శ్రీలంకలో విద్యుత్ షాక్ | Sri Lanka Hikes Power Tariffs Amid Global Fuel Price Surge | Sakshi
Sakshi News home page

శ్రీలంకలో విద్యుత్ షాక్

Mar 30 2026 7:33 PM | Updated on Mar 30 2026 7:53 PM

Sri Lanka Hikes Power Tariffs Amid Global Fuel Price Surge

ఇంధన సంక్షోభం.. పెరిగిన టారిఫ్‌లు

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకపై మరో భారం పడింది. ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు 7.2%, పరిశ్రమలకు 8.7% మేర విద్యుత్‌ టారిఫ్‌లను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఐఎంఎఫ్‌ నిబంధనలే కారణమా?

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నుంచి పొందిన 2.9 బిలియన్‌ డాలర్ల సహాయ ప్యాకేజీలో భాగంగా శ్రీలంక కఠిన ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం కోసం కాస్ట్ రిఫ్లెక్టివ్(ఖర్చుకు అనుగుణంగా ధరలు) విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏడాదికి పలుమార్లు విద్యుత్ ధరలను సవరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.

మరింత పెరిగే అవకాశం ఉందా?

‘యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో ఇంధన ధరలు మరింత పెరిగితే, విద్యుత్ ఛార్జీలను మళ్లీ పెంచాలనే అభ్యర్థనను మేము పరిశీలిస్తాం’ అని శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.పి.ఎల్. చంద్రలాల్ స్పష్టం చేశారు. వాస్తవానికి సీఈబీ 13.56 పెంపును కోరినప్పటికీ ప్రస్తుతానికి దాన్ని నియంత్రించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.

తీవ్ర స్థాయిలో ఇంధన కొరత

దేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ముడి చమురు, ఫర్నేస్ ఆయిల్ కొరత తీవ్రంగా ఉంది. దీనిపై సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ జానక రాజకరుణ మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించారు. ‘వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఇంధన రేషనింగ్‌ను ప్రవేశపెట్టారు. విద్యుత్ ఆదా కోసం ప్రతి బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. నిరంతరాయ సరఫరా కోసం రష్యా, భారత్, అమెరికా దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్‌లో శుద్ధి చేసిన ఇంధనం కోసం 600 మిలియన్‌ డాలర్లు వెచ్చించనున్నారు’ అని చెప్పారు.

ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement