ప్రత్యర్థులకు షాక్ : త్వరలో టాటా సూపర్ యాప్

Tata to launch super app covering range of digital services - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఇ-కామర్స్  విభాగంలోకి  దేశీయ అతిపెద్ద వ్యాపార దిగ్గజం టాటా గ్రూపు మరింత వేగంగా దూసుకు వస్తోంది. ఇందుకు ఒక సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా ప్రతిదీ ఆర్డర్ చేసేలా ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో “సూపర్ యాప్” ను ఆవిష్కరించనుంది. తద్వారా బిలియనీర్ ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్‌ లాంటి ఇతర సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.  

టాటా సాల్ట్ నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) వరకు విస్తరించి టాటా గ్రూపు గత ఏడాది టాటా డిజిటల్  పేరుతో డిజిటల్ వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా  చైనాలో ప్రాచుర్యం పొందిన టెన్సెంట్, అలీబాబా తరహాలో ఇక్కడ కూడా సూపర్ యాప్‌ను తీసుకు రానుంది. దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో దీన్ని లాంచ్ చేయనుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నట్లు పలు వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది.

అయితే సూపర్ యాప్‌నకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ, ఫ్యాషన్ షాపింగ్ యాప్ టాటా క్లిక్, కిరాణా ఇ-స్టోర్ స్టార్‌క్విక్ ఆన్‌లైన్, ఎలక్ట్రానిక్స్ ప్లాట్‌ఫాం క్రోమా ద్వారా ఇప్పటికే సేవలను అందిస్తున్న టాటా గ్రూప్, వీటన్నింటి సమ్మితంగా, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఒక కొత్త సూపర్ యాప్ ను రూపొందించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సూపర్ యాప్ ద్వారా ఫుడ్, కిరాణా, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ లాంటి వాటితో పాటు ఇతర పేమెంట్ సేవలను కూడా అందుబాటులోకి తేనుంది. ఇదొక సూపర్ యాప్. ఇందులో పలు యాప్స్ ఉంటాయి. డిజిటల్ సేవల్లో తమకు అపారమైన అవకాశాలున్నాయని చంద్రశేఖరన్ వెల్లడించారు. భారతదేశంలోఅనేక కోట్లాదిమంది వినియోగదారులను అనుసంధానిస్తూ వారికి సరళమైన ఆన్‌లైన్ అనుభవాన్ని అందించనున్నామని పేర్కొన్నారు. 

కాగా గోల్డ్‌మన్ సాచ్ నివేదిక ప్రకారం, 2030 నాటికి భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 శాతాన్ని డిజిటల్ వ్యాపారం ఆక్రమించనుంది. సుమారు15 రెట్లు పుంజుకుని 300 బిలియన్ డాలర్లను తాకుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు  తాజా వ్యూహాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top