Swiggy: స్విగ్గీ కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

Swiggy announces permanent work-from-anywhere policy details here - Sakshi

సాక్షి,ముంబై: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ (Work From Anywhere) పాలసీని ప్రకటించింది. దాదాపు ఉద్యోగులందరికీ ఈ పాలసీ వర్తిస్తుందని తెలిపింది. కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, టెక్నాలజీ టీమ్‌లు రిమోట్‌గా పని చేస్తూనే ఉంటాయని కంపెనీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సమయంలో వర్క్‌ ఫ్రం హోం విధానానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన స్విగ్గీకి గత రెండేళ్లుగా ప్రొడక్టివిటీ బాగా పెరిగిందట. ఈ నేపథ్యంలోనే కంపెనీ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించింది.

'ఫ్యూచర్ ఆఫ్ వర్క్' విధానం ప్రకారం, కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్ ఫంక్షన్‌, టెక్నాలజీ విభాగాల ఉద్యోగుల రిమోట్‌గా పని చేస్తారు. అయితే బేస్ లొకేషన్‌లలో పనిచేసేవారు మాత్రం వారంలో కొన్ని రోజులు ఆఫీసుకు రావాలని తెలిపింది. అలాగే  ప్రతి త్రైమాసికానికి ఒకసారి సమావేశమవుతాయని వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగించాలని మేనేజర్లు, ఇతర ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్‌కు  ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఫ్యూచర్ ఆఫ్ వర్క్  ప్రధాన అంశం ఫ్లెక్సిబిలిటీ, ఉద్యోగులు తమ పనిని చాలా సౌలభ్యంగా చేసుకోవడంపైనే తమ ప్రధాన దృష్టి అని స్విగ్గీ హెచ్‌ఆర్ హెడ్ గిరీష్ మీనన్ తెలిపారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మోడల్‌ను అందించిన మొదటి కంపెనీలలో స్విగ్గీ ఒకటి. 2014లో దేశీయ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్విగ్గీ ,  27 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలలోని 487 నగరాల ఉద్యోగులు చాలావరకు వర్క్‌ ఫ్రం హోం ద్వారా పని చేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top