సొంతగూటికి ఎయిరిండియా!!

Tata Group wins bid for Air India - Sakshi

బిడ్డింగ్‌లో ‘మహారాజా’ను దక్కించుకున్న టాటా గ్రూప్‌

అత్యధికంగా రూ. 18,000 కోట్లకు బిడ్‌

డిసెంబర్‌లోగా కొనుగోలు ప్రక్రియ పూర్తి

టాటా గ్రూప్‌లో మూడో ఎయిర్‌లైన్స్‌

పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ సుదీర్ఘ నిరీక్షణకు, ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ కథకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. తొమ్మిది దశాబ్దాల క్రితం తాము నెలకొలి్పన విమానయాన దిగ్గజం ఎయిరిండియాను దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్‌ తిరిగి దక్కించుకుంది. బిడ్డింగ్‌లో పోటీ సంస్థ స్పైస్‌జెట్‌ను పక్కకు నెట్టి, రూ. 18,000 కోట్లు వెచి్చంచి కొనుగోలు చేసింది. దీనిపై టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా ఆనందం వ్యక్తం చేయగా, ప్రభుత్వ .. పరిశ్రమ వర్గాలు అభినందనలు తెలియజేశాయి. తిరిగి టాటా గ్రూప్‌ గూటికి చేరడంపై ఎయిరిండియా ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.  

న్యూఢిల్లీ: పారదర్శకమైన బిడ్డింగ్‌ ప్రక్రియలో, ప్రభుత్వ రంగ ఎయిరిండియాను అత్యధికంగా రూ. 18,000 కోట్ల బిడ్‌తో టాటా గ్రూప్‌ దక్కించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఎయిరిండియాకు సంబంధించి రూ. 15,300 కోట్ల రుణభారాన్ని తీసుకోవడంతో పాటు రూ. 2,700 కోట్లు నగదు చెల్లించేలా టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆఫర్‌ చేసినట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు. డిసెంబర్‌ ఆఖరు నాటికి లావాదేవీ పూర్తి కాగలదని ఆయన తెలిపారు. 2020 డిసెంబర్‌ నాటికి ఏడు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) వచ్చాయని, కానీ రెండే అర్హత పొందాయని పాండే తెలిపారు. హోం మంత్రి అమిత్‌ షా సారథ్యంలోని నిర్దిష్ట ఎయిరిండియా ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఐఎస్‌ఏఎం) అక్టోబర్‌ 4నే టాటా గ్రూప్‌ బిడ్‌కు ఆమోద ముద్ర వేసిందని ఆయన చెప్పారు.

అయితే, దీన్ని అప్పుడే ప్రకటించకపోవడానికి గల కారణాలను వెల్లడించలేదు. ‘‘డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగింది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి లావాదేవీ పూర్తి కావచ్చని భావిస్తున్నాం’’ అని పాండే పేర్కొన్నారు. ఇక తర్వాత దశలో లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ) జారీ చేయడం, వాటాల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేయడం మొదలైనవి ఉంటాయని ఆయన తెలిపారు. ఎయిరిండియాకు రిజర్వ్‌ ధర రూ. 12,906 కోట్లుగా కేంద్రం నిర్ణయించగా .. ప్రైవేట్‌ రంగ విమానయాన కంపెనీ స్పైస్‌జెట్‌ ప్రమోటర్‌ అజయ్‌ సింగ్‌ సారథ్యంలోని కన్సార్షియం రూ. 15,100 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. మరోవైపు, ఎయిరిండియా తిరిగి టాటా గ్రూప్‌నకు చేరడంతో కంపెనీకి కొత్త శకం ప్రారంభమైందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. కొత్త మేనేజ్‌మెంట్‌కు అభినందనలు తెలిపారు.  

రెండో పెద్ద ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌గా టాటా..
బిడ్డింగ్‌లో టాటా గ్రూప్‌ విజేతగా నిలి్చన వార్త వచి్చన కాస్సేపటికి, కంపెనీ మాజీ చైర్మన్‌ జేఆర్‌డీ టాటా గతంలో ఎయిరిండియా విమానం నుంచి దిగుతున్న పాత చిత్రాన్ని టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా ట్వీట్‌ చేశారు. నిర్దిష్ట రంగాల్లో ప్రైవేట్‌ సంస్థలకు చోటు కలి్పంచడం హర్షణీయమని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తాజా పరిణామంతో 1953లో జాతీయం చేశాక, దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఎయిరిండియా సొంత గూటికి చేరినట్లయింది. ఎయిరిండియాను దక్కించుకోవడంతో టాటా గ్రూప్‌లో మూడో ఎయిర్‌లైన్‌ బ్రాండ్‌ చేరినట్లవుతుంది. టాటా గ్రూప్‌ ఇప్పటికే ఎయిర్‌ఏషియా, విస్తార (సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి) విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. ఎయిరిండియా, విస్తార, ఎయిర్‌ఏíÙయాలకు మొత్తం 26.9 శాతం మార్కెట్‌ వాటా ఉంటుంది. ఈ మూడు సంస్థల కన్సాలిడేషన్‌ ప్రక్రియ గానీ పూర్తయితే దేశీయంగా ఇండిగో తర్వాత రెండో అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌గా టాటా గ్రూప్‌ ఆవిర్భవించనుంది.  

డీల్‌ స్వరూపం ఇలా..
ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా దాని అనుబంధ కంపెనీల మొత్తం రుణభారం రూ. 61,562 కోట్లుగా ఉంది. ఇందులో టాటా గ్రూప్‌ రూ. 15,300 కోట్ల రుణాన్ని తీసుకోనుంది. మిగతా రూ. 46,262 కోట్లు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ అయిన ఎయిరిండియా అసెట్స్‌ హోల్డింగ్‌ (ఏఐఏహెచ్‌ఎల్‌)కు బదలాయిస్తారు. ఎయిరిండియాకు చెందిన స్థలాలు, భవంతులు వంటి ప్రధానయేతర అసెట్స్‌ ఈ డీల్‌లో భాగంగా ఉండవు. వీటిని ఏఐఏహెచ్‌ఎల్‌కు కేంద్రం బదలాయిస్తుంది. వీటి విలువ సుమారు రూ. 14,718 కోట్లు. ఎయిరిండియా బ్రాండ్‌ లేదా లోగోను అయిదేళ్ల దాకా టాటా గ్రూప్‌ మరెవరికీ బదలాయించడానికి వీల్లేదు. ఆ తర్వాత ఒకవేళ బదలాయించినా భారతీయ సంస్థకే ఇవ్వాల్సి ఉంటుంది. ఎయిరిండియాకు 4,400 పైచిలుకు దేశీయ, 1,800 అంతర్జాతీయ విమాన సరీ్వసుల ల్యాండింగ్, పార్కింగ్‌ స్లాట్లు ఉన్నాయి. అలాగే విదేశీ ఎయిర్‌పోర్టుల్లో 900 స్లాట్లు ఉన్నాయి. ఇవి ఇక టాటా గ్రూప్‌నకు దక్కుతాయి. ఎయిరిండియాకు చెందిన 117 విమానాలు, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 24 విమానాలు కూడా అందుబాటులోకి వస్తాయి.  

ఏడాది దాకా ఉద్యోగులను తీసేయొద్దు..
బిడ్డింగ్‌ నిబంధనల ప్రకారం లావాదేవీ పూర్తయిన నాటి నుంచి ఏడాది పాటు ఎయిరిండియా ఉద్యోగులందరినీ టాటా గ్రూప్‌ కొనసాగించాలని విమానయాన శాఖ కార్య దర్శి రాజీవ్‌ బన్సల్‌ తెలిపారు. రెండో ఏడాదిలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) ఆఫర్‌ చేయవచ్చు. ఎయిరిండియాలో 12,085 మంది ఉద్యోగులు (8,084 మంది పర్మనెంట్, 4,001 మంది కాంట్రాక్ట్‌) ఉన్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 1,434 మంది సిబ్బంది ఉన్నారు.

వెల్‌కం బ్యాక్‌ ఎయిరిండియా..
‘ఎయిరిండియాకు పునఃస్వాగతం. ఎయిరిండియాను టాటా గ్రూప్‌ దక్కించుకుందన్న వార్త అద్భుతం. ఎయిరిండియాను పునర్‌నిర్మించడానికి గణనీయంగా కృషి చేయాల్సి ఉంటుంది. అయితే, ఏవియేషన్‌ మార్కెట్‌లో టాటా గ్రూప్‌ మరింత పటిష్టంగా ఎదిగేందుకు దోహదపడగలదు. జేఆర్‌డీ టాటా సారథ్యంలో అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా ఎయిరిండియా వెలుగొందింది. జేఆర్‌డీ నేడు మన మధ్యలో ఉంటే ఎంతగానో ఆనందించేవారు‘

– రతన్‌ టాటా, గౌరవ చైర్మన్, టాటా సన్స్‌  

టాటా గ్రూప్‌నకు అభినందనలు
ఎయిరిండియా బిడ్డింగ్‌లో గెలుపొందిన టాటా గ్రూప్‌నకు అభినందనలు. ఎయిరిండియాకు టాటా గ్రూప్‌ పూర్వ వైభవం తీసుకురాగలదు. డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియను పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వానికి కూడా అభినందనలు‘

– అజయ్‌ సింగ్, సీఎండీ, స్పైస్‌జెట్‌

జేఆర్‌డీ టాటా మానసపుత్రిక..
ఇంత భారీ మొత్తం వెచ్చించి ఎయిరిండియాను టాటా గ్రూప్‌ దక్కించుకోవడానికి ఆ సంస్థతో గల బలమైన అనుబంధమే కారణం. అప్పట్లో గ్రూప్‌ చైర్మన్‌ జేఆర్‌డీ టాటా దీన్ని నెలకొల్పారు. ఆయనకు దీనిపై ఎంతో మమకారం ఉండేది. 1932 అక్టోబర్‌లో కరాచీ నుంచి బాంబేకు తొలి ఎయిర్‌మెయిల్‌ సరీ్వస్‌ విమానాన్ని ఆయనే స్వయంగా నడిపారు. 1953లో ఎయిరిండియాను జాతీయం చేయడాన్ని జేఆర్‌డీ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆయన మాట నెగ్గలేదు. అయితే, ఎయిరిండియా జాతీయం అయిన తర్వాత కూడా 25 ఏళ్ల పాటు దానికి జేఆర్‌డీనే చైర్మన్‌గా ప్రభుత్వం కొనసాగించింది. ఇటు టాటా గ్రూప్‌ను అటు ఎయిరిండియాకు సారథ్యం వహించినప్పుడూ ఆయన టాటా గ్రూప్‌కన్నా ఎయిరిండియా గురించే ఎక్కువగా ఆలోచించేవారం టూ పేరుండేది. అయితే, ఎయిరిండియా బాధ్యతలను ఆయన కష్టంగా కాకుండా ఎంతో ఇష్టంగా నిర్వర్తించేవారు. 

జేఆర్‌డీ టాటా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top