130 కీలక క్లయింట్ కంపెనీలతో డీల్స్
2.7 లక్షల మంది ఏఐ నిపుణులతో సిద్ధం
‘బిల్డ్–పార్ట్‌నర్–అక్వైర్’ వ్యూహంతో విస్తరణ
గ్లోబల్ లీడర్‌గా అవతరించడమే లక్ష్యం
వార్షిక నివేదికలో సీఈవో, ఎండీ కృతివాసన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత టెక్నాలజీ సేవల సంస్థగా అవతరించడమే టీసీఎస్ లక్ష్యమని ఆ కంపెనీ సీఈవో, ఎండీ కె.కృతివాసన్ తెలిపారు. 2025–26 వార్షిక నివేదికలో షేర్‌హోల్డర్లను ఉద్దేశించి రాసిన లేఖలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. వ్యాపార సంస్థల్లో ఏఐ వినియోగానికి 2025–26 ఆర్థిక సంవత్సరం ఒక ‘కీలక మలుపు’ గా నిలిచిందన్నారు. క్లయింట్లు ఏఐని ప్రయోగాత్మక దశ నుంచి పూర్తిస్థాయి అమలువైపు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.
టాప్ క్లయింట్ల ఫస్ట్ ఛాయిస్
‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సేవల సంస్థగా అవతరించడమే టీసీఎస్ లక్ష్యం. ఏటా 50 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం అందించే 139 మంది కీలక క్లయింట్లలో ఇప్పటికే 130 మంది ఏఐ ప్రాజెక్టుల కోసం టీసీఎస్‌ను భాగస్వామిగా ఎంపిక చేసుకోవడం మా వ్యూహానికి దక్కిన విజయానికి నిదర్శనం’ అని కృతివాసన్ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి ఇంటెలిజెన్స్ వరకు పూర్తి స్థాయి (ఫుల్–స్టాక్) ఏఐ సేవలను అందించే సంస్థగా టీసీఎస్‌ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
2.7 లక్షల మందికి ఏఐ శిక్షణ
భారీ సాంకేతిక మార్పులకు అనుగుణంగా టీసీఎస్ ఉద్యోగులకు పెద్దఎత్తున శిక్షణ ఇస్తోందని కృతివాసన్ తెలిపారు. ప్రస్తుతం 2.7 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఏఐలో అత్యాధునిక నైపుణ్యాలు సాధించారని, గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగిందన్నారు.
డిజిటల్ సేవల్లో చెరగని ముద్ర
భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతంలో టీసీఎస్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం)ను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఈ–కామర్స్ వేదికగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ వేదిక ద్వారా జరిగిన కొనుగోళ్ల విలువ రూ.5 లక్షల కోట్లను దాటిందన్నారు. ఎస్‌బీఐ ‘యోనో 2.0’ను పది భాషల్లో 20 కోట్ల మందికి సేవలు అందించేలా అప్‌గ్రేడ్ చేశామన్నారు. కోటికి పైగా ఈ–పాస్‌పోర్టుల జారీ, ఆర్బీఐ కోసం 250 టీబీ డేటాను విశ్లేషించగల మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు వంటి మైలురాళ్లను ఆయన వివరించారు.
వ్యూహాత్మక కొనుగోళ్లు, లక్ష్యాలు
ఏఐ ఎకోసిస్టమ్‌లో ‘బిల్డ్–పార్ట్‌నర్–అక్వైర్’ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా అమెరికాకు చెందిన లిస్ట్‌ఎంగేజ్, కోస్టల్ క్లౌడ్ సంస్థలను కొనుగోలు చేశామని తెలిపారు. దీంతో గ్లోబల్ సేల్స్‌ఫోర్స్ కన్సల్టెంట్లలో టీసీఎస్ టాప్–5లో నిలిచిందన్నారు. అలాగే టీపీజీ భాగస్వామ్యంతో ‘హైపర్‌వాల్ట్’ ఏఐ మౌలిక సదుపాయాల వ్యాపారాన్ని ప్రారంభించామని, భారత్‌లో 1 గిగావాట్ (జీడబ్ల్యూ) సామర్థ్యం గల డేటా సెంటర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.
మేధోపరమైన మౌలిక సదుపాయంగా కృత్రిమ మేధ
కృత్రిమ మేధ (ఏఐ) ఇకపై కేవలం సాంకేతిక పరిజ్ఞానంలో ఒక భాగం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల నిర్వహణకు ‘మేధోపరమైన మౌలిక సదుపాయం’ గా మారుతోందని టీసీఎస్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ వార్షిక నివేదికలో షేర్‌హోల్డర్లను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హ్యూమన్ ప్లస్ ఏఐ’ ఆపరేటింగ్ మోడల్ అమలును టీసీఎస్ మరింత విస్తరించిందన్నారు. ఏఐ సేవల ద్వారా వార్షిక ప్రాతిపదికన 2.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,320 కోట్లు), క్లౌడ్, డేటా, సైబర్ భద్రత వంటి న్యూ–ఏజ్ సేవల ద్వారా 11.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.96,600 కోట్లు) ఆదాయం ఆర్జించినట్లు పేర్కొన్నారు.
భారత్‌లో తొలి ఏఐ కేంద్రీకృత డేటా సెంటర్: సురక్షితమైన, స్థిరమైన, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై భవిష్యత్ వ్యూహాన్ని కేంద్రీకరిస్తున్నట్లు చంద్రశేఖరన్ వెల్లడించారు. ఇందులో భాగంగా భారత్‌లో మొట్టమొదటి ‘ఏఐ కేంద్రీకృత డేటా సెంటర్’ ను నిర్మించేందుకు టీసీఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఇది 160 కిలోవాట్ల (కేడబ్ల్యూ) కంటే ఎక్కువ ర్యాక్ డెన్సిటీతో అత్యంత శక్తివంతంగా ఉంటుందన్నారు. అలాగే వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ‘ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్’ను అభివృద్ధి చేసి, ‘ఏజెంటిక్ ఏఐ’ సొల్యూషన్స్ అమలును వేగవంతం చేయడం కంపెనీ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉంటుందన్నారు.
జోరుగా లాభాలు.. నిలకడగా నియామకాలు: గత ఆర్థిక సంవత్సరపు(2025–26) ఫలితాలను విశ్లేíÙస్తూ కంపెనీ వృద్ధి బాటలో పయనిస్తోందని చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. మార్చి త్రైమాసికంలో టీసీఎస్ నికరలాభం 12.22 శాతం వృద్ధితో రూ.13,718 కోట్లకు చేరుకోగా, 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం లాభం రూ.49,210 కోట్లుగా నమోదైంది. గత రెండు త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో కొత్తగా 2,356 మందిని నియమించుకున్నామని తెలిపారు. దీంతో 2026 మార్చి 31 నాటికి సంస్థలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519 కి చేరింది.
కొత్త డీల్స్: గడిచిన మూడు నెలల్లోనే టీసీఎస్ 12 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో ఉత్తర అమెరికా,
బ్యాంకింగ్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాలు కీలక పాత్ర పోషించాయి.
భవిష్యత్తు వ్యూహాలపై ఫోకస్
భవిష్యత్తులో నాలుగు ప్రధాన వ్యూహాలపై దృష్టి సారించనున్నట్లు కృతివాసన్ వెల్లడించారు. వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏఐ వ్యవస్థల నిర్మాణంతో పాటు, భారత్‌లో తొలి ‘హై–డెన్సిటీ ఏఐ డేటా సెంటర్’ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 3,600 భాగస్వామ్యాల సహకారంతో ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టు ఇంటెలిజెన్స్’ సేవలను మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశీయ డేటా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సురక్షితమైన, స్థిరమైన, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటే తమ లక్ష్యమన్నారు.


