స్టాక్‌ మార్కెట్‌లో హర్షద్‌ మెహతాని ఢీ కొట్టిన దమ్ము దమానీదే

The Success Story Of DMart Founder Radhakishan Damani - Sakshi

దేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తి ఎవరి అడిగితే ముఖేశ్‌ అంబాని అని ఠక్కున చెప్పేస్తాం. మరి రెండో వ్యక్తి ఎవరని అడిగితే టాటా,బిర్లా, మహీంద్రా, అజీం, శివనాడర్‌, బజాజ్‌ ఇలా పేర్లు వెతుకుతాం. కానీ వీళ్లెవరు కాదు .ఈ రెండో సంపన్నుడి పేరు రాధకిషన్‌ దమాని. ఏ మాత్రం పబ్లిసిటీని ఇష్టపడని ఈ మనిషి, కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. కేవలం కామన్‌ సెన్స్‌ని పెట్టుబడిగా పెట్టి సుమారు లక్షా యాభై వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. 

D Mart Founder Radhakishan Damani: రాధా కిషన్‌ దమానీ వ్యాపారమే జీవన విధానంగా బతికే మర్వాడీ కుటుంబంలో 1954న జన్మించాడు. రాజస్థాన్‌లోని బికనేర్‌లోనే ఆయన విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత ఆయన తండ్రి శివ కిషన్‌ దమానీ ముంబై స్టాక్‌ ఎక్సేంజీలో బ్రోకర్‌గా పని చేయడానికి కుదరడంతో ఆ కుటుంబం ముంబైకి మకాం మార్చింది. రాధా కిషన్‌కి గోపి కిషన్‌ అనే సోదరుడు కూడా ఉన్నాడు. అత్తెసరు మార్కులతోనే చదువు నెట్టుకొస్తూ.... ఎలాగొలా ముంబై యూనివర్సిటీలో బీకాంలో సీటు సాధించినా మొదటి ఏడాది తర్వాత కాలేజీకి వెళ్లనంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో ఇంట్లో వాళ్లు అతని చేత బాల్‌ బేరింగ్‌ బిజినెస్‌ పెట్టించారు. తండ్రితో కలిసి సోదరుడు గోపి దమానీ స్టాక్‌ మార్కెట్‌ బ్రోకరేజీ పనులు చూసుకునే వాళ్లు.

ఆ ఘటనతో...
ఇటు పెద్దగా చదువు కోకుండా అటు బిజినెస్‌లో చురుగ్గా వ్యవహరించని రాధా కిషన్‌పై తండ్రికి ఎప్పుడూ అనుమానమే. అయితే రాధా కిషన్‌కి 32 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అకస్మాత్తుగా శివ్‌ దమానీ మరణించాడు. దీంతో తండ్రి స్థానంలో అయిష్టంగానే స్టాక్‌ మార్కెట్‌లోకి వచ్చాడు దమానీ

కదలడు మెదలడు
స్టాక్‌ మార్కెట్‌ అంటేనే గందరగోళం.. కొనేవాళ్లు, అమ్మేవాళ్లలతో హడావుడిగా ఉంటుంది. కానీ రాధకిషన్‌ దమానీ ఇందుకు విరుద్ధంగా నెమ్మదిగా ఉండేవాడు. అతని పేరేంటో కూడా తోటి బ్రోకర్లకి తెలిసేది కాదు. మార్కెట్‌లో అతను ప్రాతినిథ్యం వహించే జీఎస్‌ అనే బ్యాడ్జ్‌ అతని షర్ట్‌పై ఉంటే అదే పేరుతో జీఎస్‌ అనే ఎక్కువ మంది పిలిచేవారు. హడావుడి చేయకపోయినా అక్కడున్న వాళ్లని గమనిస్తూ మార్కెట్‌ పల్స్‌ని మాత్రం బాగా గమనించే వాడు.

హర్షద్‌ మెహతాకు పోటీగా
రాధ కిషన్‌ దమానీ స్టాక్‌ మార్కెట్‌లో కెరీర్‌ ప్రారంభించినప్పుడే మరో బిగ్‌బుల్‌, స్టాక్‌ మార్కెట్‌ స్కామర్‌ హర్షద్‌ మెహతా కూడా స్కాక్‌ మార్కెట్‌లో అడుగు పెట్టాడు. తెర వెనుక మంత్రాంగం నడుపుతూ మార్కెట్‌ను పైకి లేపడంలో హర్షద్‌కి పెట్టింది పేరు. అతనికి పోటీగా మార్కెట్‌లో నిలిచింది ట్రిపుల్‌ ఆర్‌లో రాధాకిషన్‌ దమానీ మూల స్థంభం. ఆ రోజుల్లో హర్షద్‌కి పోటీగా రాధా కిషన్‌, రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, రాజ్‌ అనే ముగ్గురు ట్రిపుల్‌ ఆర్‌గా పోటీ ఇచ్చారు. అయితే వీళ్లపై ఎక్కువ సార్లు హర్షద్‌దే పై చేయి అయ్యింది. అయినా సరే పట్టు వదలకుండా పోటీలో నిలిచారంటే దానికి కారణం దమానీనే.

అదే జరిగి ఉంటే
ఓ కంపెనీ టైర్స్‌ షేర్ల విషయంలో హర్షద్‌ మెహెతా, ట్రిపుల్‌ ఆర్‌ల మధ్య పోటీ నెలకొంది. ఆ కంపెనీ షేర్లు పెరుగుతాయంటూ హర్షద్‌ బుల్‌ జోరు కొనసాగిస్తే, ఆ షేర్లు పడిపోతాయంటూ ట్రిపుల్‌ ఆర్‌ బేర్‌ వైపు నిల్చుంది. హర్షద్‌ ఎత్తులతో చాలా రోజుల పాటు ఆ కంపెనీ షేర్లు పడిపోలేదు. మరో వారం గడిస్తే ఇల్లు, వాకిలి అమ్మేసి నడి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ట్రిపుల్‌ ఆర్‌ బృందానికి ఎదురైంది. అయితే హర్షద్‌ పాచికలు పారక కృత్రిమంగా పెంచిన ఆ కంపెనీ టైర్ల ధరలు పడిపోవడంతో దమానీ బృందం అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాతి కొద్ది రోజులకే హర్షద్‌ స్కాం వెలుగు చూడటంతో పరిస్థితి మారిపోయింది. హడావుడి చేయకుండా నిదానంగా ఆలోచిస్తూ మార్కెట్‌ ఎత్తులు వేసే రాధా కిషన్‌ దమానీ వైఖరి ఆయన్ని మార్కెట్‌లో మరో ఎత్తుకి తీసుకెళ్లింది.

పట్టిందల్లా బంగారమే
1992 నుంచి 1998 వరకు రాధి కిషన​ దమానీ కొనుగోలు చేసిన కంపెనీ షేర్ల విలువ బాగా పెరిగింది. వీఎస్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, సుందరం ఫైనాన్స్‌ ఇలా అన్ని కంపెనీలు లాభాలను కళ్ల చూశాయి. బేర్‌ మార్కెట్‌ను అంచనా వేసి తక్కువ ధర షేర్లు కొన్ని లాంగ్‌టర్మ్‌లో భారీ లాభాలను పొందే వ్యూహం అమలు చేశాడు. పదేళ్లు తిరిగే సరికి వందల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యాడు. 

అప్నా బజార్‌
తక్కువ ధరకే వస్తువులను భారతీయులు కొనుగోలు చేయాలనుకుంటారని, అందుక తగ్గట్టుగా తక్కువ ధరకే కిరాణా సామన్లు అందించే స్టోర్లుగా అప్నా బజార్‌ పేరుతో కోపరేటివ్‌ సూపర్‌ మార్కెట్‌ వ్యవస్థను 1998లో నెలకొల్పారు. అయితే ఇటు స్టాక్‌ మార్కెట్‌, అటు సూపర్‌ మార్కెట్‌ల మధ్య సమతూకం లేక అప్నా బజార్‌ నష్టాల పాలైంది.

స్టాక్‌మార్కెట్‌కి గుడ్‌బై
తొలి సారి బాల్‌బేరింగ్‌ వ్యాపారంలో వచ్చిన నష్టం దమానీని వేధిస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా అప్నా బజార్‌లో నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో దమానీలో పట్టుదల పెరిగింది. కోట్ల రూపాయల సంపద అందించిన స్టాక్‌ మార్కెట్‌కి 2000లో గుడ్‌బై చెప్పాడు.

డీ మార్ట్‌ 
ముంబై నగర శివార్లలో పువై ప్రాంతంలో చవగ్గా స్థలం కొని ఏర్పాటు చేసి కిరాణ వస్తువుల నుంచి బట్టలు, ఎలక్ట్రానిక్స్‌, గ్రూమింగ్‌ వరకు అన్ని వస్తువులు ఓకే చోట దొరికేలా డీ మార్ట్‌ హైపర్‌ మార్కెట్‌ని ఏర్పాటు చేశాడు. ప్రతీ వస్తువుని ఎంఆర్‌పీ కంటే తక్కువ ధరకే అమ్మడం ప్రారంభించాడు. నెమ్మదిగా డీ మార్ట్‌ విజయ పరంపర మొదలైంది. 

ధనవంతుల జాబితాలో
డీ మార్ట్‌ ప్రారంభించిన తర్వాత పదేళ్లు గడిచే సరికి స్టోర్ల సంఖ్య 1 నుంచి పదికి పెరిగింది. అయితే మా సిటీలో కూడా డీమార్ట్‌ ఉంటే బాగుండు అనుకునే వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. అందుకు తగ్గట్టే మరో పదేళ్లు గడిచే సరికి డీమార్ట్‌ స్టోర్ల సంఖ్య దేశ వ్యాప్తంగా 220కి చేరుకుంది. డీ మార్ట్ పబ్లిక్‌ ఇష్యూకి 2017లో వెళ్లగా 145 శాతం అధిక ధర నమోదై రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. ఆగస్టు 19న ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీలు విపరీతమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆదాయం 19.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇందులో 4.1 బిలియన్‌ డాలర్లు ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఖాతాలో వచ్చి చేరింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన 97వ స్థానంలో నిలిచినట్టు బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకటించింది. ఇండియాలో ముకేశ్‌ అంబానీ 57.9 బిలియన్‌ డాలర్లతో ప్రథమ స్థానంలో ఉంటే దమానీ 19.30 బిలియన్‌ డాలర్ల సంపద కలిగి ఉన్నారు.

విలువలే ఆధారంగా
స్టాక్‌ మార్కెట్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి తెల్ల అంగీ తెల్ల ప్యాంటు మాత్రమే ఆయన ధరిస్తారు.దీంతో ఆయన్ని మిస్టర్‌ వైట్‌ అండ్‌ వైట్‌గా పిలుచుకుంటారు. 80వ దశకంలో స్టాక్‌ మార్కెట్‌లో హర్షద్‌మెహతా ఎత్తులకు మిగిలిన ఇన్వెస్టర్లు చిత్తైపోతుంటే తెగువతో నిలిచారు దమానీ. ఆ పోరులో సర్వం కోల్పేయే వరకు వచ్చినా ధైర్యం కోల్పోలేదు. అందువల్లే స్కాములు చేసిన హర్షద్‌ ఎలా పైకి ఎదిగాడో అలాగే నేలకరిస్తే.. నెమ్మదస్తుడిగా పేరున్న దమానీ టాటా బిర్లాలనే వెనక్కి నెట్టి అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు.

ఇప్పటికీ అదే తీరు
ముంబై స్టాక్‌ మార్కెట్‌లో బ్రోకర్‌గా అగుడు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే లో ప్రొఫైల్‌ మెయింటైన్‌ చేస్తున్నారు దమానీ. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, బయట పార్టీలకు వెళ్లడం, ఆఖరికి మార్కెట్‌ మీద సైతం కామెంట్‌ చేసేందుకు ఆయన ముందుకు రారు. ఎక్కడైనా విరాళాలు, సాయం అందించిన తనే పేరు రాయించడు, కనీసం మాట వరసకి కూడా చెప్పొదంటూ సాయం, విరాళం పొందిన వారిని రిక్వెస్ట్‌ చేస్తారు. ఇండియాలో రెండో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు వచ్చిన సందర్భంలో ఆయన లేటెస్ట్‌ ఫోటోలు సైతం మీడియాకి లభించలేదంటే ఎంత లో ఫ్రొఫైల్‌ మెయింటైన్‌ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. 

- సాక్షి, వెబ్‌డెస్క్‌ ప్రత్యేకం

చదవండి : BigBull: పెట్టుబడి ఐదు వేలు.. సంపాదన 34 వేల కోట్లు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top