బాప్‌రే!..పాత సామాన్లు అమ్ముకున్న ఎలాన్‌ మస్క్‌, ఏ వస్తువు ఎంత ధర పలికిందంటే

Twitter Bird Statue Sells For $100,000 As Elon Musk Auctions - Sakshi

స్టీలు సామాన్లు, బిందెల కోసం పాత సామాన్లనో, బట్టలనో ఇవ్వడం మనకు తెలిసిందే.. మనమూ ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటాం..అయితే.. అలాంటి పనిని ఒక ప్రపంచ కుబేరుడు చేస్తేనో..కుర్చీలు, బల్లలు, కంప్యూటర్లు మాత్రమే కాదు.. చివరికి కేఎన్‌ 95 మాస్కుల డబ్బాలతో సహా అమ్మకానికి పెట్టేస్తేనో..వినడానికి కొంచెం చిత్రంగా ఉంది కదా.. మరింకేం.. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.. పదండి.. 

స్పేస్‌ ఎక్స్‌ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొన్నప్పటి నుంచీ ఆ కంపెనీని దారిలో పెట్టడానికంటూ.. బ్లూటిక్‌కు డబ్బుల వసూలు నుంచి ఉద్యోగులను తొలగించడం దాకా చాలా చేశారు. ఇప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న అదనపు సామగ్రిని వదిలించుకునే పేరిట వాటినీ అమ్మకానికి పెట్టారు. ఇందుకోసం కార్పొరేట్‌ అసెట్‌ డిస్పోజల్‌ సంస్థ ‘హెరిటేజ్‌ గ్లోబల్‌ పార్ట్‌నర్స్‌’కు బాధ్యత అప్పజెప్పారు. 

ఆ సంస్థ మొత్తం 631 సామాన్లకు సంబంధించి 27 గంటల ఆన్‌లైన్‌ సేల్‌ పెట్టింది. బిడ్డింగ్‌ విధానం ద్వారా వేలానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో నాలుగడుగుల ట్విట్టర్‌ పిట్ట లోగో ప్రతిమతోపాటు 10 అడుగుల ఎత్తున్న ట్విట్టర్‌ నియాన్‌ లైట్, ఎ్రస్పెసో మెషీన్లు, టీవీలు, ఓవెన్లు, టేబుళ్లు, స్పీకర్లు, కిచెన్‌ సామాన్లు వంటివీ ఉన్నాయి. ఆఫీసులో ఉన్న అదనపు సామగ్రిని వదిలించుకోవడం కోసమే ఇదంతా అని పైకి చెబుతున్నప్పటికీ.. శాన్‌ఫ్రాన్సిస్కో కార్యాలయానికి సంబంధించిన అద్దెను మస్క్‌ ఇంకా కట్టలేదట. దీనిపై సంబంధిత యజమాని కేసు కూడా వేశారట. 

పైగా గతేడాది కాలంలో 500 మంది అడ్వటైజర్లు తమ ప్రకటనలు ఇవ్వడాన్ని నిలిపేయడంతో.. ట్విట్టర్‌ ఆదాయం 40 శాతం మేర తగ్గిపోయిందట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ ‘పాత సామాన్ల అమ్మకం’వార్తలు కలకలం రేపాయి. అయితే, ఈ వాదనను హెరిటేజ్‌ గ్లోబల్‌ పార్ట్‌నర్స్‌ ప్రతినిధి ఖండించారు. సామగ్రి అమ్మకానికి, ట్విట్టర్‌ ఆర్థిక పరిస్థితికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇవన్నీ పక్కనబెడితే.. ఈ 27 గంటల సేల్‌లో అత్యధికంగా నాలుగడుగుల ట్విట్టర్‌ పిట్ట లోగో ప్రతిమకు రూ. 81.45 లక్షలు, పదడుగుల నియాన్‌ ట్విట్టర్‌ లోగో లైట్‌కు రూ. 32.5 లక్షలు వచ్చాయి. –సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top