహీన పడ్డ రక్తనాళం చీలిపోతే అది ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. ఈ కండిషన్‌నే ‘అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్’ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా కేవలం యాంజియోగ్రఫీ / స్టెంటింగ్ ద్వారా ‘ఎండోవ్యాస్క్యులార్ అన్యురిజమ్ రిపేర్’ అనే ప్రక్రియ సహాయంతో సాగిపోయిన/బలహీన పడ్డ అబ్డామినల్ అయోర్టాకు చికిత్స చేయవచ్చు. మూత్రపిండాలు రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ హైబీపీ ఉన్నవారికి మూత్రపిండాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసే రీనల్ ఆర్టరీ కుంచించుకుపోయినప్పుడు బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా స్టెంటింగ్ ప్రక్రియ ద్వారా దాన్ని వెడల్పు చేసి రేడియాలజీ సహాయంతో చికిత్స చేయడం సాధ్యమే. డయాలసిస్ ఫిస్టులా / ఆర్టీరియో వీనస్ గ్రాఫ్ట్ క్లాట్ కొందరిలో మూత్రపిండాలకు సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి గడ్డలను ‘ఇంటర్వెన్షనల్ డీక్లాట్’ ప్రక్రియ ద్వారా తొలగించే అవకాశం ఉంది. నెఫ్రోస్టోమీ ట్యూబ్ రీప్లేస్మెంట్ కొందరిలో కిడ్నీలో ఏర్పడిన రాళ్లు... కిడ్నీ నుంచి యురేటర్ ద్వారా మూత్రకోశానికి చేరి అక్కడి నుంచి మూత్ర విసర్జన చేసే మూత్రనాళాల్లోకి (యురెథ్రాలోకి) ప్రవేశించి అక్కడ అడ్డంకిగా మారవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మూత్రద్వారం గుండా మరొక చిన్న నాళాన్ని ప్రవేశపెట్టి ఆ రాయిని తొలగించవచ్చు. క్యాన్సర్ గడ్డలు క్యాన్సర్ గడ్డల చికిత్స విషయంలో రేడియాలజీ రంగాన్ని ఉపయోగించి అనేక రకాల చికిత్సలు చేయడం సాధ్యమవుతుంది. ఇందులో గడ్డ ఎలాంటి రకానికి చెందింది, ఎంత పరిమాణంలో ఉంది, ఏ మేరకు వ్యాపించి ఉంది, దాని ఆకృతి ఎలా ఉంది... లాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన చికిత్సను నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో ‘ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్’ అనే ప్రక్రియను ఉపయోగించి... గడ్డకు జరిగే రక్తసరఫరాను ఆపివేస్తారు. దాంతో గడ్డ కుంచించుకుపోయి రాలిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్, క్రయోఅబ్లేషన్, ఇర్రివర్సిబుల్ ఎలక్ట్రోపోరేషన్, హై-ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అనే ప్రక్రియలను అనుసరించి రేడియేషన్ కిరణాలతో నేరుగా క్యాన్సర్ గడ్డలోని కణజాలాన్ని శిథిలమైపోయేలా చేస్తారు. కేవలం గడ్డ ఉన్న ప్రాంతంలోనే కిరణాలు ప్రసరింపజేయడం వల్ల పక్కన ఉండే ఆరోగ్యకరమైన కణజాలానికి అత్యంత తక్కువ నష్టం జరిగేలా చూస్తారు. అలాగే కీమోథెరపీ వల్ల కలిగే సైడ్ఎఫెక్ట్స్నూ తగ్గిస్తారు. కాలేయం పోర్టల్ హైపర్‌టెన్షన్ కాలేయంపై పగుళ్లు ఏర్పడటం (సిర్రోసిస్) లేదా దానికి ఇతరత్రా ఏవైనా ప్రమాదాలు జరగడం (హెపటైటిస్) వంటి సందర్భాల్లో కాలేయానికి రక్తప్రసరణ వేగం తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో రోగులకు అంతర్గత రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రాణాపాయ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ గాటుతో ‘ట్రాన్స్జ్యుగులార్ ఇంట్రాహెపాటిక్ పోర్టోసిస్టమిక్ షంట్ (టిప్స్)’ అనే ప్రక్రియ ద్వారా చికిత్స చేసి రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తారు. బైల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ కాలేయ క్యాన్సర్, బైల్ డక్ట్ క్యాన్సర్, కోలిసిస్టైటిస్, కోలాంజిటిస్ లేదా కాలేయ, బైల్ వ్యవస్థలకు చెందిన ఏ జబ్బుల్లోనైనా బైల్ ప్రవాహానికి అడ్డంకి ఏర్పడినప్పుడు రేడియాలజిస్ట్‌లు సాధారణంగా ‘పెర్క్యుటేనియస్ ట్రాన్స్హెపాటిక్ కోలాంజియోగ్రఫీ (పీటీహెచ్సీ లేదా పీసీటీ) అనే ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా ఆ అడ్డంకిని గుర్తిస్తారు. అలా గుర్తించిన తర్వాత పెర్క్యుటేనియస్ ట్రాన్స్హెపాటిక్ బిలియరీ డ్రైనేజ్ (పీటీబీడీ) అనే ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తారు. ఇందులో క్యాథెటర్ లేదా స్టెంట్‌ను చర్మం పొరల ద్వారా బైల్‌డక్ట్ లోకి పంపి, బైల్ స్రావాన్ని బయటకు డ్రెయిన్ చేస్తారు. ఆ తర్వాత సర్జరీకి పూనుకుంటారు. న్యూరలాజిక్ స్ట్రోక్ (పక్షవాతం) మెదడుకు రక్తనాళాల ద్వారా అందాల్సిన ఆక్సిజన్ లేదా పోషకాలు అందని సమయంలో మెదడులోని ఆ ప్రాంతం దెబ్బతింటుంది. దీన్నే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. ఒకవేళ మెదడుకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు చిట్టిపోయి అంతర్గత రక్తస్రావం జరిగి మెదడులోని భాగాలు దెబ్బతినడం వల్ల ఆ భాగం నియంత్రించే శరీర అవయవాలు పనిచేయకపోవడాన్ని హేమరేజిక్ స్ట్రోక్ అంటారు. స్ట్రోక్ ఎలా వచ్చినా దాని వల్ల మాట్లాడటంలో మార్పులు, కాళ్లూ చేతులు సరిగా పనిచేయకపోవడం, చూపు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లోనే ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ అనే నిపుణులు సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలతో వచ్చిన పక్షవాతం... ఇస్కిమిక్ స్ట్రోకా లేక హేమరేజిక్ స్ట్రోకా అన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ ఆ స్ట్రోక్ రక్తం గడ్డకట్టడం వల్ల జరిగితే ఇంట్రా ఆర్టీరియల్ థ్రాంబోలైసిస్ అనే ప్రక్రియ ద్వారాగానీ లేదా థ్రాంబెక్టమీ అనే ప్రక్రియ ద్వారాగాని ఆ గడ్డను తొలగిస్తారు. ఒకవేళ రక్తనాళాలు సాగిపోయి, ఉబ్బి అవి చిదిమిపోవడం (అన్యురిజమ్స్)వల్ల రక్తస్రావం అయితే వాటిని ఎంబోలైజేషన్ ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తారు. కెరటాయిడ్ ఆర్టరీ స్టెనోసిస్ మన మెడలోని కెరటాయిడ్ ఆర్టరీ అనే ధమని సన్నబారితే మెదడుకు తగినంత రక్తం అందదు. ఇలా సన్నబారినప్పుడు కెరటాయిడ్ ఆర్టరీ స్టెంటింగ్ అనే ప్రక్రియ ద్వారా మెదడుకు తగినంత రక్తం అందేలా చేస్తారు. ఇది కెరటాయిడ్ ఎండార్టరెక్టమీ అనే శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం. కెరటాయిడ్ ఆర్టరీ సన్నబడినట్లు గుర్తించినప్పుడు స్ట్రోక్ రాకుండా ముందస్తు నివారణ చర్యగా ఈ చికిత్స చేస్తారు. స్పైనల్ ఫ్రాక్చర్స్ వెన్నెముకకు ఏదైనా పగుళ్ల వంటివి ఏర్పడితే అలా ఏర్పడిన పగుళ్ల చీలికలలోనికి ఇంజెక్షన్ ద్వారా సిమెంట్ వంటి ఎముకలోనే కలిసిపోయే పదార్థాన్ని పంపి చికిత్స చేస్తారు. ఇంజెక్షన్ ద్వారా చర్మం పొర అయిన ‘పర్క్యుటేనియస్’ లేయర్లోకి ఇంజెక్షన్ చేసి నిర్వహించే ఈ చికిత్సను వర్టిబ్రోప్లాస్టీ లేదా కైఫోప్లాస్టీ అంటారు. ఇలా రేడియాలజీ అన్నది కేవలం వ్యాధి నిర్ధారణ విషయంలోనే గాక... రకరకాల చికిత్సల్లోనూ కీలక భూమిక పోషిస్తోంది. - నిర్వహణ: యాసీన్ మహిళల ఆరోగ్యం విషయంలో... యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఇవి యుటెరస్‌లో ఏర్పడే ఒక రకం గడ్డలు. వీటి వల్ల మహిళల్లో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం జరుగుతాయి. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఇప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు ‘యుటెరైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ (యూఎఫ్ఈ) లేదా ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (యూఏఈ) ప్రక్రియల ద్వారా ఈ గడ్డలకు రక్తప్రసరణ చేసే ధమని నుంచి ఒక క్యాథెటర్‌ను పంపి, ఆ ధమనిని మూసి వేసి ఆ గడ్డలకు జరిగే రక్తప్రసరణను ఆపివేస్తారు. దాంతో ఆ ఫైబ్రాయిడ్స్ కుంచించుకుపోయి రాలిపోతాయి. మహిళల్లో ఫలదీకరణకు తోడ్పడటం కొందరిలో ఫెలోపియన్ ట్యూబ్స్ కుంచించుకుపోవడం వల్ల పురుషుల నుంచి విడుదల అయ్యే శుక్రకణాలు అండాన్ని చేరలేవు. అలాంటి సందర్భాల్లో సాల్పింగోగ్రఫీ అనే ప్రక్రియ ద్వారా ఫెలోపియన్ ట్యూబ్స్‌లోకి సన్నటి నాళాలను పంపి బెలూన్ సహాయంతో వాటిని వెడల్పు చేసి మహిళల్లోని వంధ్యత్వాన్ని నివారించగలరు. -
వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారు
మదనపల్లె ఏరియా ఆస్పత్రి వైద్యులపై డీసీహెచ్‌ఎన్ మండిపాటు మదనపల్లెక్రైం: ‘ఓ ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లో పనిచేసే వైద్యులు ఓ విధి, విధానం లేకుండా వ్యవరించడం తగదు. తమకు కేటాయించిన ఓపీడీలోని రోగులను మాత్రమే పరీక్షించి, పక్క ఓపీడీకి చెందిన వారు వస్తే నాకు సంబంధం లేదు.. మరోచోటుకు వెళ్లమని కసురుకోవడం వైద్యవృత్తికే కళంకం తెస్తుంది. కొంతమంది డాక్టర్లు గిరగీసుకుని వైద్యం చేయడం ఏంటి?. అత్యవసర విభాగంలో డ్యూటీచేసే వారు రోగులు లేనప్పుడు జనరల్ కేసులను కూడా చూడాలి’ అంటూ జిల్లా వైద్యశాలల సంమన్వయకర్త(డీసీహెచ్‌ఎన్) డాక్టర్ సరళమ్మ మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వైద్యులపై విరుచుకుపడ్డారు. గురువారం ఆమె ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక డాక్టర్లు, సిబ్బంది తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మధ్యాహ్నం రెండు గంటలు కాకముందే కొంత మంది డాక్టర్లు ఇళ్లకు వెళ్లిపోతున్నారని, ఆస్పత్రిలో ఎవరు డాక్టర్లు, ఎవరు సిబ్బంది.. ఎవరు బయటి వ్యక్తులనే తేడా తెలియడంలేదన్నారు. డాక్టర్లు యూనిఫామ్, గుర్తింపు కార్డులు వేసుకోవాలన్నారు. అత్యవసర విభాగం నుంచి ఎక్స్‌రే, ల్యాబ్, ఫార్మసీ, డ్రగ్స్టోర్రూము, వార్డులను ఆమె పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న ఆపరేషన్థియేటర్లో కొన్ని మార్పులను సూచించారు. ఆప్తాలమిక్ కేసులకు ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. విధులకు హాజరయ్యే డాక్టర్లు ఓ పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నట్లు తనకు పలు ఫిర్యాదులు వచ్చాయని, దీనికి నేను చాలాషేమ్గా ఫీలవుతున్నానని అన్నారు. ఆస్పత్రిలో ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలు తాము చేయాల్సిన పనులను స్వీపర్లతో చేయించడం తగదన్నారు. పనులు చేయలేని వారు ఇళ్లకు వెళ్లిపోవాలన్నారు. ఆదివారాల్లో ఓపీడీ లేకపోయినా వైద్యులు విధిగా ఆస్పత్రికి వచ్చి వార్డుల్లో ఉన్న తమ పేషంట్లను చూడాలన్నారు. డాక్టర్లు లీవు తీసుకుని మాత్రమే వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆర్ఎంవోనే పూర్తి బాధ్యతలు తీసుకుని ఆస్పత్రిని ప్రక్షాళన చేయాలన్నారు. మాట వినని వారిపై వేటు వేయాలని, దిక్కరిస్తే తనకు సరెండర్ చేయాలని సూచించారు. రోగులకు మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో 27 వైద్య పోస్టులు ఖాళీ జిల్లావ్యాప్తంగా 27 వైద్య పోస్టులు కొరత ఉన్నట్టు డీసీహెచ్‌ఎన్ డాక్టర్ సరళమ్మ తెలిపారు. ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ పోస్టుల భర్తీకి సీఏఎస్‌ల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. కమిషనర్ నుంచి ఉత్తర్వులు వెలువడగానే పోస్టులభర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. మదనపల్లె ఏరియా ఆస్పత్రిలో వెంటిలేటర్లు లేక పలుకేసులను రెఫర్ చేస్తున్నారని విలేకర్లు ప్రశ్నించగా వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ సమా వేశంలో ఆర్ఎంవో గురుస్వామినాయక్, డాక్టర్ జ్ఞానేశ్వర్, హెడ్ నర్సులు, ఆప్తాలమిక్ ఆఫీసర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.