ఫ్రెషర్లకు గుడ్ న్యూస్, భారీగా పెరగనున్న నియామకాలు!

Teamlease Employment Outlook Report Indicates A Sharp Rise In Hiring 61% - Sakshi

జులై–సెప్టెంబర్‌లో 61 శాతం వృద్ధికి చాన్స్‌ 

టీమ్‌లీజ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ నివేదిక  

పీఎల్‌ఐతో పెరగనున్న పెట్టుబడుల ఎఫెక్ట్‌

ముందు వరుసలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఉపాధి కల్పన ఊపందుకోనున్నట్లు టీమ్‌లీజ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ నివేదిక అంచనా వేసింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో ఉద్యోగ నియామకాల్లో 61 శాతం వృద్ధి నమోదయ్యే వీలున్నట్లు పేర్కొంది. ఇందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్‌ఐ) దోహదపడనున్నట్లు తెలియజేసింది. పీఎల్‌ఐకింద పబ్లిక్‌ పెట్టుబడులు పెరగనుండటంతో క్యూ2లో భారీ సంఖ్యలో ఉద్యోగులను ఎంపిక చేసుకోనున్నట్లు టీమ్‌లీజ్‌ నిర్వహించిన సర్వేలో కంపెనీలు వెల్లడించాయి. క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నమోదైన 54 శాతంతో పోలిస్తే ఉపాధి కల్పనకు పెరిగిన ఆసక్తి 7 శాతం అధికమని టీమ్‌లీజ్‌ తెలియజేసింది.
 
నగరాల స్పీడ్‌ 

త్రైమాసికవారీగా చూస్తే రానున్న కాలం(క్యూ2)లో మెట్రోలు, టైర్‌–1 నగరాలలో ఉద్యోగ కల్పన ఆసక్తి 6 శాతం పుంజుకుని 89 శాతానికి చేరినట్లు నివేదిక తెలియజేసింది. ఇక టైర్‌–2 నగరాలలో మరింత అధికంగా 7 శాతం బలపడి ఉపాధి కల్పనాసక్తి 62 శాతాన్ని తాకింది. టైర్‌–3 పట్టణాలలో ఇది 3 శాతం పెరిగి 37 శాతమయ్యింది. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి నామమాత్ర వృద్ధితో కొత్త ఉద్యోగాల సృష్టికి 2 శాతమే ఆసక్తి కనబడింది. ఈ సర్వేకు టీమ్‌లీజ్‌ 14 నగరాలు, పట్టణాల నుంచి 23 రంగాలను పరిగణించింది. 900 చిన్న, మధ్యతరహా, భారీ కంపెనీలను ఎంపిక చేసుకుంది.  

సర్వీసులు భేష్‌ 
ఉపాధి కల్పనకు సై అంటున్న సర్వీసుల రంగంలో బెంగళూరు(97 శాతం),  ముంబై(81 శాతం), ఢిల్లీ(68 శాతం) ముందు నిలిచాయి. ఇక తయారీ రంగంలో అయితే ఢిల్లీ(72 శాతం), ముంబై(59 శాతం), చెన్నై(55 శాతం) జాబితాలో చోటు సాధించాయి. పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పనకు సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నట్లు టీమ్‌లీజ్‌ సహవ్యవస్థాపకుడు రితుపర్ణ చక్రవర్తి తెలియజేశారు. పీఎల్‌ఐ పథకంలో భాగంగా పబ్లిక్‌ పెట్టుబడులు ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 2.65 లక్షల కోట్ల ముందస్తు సహాయక ప్యాకేజీ.. పర్యాటకం, విమానయానం, హౌసింగ్‌ తదితర పలు రంగాలకు మద్దతివ్వనున్నట్లు పేర్కొన్నారు. వెరసి ఉద్యోగావకాశాల పట్ల సానుకూల థృక్పథం నెలకొన్నట్లు వివరించారు. రానున్న త్రైమాసికాలలోనూ హైరింగ్‌ సెంటిమెంటు 70 శాతం మార్క్‌ను దాటగలదని అంచనా వేశారు. 

మహమ్మారితో చెక్‌ 
కోవిడ్‌–19 కేసులు పెరగడం, లేదా ఆంక్షల అమలుతో కొన్ని సంస్థలు అప్పుడప్పుడూ ఉపాధి కల్పనను నిలిపి వేస్తున్నట్లు చక్రవర్తి తెలియజేశారు. అయితే మొత్తంగా ఇందుకు అనుకూల వాతావరణమే ప్రస్తుతం నెలకొని ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. పరిమాణంరీత్యా చూస్తే చిన్న సంస్థలు అత్యధికంగా 47 శాతం(6 శాతం ప్లస్‌), మధ్యతరహా, భారీ కంపెనీలు 69 శాతం(4 శాతం అప్‌) హైరింగ్‌కు ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. మధ్య, సీనియర్‌ స్థాయిలతో పోలిస్తే ప్రారంభస్థాయి ఉపాధి కల్పన వేగమందుకోగా.. తదుపరి జూనియర్‌ స్థాయికి డిమాండ్‌ ఉన్నట్లు తెలియజేసింది. మార్కెటింగ్‌ విభాగంలో ఉపాధి కల్పనాసక్తి 10 శాతం పెరిగి 63 శాతానికి, ఐటీలో 8 శాతం పుంజుకుని 90 శాతానికి చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top