breaking news
Employment agency
-
ఫ్రెషర్లకు గుడ్ న్యూస్, భారీగా పెరగనున్న నియామకాలు!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఉపాధి కల్పన ఊపందుకోనున్నట్లు టీమ్‌లీజ్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ నివేదిక అంచనా వేసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో ఉద్యోగ నియామకాల్లో 61 శాతం వృద్ధి నమోదయ్యే వీలున్నట్లు పేర్కొంది. ఇందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) దోహదపడనున్నట్లు తెలియజేసింది. పీఎల్ఐకింద పబ్లిక్ పెట్టుబడులు పెరగనుండటంతో క్యూ2లో భారీ సంఖ్యలో ఉద్యోగులను ఎంపిక చేసుకోనున్నట్లు టీమ్‌లీజ్ నిర్వహించిన సర్వేలో కంపెనీలు వెల్లడించాయి. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నమోదైన 54 శాతంతో పోలిస్తే ఉపాధి కల్పనకు పెరిగిన ఆసక్తి 7 శాతం అధికమని టీమ్‌లీజ్ తెలియజేసింది. నగరాల స్పీడ్ త్రైమాసికవారీగా చూస్తే రానున్న కాలం(క్యూ2)లో మెట్రోలు, టైర్–1 నగరాలలో ఉద్యోగ కల్పన ఆసక్తి 6 శాతం పుంజుకుని 89 శాతానికి చేరినట్లు నివేదిక తెలియజేసింది. ఇక టైర్–2 నగరాలలో మరింత అధికంగా 7 శాతం బలపడి ఉపాధి కల్పనాసక్తి 62 శాతాన్ని తాకింది. టైర్–3 పట్టణాలలో ఇది 3 శాతం పెరిగి 37 శాతమయ్యింది. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి నామమాత్ర వృద్ధితో కొత్త ఉద్యోగాల సృష్టికి 2 శాతమే ఆసక్తి కనబడింది. ఈ సర్వేకు టీమ్‌లీజ్ 14 నగరాలు, పట్టణాల నుంచి 23 రంగాలను పరిగణించింది. 900 చిన్న, మధ్యతరహా, భారీ కంపెనీలను ఎంపిక చేసుకుంది. సర్వీసులు భేష్ ఉపాధి కల్పనకు సై అంటున్న సర్వీసుల రంగంలో బెంగళూరు(97 శాతం), ముంబై(81 శాతం), ఢిల్లీ(68 శాతం) ముందు నిలిచాయి. ఇక తయారీ రంగంలో అయితే ఢిల్లీ(72 శాతం), ముంబై(59 శాతం), చెన్నై(55 శాతం) జాబితాలో చోటు సాధించాయి. పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పనకు సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నట్లు టీమ్‌లీజ్ సహవ్యవస్థాపకుడు రితుపర్ణ చక్రవర్తి తెలియజేశారు. పీఎల్ఐ పథకంలో భాగంగా పబ్లిక్ పెట్టుబడులు ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 2.65 లక్షల కోట్ల ముందస్తు సహాయక ప్యాకేజీ.. పర్యాటకం, విమానయానం, హౌసింగ్ తదితర పలు రంగాలకు మద్దతివ్వనున్నట్లు పేర్కొన్నారు. వెరసి ఉద్యోగావకాశాల పట్ల సానుకూల థృక్పథం నెలకొన్నట్లు వివరించారు. రానున్న త్రైమాసికాలలోనూ హైరింగ్ సెంటిమెంటు 70 శాతం మార్క్‌ను దాటగలదని అంచనా వేశారు. మహమ్మారితో చెక్ కోవిడ్–19 కేసులు పెరగడం, లేదా ఆంక్షల అమలుతో కొన్ని సంస్థలు అప్పుడప్పుడూ ఉపాధి కల్పనను నిలిపి వేస్తున్నట్లు చక్రవర్తి తెలియజేశారు. అయితే మొత్తంగా ఇందుకు అనుకూల వాతావరణమే ప్రస్తుతం నెలకొని ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. పరిమాణంరీత్యా చూస్తే చిన్న సంస్థలు అత్యధికంగా 47 శాతం(6 శాతం ప్లస్), మధ్యతరహా, భారీ కంపెనీలు 69 శాతం(4 శాతం అప్) హైరింగ్‌కు ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. మధ్య, సీనియర్ స్థాయిలతో పోలిస్తే ప్రారంభస్థాయి ఉపాధి కల్పన వేగమందుకోగా.. తదుపరి జూనియర్ స్థాయికి డిమాండ్ ఉన్నట్లు తెలియజేసింది. మార్కెటింగ్ విభాగంలో ఉపాధి కల్పనాసక్తి 10 శాతం పెరిగి 63 శాతానికి, ఐటీలో 8 శాతం పుంజుకుని 90 శాతానికి చేరింది. -
ఈపీఎఫ్ విత్‌డ్రాలకు ఒక్కటే దరఖాస్తు
న్యూఢిల్లీ: పిల్లల వివాహాలు, ఉన్నత విద్య, గృహరుణాలు, గృహనిర్మాణం, ఆధునీకీకరణ, భూమి కొనుగోలు ఇలా వేర్వేరు సందర్భాల్లో నగదు అవసరాల కోసం ఈపీఎఫ్ ఖాతాలోని నగదును విత్‌డ్రా చేసే చందాదారులు ప్రస్తుతం వేర్వేరు దరఖాస్తు ఫామ్‌లను నింపుతున్నారు. ఇకపై వీటన్నింటికీ బదులుగా ఒకే పేజీలో తయారైన ఒక్కటే దరఖాస్తు నింపితే సరిపోతుందని ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్‌వో) సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ దరఖాస్తుకు స్వీయ ధ్రువీకరణ లాంటివి కూడా అవసరంలేదని సంస్థ స్పష్టంచేసింది. పీఎఫ్ ఖాతాతో ఆధార్, బ్యాంకు ఖాతా లను అనుసంధానం చేసుకున్న వారు నేరుగా 19(యూఏఎన్), 10సీ(యూఏఎన్), 31(యూఏఎన్) ఫారాలను పంపే వీలుంది. ఈ ఫారాలకు ఉద్యోగ సంస్థల అటస్టేషన్ అక్కర్లేదు. అనుసంధానం చేసుకోనివారు అటస్టేషన్తో 19, 10సీ, 31 ఫారాలను నింపాల్సి ఉంటుంది.