ఇప్పటికీ తన విధానమే పాటిస్తున్నాం..: బిల్‌గేట్స్‌ | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ తన విధానమే పాటిస్తున్నాం..: బిల్‌గేట్స్‌

Published Fri, Mar 22 2024 1:25 PM

Steve Jobs Is Known As One Of The Great Orators Said Bill Gates - Sakshi

యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో స్టీవ్‌ జాబ్స్‌కు టెక్‌ ప్రపంచంలో ఎల్లప్పుడూ ప్రత్యేకస్థానం ఉంటుంది. కంపెనీ సమావేశాలు ఏర్పాటు చేసినా, కొత్త ఉత్పత్తులు విడుదలైనా ఆయన చేసే ప్రసంగం, తన వ్యవహారశైలి అందరినీ కట్టిపడేసేది. తాజాగా ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ వెల్లడించారు. బహిరంగ వేదికలపై స్టీవ్‌ జాబ్స్‌లా తాను వ్యవహరించలేనని, ఆయన చాలా సహజంగా ప్రవర్తిస్తూ ఎదుటి వారిని తన మాటలతో ఆకట్లుకునేవారని గేట్స్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు.

ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ.. ‘స్టీవ్‌ జాబ్స్‌ చాలా సహజంగా ఉంటారు. స్టేజ్‌పై మాట్లాడటానికి ముందు ఆయన రిహార్సల్స్‌ చూడటం ఎంతో సరదాగా ఉంటుంది. కొన్నిసార్లు వేదికపై మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను. మైక్రోసాఫ్ట్‌ ప్రారంభించిన తొలి నాళ్లలో వాటి ఉత్పత్తుల గురించి వివిధ రకాల వ్యక్తులకు వివరించడమే కీలక ప్రక్రియగా ఉండేది. విద్య, వైద్యం, ఏఐకి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల గురించి అభిప్రాయ సేకరణ కోసం ఇప్పటికీ కొన్నిసార్లు స్టీవ్‌ జాబ్స్‌ అనుసరించే కమ్యూనికేషన్‌ విధానాన్నే పాటిస్తున్నాం’ అని చెప్పారు.

కంపెనీకి సంబంధించి నూతన ఉత్పత్తుల విడుదలతో పాటు, ఇతర సమావేశాల్లో ప్రసంగించేందుకు స్టీవ్‌ చాలా రోజుల ముందు నుంచి సిద్ధమయ్యేవారట. ఈ విషయాన్ని 2015లో విడుదలైన ‘బికమింగ్‌ స్టీవ్‌ జాబ్స్‌’ అనే పుస్తకంలో రచయితలు బ్రెంట్‌ ష్లెండర్‌, రిక్‌ టెట్‌జెలీలు వెల్లడించారు. తామా గతంలో ఒక రోజంతా స్టీవ్ జాబ్స్‌తో ఉన్నామని పుస్తకంలో తెలిపారు.

ఇదీ చదవండి: క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు

చిన్న ప్రజెంటేషన్‌ కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, స్లైడ్స్‌కు ఎలాంటి రంగులు వాడాలి? స్టేజ్‌పై తన వ్యవహారశైలి ఎలా ఉండాలి? ఎక్కడ స్పాట్‌ లైట్‌ పడాలి? ఇలా ప్రతి విషయంలో ఎంతో ప్రణాళికతో వ్యవహరించేవారని వివరించారు.

Advertisement
 
Advertisement