టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌ ! 

TCS To Consider Share Buyback On Oct 7 - Sakshi

రూ.20,000 కోట్ల వరకు..

సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టీసీఎస్‌ షేర్లను  బైబ్యాక్‌ చేసే అవకాశాలున్నాయి. షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనపై రేపు(బుధవారం) జరిగే బోర్డ్‌ సమా వేశంలో చర్చించనున్నట్లు కంపెనీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు నివేదించింది. అదే రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కంపెనీ వెల్లడించనున్నది. రెండో మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. టీసీఎస్‌ 2018లో రూ.16,000 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేసింది. ఒక్కో షేర్‌ను రూ.2,100 ధరకు మొత్తం 7.61 కోట్ల ఈక్విటీ షేర్లను ఈ కంపెనీ బైబ్యాక్‌ చేసింది. 2017లో కూడా ఇదే రేంజ్‌లో షేర్లను బైబ్యాక్‌ చేసింది. ప్రస్తుత బైబ్యాక్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడి కానప్పటికీ, రూ.20,000 కోట్ల రేంజ్‌లో షేర్ల బైబ్యాక్‌ ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

టాటా సన్స్‌ కోసమే షేర్ల బైబ్యాక్‌ ? 
ఈ షేర్ల బైబ్యాక్‌ వల్ల టీసీఎస్‌ ప్రమోటర్‌ టాటా సన్స్‌కే ఎక్కువ ప్రయోజనం కలుగనున్నది. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్న టాటా మోటార్స్, ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి టాటా సన్స్‌కు నిధుల అవసరం ఉందని, దాని కోసమే టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌ చేయనున్నదని విశ్లేషకులంటున్నారు.  

ఇతర ఐటీ కంపెనీలూ ఇదే బాటలో....!  
డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ) కారణంగా పలు కంపెనీలు డివిడెండ్ల చెల్లింపుల కంటే షేర్ల బైబ్యాక్‌కే ప్రాధాన్యత ఇస్తున్నాయని నిపుణులంటున్నారు. కాగా నిధులు పుష్కలంగా ఉన్న ఇతర ఐటీ  కంపెనీలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తదితర కంపెనీలు కూడా షేర్ల బైబ్యాక్‌ బాట పట్టే అవకాశాలే అధికంగా ఉన్నాయని వారంటున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top