Covid-19: పీపీఈ కిట్లు, శానిటైజర్లకు నకిలీ బెడద

Spike in Counterfeit sanitizer, PPE kits amid COVID-19 crisis says aspa report - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ కాలంలో నకిలీ ఫార్మా ఉత్పత్తుల తయారీ భారీగా పెరిగింది. ముఖ్యంగా పీపీఈ కిట్లు, శానిటైజర్ల వంటి ఉత్పత్తుల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. పరిశ్రమ సమాఖ్య ఆథెంటికేషన్‌ సొల్యూషన్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ (ఏఎస్‌పీఏ) ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. గడిచిన కొన్నేళ్లలో దేశీయంగా నకిలీల తయారీ భారీగా పెరిగినట్లు పేర్కొంది. 2018 జనవరి నుంచి 2020 డిసెంబర్‌ దాకా ఇది 20 శాతం దాకా పెరిగిందని తెలిపింది. ఎక్కువగా పొగాకు, ఆల్కహాల్, ఎఫ్‌ఎంసీజీ ప్యాకేజ్డ్‌ ఉత్పత్తులు, కరెన్సీ, ఫార్మా రంగాల్లో ఈ ధోరణి ఉందని వివరించింది.

మొత్తం నకిలీ ఉత్పత్తుల్లో వీటి వాటా 84 శాతం పైగా ఉంది. నకిలీల తయారీ కేవలం విలాసవంతమైన ఖరీదైన ఉత్పత్తులకు పరిమితం కాకుండా ప్రస్తుతం జీలకర్ర, ఆవాలు, వంట నూనెలు, నెయ్యి, సబ్బులు, పిల్లల సంరక్షణ ఉత్పత్తులు మొదలైన రోజువారీ వినియోగించే వాటికి కూడా విస్తరించింది. సిసలైన ఉత్పత్తులుగా అనిపించే వాటిని తయారు చేసేందుకు ప్రొఫెషనల్‌ మోసగాళ్లు ఇప్పుడు ఆధునిక తయారీ, ప్రింటింగ్‌ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు.

నకిలీ ఉత్పత్తుల బెడద ఎక్కువగా ఉన్న పది రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, బిహార్, పంజాబ్‌ మొదలైనవి ఉన్నాయి. ఇప్పటికే మందగించిన ఆర్థిక రికవరీ వేగం.. నకిలీ ఉత్పత్తులు, అక్రమ వ్యాపారాల కారణంగా మరింత నెమ్మదించే ముప్పు ఉందని ఏఎస్‌పీఏ ప్రెసిడెంట్‌ నకుల్‌ పశ్రిచా ఆందోళన వ్యక్తం చేశారు. 

చదవండి: ధరలకు ఇంధన సెగ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top