ఆర్థిక ఫలితాలతో దిశా నిర్దేశం! | stock market forecast for this week suggests a mix of optimism and caution | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఫలితాలతో దిశా నిర్దేశం!

Jan 6 2025 10:15 AM | Updated on Jan 25 2025 4:30 PM

stock market forecast for this week suggests a mix of optimism and caution

ఈవారం మార్కెట్ల సరళి

గత వారం మార్కెట్లో బుల్స్(Market Bulls) హడావుడి కనిపించింది. వాస్తవానికి అంతక్రితం వారం రావాల్సిన షార్ట్ కవరింగ్ కిందటి వారం రావడం ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా గత గురువారం సెన్సెక్స్ 1400 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 400 పాయింట్ల దాకా పెరిగాయి. మళ్లీ శుక్రవారం కొంతమేర నష్టాల్లో నడిచినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేదు. డిసెంబర్ నెలకు సంబంధించి వాహన విక్రయాలు సానుకూలంగా ఉండటం... మరీ ముఖ్యంగా మారుతీ షేర్ల దూకుడు, ఐటీరంగం(IT Sector)లో మళ్లీ కొనుగోళ్లు పుంజుకోవడం, జీఎస్టీ వసూళ్లు బావుండటం..వంటి కారణాలు మార్కెట్‌ను ముందుకు నడిపాయి. వారం మొత్తానికి సెన్సెక్స్ 79223, నిఫ్టీ 24004 పాయింట్ల వద్ద ముగిశాయి. అంత క్రితం వారంతో పోలిస్తే గత వారం మొత్తం మీద సెన్సెక్స్ దాదాపు 525 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ సుమారు 191  పాయింట్లు పెరిగింది.

ఈవారం ఇలా..

తెలుగు వాళ్లకు సంక్రాంతి ఎంత పెద్ద పండుగో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్టాక్ మార్కెట్‌కు సంబంధించి అలాంటి పండగే రాబోతోంది. అదే ఆర్థిక ఫలితాలు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలు ఈవారం నుంచే మొదలు కాబోతున్నాయి. ఈ నెల 9న టీసీఎస్ ఫలితాలతో సందడి మొదలవుతుంది. ఇక ఈ ఫలితాలు మార్కెట్లకు రాబోయే రోజుల్లో దిశానిర్దేశం చేయబోతున్నాయి. ఈసారి ఫలితాలు కొంత ప్రొత్సాహకారంగా ఉండొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది సానుకూల సంకేతం.  మరోపక్క క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో పలచబడ్డ విదేశీ మదుపర్ల లావాదేవీలు మళ్లీ జోరు అందుకుంటాయి. అయితే గత వారం చివర్లో కనిపించిన కొనుగోళ్ల ఉద్ధృతి కొనసాగడం అనేది ఆర్థిక ఫలితాలు, విదేశీ మదుపర్ల చర్య పైనే పూర్తిగా ఆధారపడి ఉంది.  

ఎఫ్ఐఐల తీరు

విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత డిసెంబర్ నెల మొత్తం మీద రూ.16,982 కోట్ల నికర విక్రయాలు జరపగా, దేశీయ మదుపర్లు రూ.34,194 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఇక ఈ ఏడాది తొలి మూడు రోజుల్లోనూ విదేశీ మదుపర్లు రూ.4500 కోట్ల నికర విక్రయాలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మాత్రం రూ.2500 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్‌కు అండగా నిలిచారు.  

సాంకేతిక స్థాయులు

సెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా బుల్స్ పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఇందుకు కారణం. కొనుగోళ్ల జోరు కొనసాగితే నిఫ్టీ 24250 పాయింట్ల వరకు పరుగులు తీయొచ్చు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే 24600 వరకు పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు.  ఒకవేళ అమ్మకాలు పెరిగితే  23800 కీలక స్థాయిని మార్కెట్ చూసే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా బ్రేక్ చేస్తే పతనం మరింత పెరిగి గతంలోని కనిష్టస్థాయులను టచ్ చేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే గత మద్దతు స్థాయి అయిన 23300 మార్కెకు పడిపోవచ్చు. ఆ స్థాయికి క్షీణించడానికి ముందు కొద్దిపాటి రికవరీకి  ఆస్కారం ఉంటుంది.

ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమా

రంగాలవారీగా...

ఆటోమొబైల్ రంగంలో జోరు కొనసాగే అవకాశం ఉంది. డిసెంబర్ నెలకు ఈ కంపెనీలు ప్రకటించిన విక్రయ గణాంకాలు చాలావరకు మదుపర్లను మెప్పించాయి. మారుతీ షేర్లలో దూకుడు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రాఫిట్ బుకింగ్‌కు అవకాశం ఉంటుంది. గత కొద్దివారాలుగా లాభాల్లో సాగుతున్న ఫార్మా రంగం ర్యాలీ ఈవారం కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్కెట్లో ఒడుదొడుకులు ఎదురవుతున్నప్పుడు మదుపర్లు ముందుగా సురక్షితంగా భావించి కొనుగోళ్లు జరిపేది ఈ రంగంలోని షేర్లనే. ఇక టీసీఎస్ ఆర్థిక ఫలితాలు రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్ వంటి ఐటీ కంపెనీల షేర్లను ప్రభావితం చేస్తాయి. అల్ట్రాటెక్, అంబుజా షేర్లకు మద్దతు దొరికే అవకాశం ఉన్నప్పటికీ సిమెంట్ షేర్లలో పెద్దగా దూకుడు ఉండకపోవచ్చు. అలాగే ఎఫ్ఎంసిజీ, యంత్ర పరికరాల రంగానికి చెందిన షేర్లు సైతం ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. టెలికం, ఆయిల్ రంగాల షేర్లలో  స్థిరీకరణ జరగొచ్చు.

-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement