ఫ్రెషర్లవైపే కంపెనీల మొగ్గు.. మార్చిదాకా నియామకాల జోరు.. | Sakshi
Sakshi News home page

ఫ్రెషర్లవైపే కంపెనీల మొగ్గు.. మార్చిదాకా నియామకాల జోరు..

Published Thu, Jan 6 2022 9:01 AM

Teamlease Report Says Hiring Increase From January To March Period - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా జనవరి–మార్చిలో నియామకాల జోరు ఉంటుందని టీమ్‌లీజ్‌ వెల్లడించింది. వ్యాపార కార్యకలాపాలపై కఠినమైన ఆంక్షలు లేనట్టయితే కార్పొరేట్‌ కంపెనీల నియామకాల్లో గణనీయమైన వృద్ధి ఉంటుందని తెలిపింది. 21 రంగాల వారీగా 14 నగరాల్లోని 829 చిన్న, మధ్య, భారీ స్థాయి కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందిన టీమ్‌లీజ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ రిపోర్ట్‌ ప్రకారం.. నియామకాలు చేపట్టాలన్న కంపెనీల ఆలోచన ప్రస్తుత త్రైమాసికంలో 9 శాతం పాయింట్ల వరకు పెరగవచ్చు. కోవిడ్‌ వ్యాప్తి చెందినప్పటి నుండి నియామక ఉద్దేశంలో నమోదయ్యే అత్యధిక వృద్ధి ఇదే. సమీక్షించిన 21 రంగాల్లో ఏడు 10 శాతంపైగా పాయింట్లు సాధించే అవకాశం ఉంది. 17 రంగాలు 5 శాతంపైగా పాయింట్లను దక్కించుకోనున్నాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే 11 రంగాలు రికవరీని ప్రదర్శిస్తాయి.  

ఐటీ కంపెనీలే ముందంజ.. 
మహమ్మారి కారణంగా ఏర్పడిన సరఫరా అంతరాయాలను ఎదుర్కోవడానికి మెరుగైన సామర్థ్య వినియోగం, ప్రైవేట్‌ పెట్టుబడుల పెరుగుదల, అధికమవుతున్న ఎగుమతులు.. వెరశి ఉద్యోగాల జోరును వేగవంతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఐటీ పనితీరు, సాంకేతికత అనుసంధాన సంస్థలు ఉద్యోగ కల్పనలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి. 89 శాతం ఐటీ కంపెనీలు నిపుణులను చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి. విద్యా రంగంలో 80 శాతం, ఆరోగ్య, ఫార్మా 71, ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్స్‌లో 69 శాతం కంపెనీలు కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సుముఖంగా ఉన్నాయి. తదుపరి లాక్‌డౌన్‌లు విధించకపోతే ఇతర రంగాలు సైతం నియామకాలను చేపడతాయి.  

ఇదే సరైన సమయం.. 
నిపుణులైన మానవ వనరులకు ఇది సరైన సమయం. ప్రస్తుత త్రైమాసికంలో 2–5 సంవత్సరాల అనుభవం ఉన్న జూనియర్‌ స్థాయి నిపుణులకు బదులుగా ఫ్రెషర్లను నియమించుకోవడంపై కంపెనీలు దృష్టి సారించనున్నాయి. జూనియర్‌ టాలెంట్‌ను రిక్రూట్‌ చేసుకోవడానికి 46 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చిలో అట్రిషన్‌ వేగంగా పెరగనుంది. ఐటీ, విద్య సేవలు, హెల్త్‌కేర్, ఫార్మా, నాలెడ్జ్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ రంగాల్లో 8 శాతంపైగా అట్రిషన్‌ నమోదు కానుంది. అన్ని రంగాలు క్రితం త్రైమాసికంలో కంటే అధిక అట్రిషన్‌ రేట్లను కలిగి ఉండనున్నాయి. ఉద్యోగి దృక్పథం, పని విధానంలో మార్పు దీనికి కారణాలు అని టాలెంట్‌ అక్విజిషన్‌ అనలిస్ట్‌ రేచల్‌ స్టెల్లా రాజ్‌ తెలిపారు.
 

చదవండి: సీఎంఎస్‌ ఇన్ఫోలో మహిళా డైరెక్టర్లు

Advertisement

తప్పక చదవండి

Advertisement