ఇంట్లో పెళ్లి కోసం.. తక్కువ రిస్క్‌తో ఈ మార్గంలో ఇన్వెస్ట్‌ చేయండి!

Stock Market Smart Investment Tips By Value Research Ceo - Sakshi

నేను నా సోదరి వివాహం కోసం ప్రతి నెలా రూ.45,000 చొప్పున పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకోవాలి? ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా సార్వభౌమ బంగారం బాండ్లలోనా?     

మన దేశంలో వివాహాలు సాధారణంగా చూస్తే తక్కువ ఖర్చుతో ముగిసేవి కావు. మీరు అనుకుంటున్నట్టు ప్రతి నెలా రూ.45,000 చొప్పున వచ్చే ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేసినట్టయితే గణనీయమైన మొత్తమే సమకూరుతుంది. వివాహం లక్ష్యం విషయంలో రాజీపడలేం. అనుకున్న సమయానికి కావాల్సినంత చేతికి అందాల్సిందే. వాయిదా వేయడానికి ఉండదు. తక్కువ రిస్క్‌ కోరుకునే వారు అయితే మధ్యస్థ మార్గాన్ని అనుసరించాలి. అందుకుని 50 శాతాన్ని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్‌ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్‌ విషయంలో షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ లేదా టార్గెట్‌ మెచ్యూరిటీ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

ఈక్విటీ పెట్టుబడులకు లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ లేదా లో కాస్ట్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ ఈ పెట్టుబడి మీ పోర్ట్‌ఫోలియో పరంగా చూస్తే స్వల్ప మొత్తం అయి, అధిక రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఉంటే.. అప్పుడు కాస్త దూకుడుగా పెట్టుబడుల సాధనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆటుపోట్లను తట్టుకునేట్టు అయితే ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతాన్ని కేటాయించుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని డెట్‌ సాధనాలకు కేటాయించుకోవాలి. బంగారం కోసమే అయితే సార్వభౌమ బంగారం బాండ్లలో (ఎస్‌జీబీలు) కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. బంగారం విలువ పెరుగుదలకు తోడు, పెట్టుబడి విలువపై ఏటా 2.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ బంగారంతో సోదరి పెళ్లి సమయంలో ఆభరణాలు చేయించొచ్చు.

‘‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ బ్యాంక్‌ ఈటీఎఫ్‌ స్టాక్‌ స్ప్లిట్‌నకు గురవుతోంది. రూ.10 ముఖ విలువ నుంచి రూ.1కు తగ్గనుంది. ఇందుకు సంబంధించి రికార్డు తేదీ సెప్టెంబర్‌ 02, 2022’’ అంటూ నాకు మెస్సేజ్‌ వచ్చింది. అంటే దీనర్థం ఏంటి? ఒక ఇన్వెస్టర్‌గా దీనివల్ల నాకు ఏం జరగనుంది?  దయచేసి వివరాలు తెలియజేయగలరు.      

సాధారణంగా ఫండ్‌ హౌస్‌లు స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ల్లో లిక్విడిటీ (లభ్యత) పెంపునుకు వీలుగా స్టాక్‌ స్ప్లిట్‌ ప్రకటిస్తుంటాయి. దీనివల్ల సదరు ఈటీఎఫ్‌ యూనిట్‌ విలువ మరింత తగ్గి చిన్న ఇన్వెస్టర్లకు కూడా కొనుగోలుకు అందుబాటులోకి వస్తుంది. నిబంధనల ప్రకారం ఈటీఎఫ్‌ యూనిట్లను స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లలో లిస్ట్‌ చేయడం తప్పనిసరి. ఒక ఇన్వెస్టర్‌గా ఇలాంటి నిర్ణయాల వల్ల పెట్టుబడులకు సంబంధించి జరిగే మార్పు ఏమీ ఉండదు. ఈటీఎఫ్‌ ముఖ విలువ తగ్గడం వల్ల యూనిట్‌ ఎన్‌ఏవీ కూడా తగ్గుతుంది. అదే సమయంలో యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. ఉదాహరణకు మీకు రూ.10 ముఖ విలువ కలిగిన 100 యూనిట్లు ఉన్నాయని అనుకుందాం. రూ.1 ముఖ విలువకు యూనిట్‌ను స్ప్లిట్‌ చేయడం వల్ల అప్పుడు మీ వద్దనున్న 100 యూనిట్లు కాస్తా 1,000 యూనిట్లకు పెరుగుతాయి. కొత్త యూనిట్లు రికార్డు తేదీ తర్వాత మీ ఖాతాకు జమ అవుతాయి.

చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top