టాప్ 10 మార్కెట్లలో నాలుగు బెంగళూరులోనే.. ఎక్కడెక్కడో తెలుసా?

Somajiguda in Hyderabad ranks 2nd in India top 30 high Area - Sakshi

టాప్‌–30 స్ట్రీట్‌లలో రెండో స్థానం

మొదటి స్థానంలో బెంగళూరు ఎంజీ రోడ్డు

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని సోమాజిగూడ దేశంలోని ప్రముఖ 30 ప్రాంతాల్లో (ప్రముఖ మార్కెట్‌ ప్రాంతాలు) రెండో స్థానాన్ని దక్కించుకుంది. బెంగళూరులోని ఎంజీ రోడ్డు మొదటి స్థానంలో నిలవగా, ముంబై లింకింగ్‌ రోడ్డు మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఢిల్లీలోని సౌత్‌ ఎక్స్‌టెన్షన్‌ (పార్ట్‌ 1, 2) ఉన్నట్టు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కస్టమర్లకు లభించే మెరుగైన అనుభవం ఆధారంగా ఈ స్థానాలను కేటాయించారు.

కస్టమర్లకు మెరుగైన ప్రాంతాలు బెంగళూరులో ఎక్కువగా ఉన్నాయి. టాప్‌–10లో నాలుగు ఈ నగరం నుంచే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లోని ప్రాంతాలను టాప్‌–30 కోసం నైట్‌ ఫ్రాంక్‌ అధ్యయనం చేసింది. ‘థింక్‌ ఇండియా థింక్‌ రిటైల్‌ 2023 – హై స్ట్రీట్‌ రియల్‌ ఎస్టేట్‌ అవుట్‌లుక్‌’ పేరుతో నివేదికను విడుదల చేసింది. కొల్‌కతా పార్క్‌ స్ట్రీట్‌ అండ్‌ కామెక్‌ స్ట్రీట్‌ ఐదో స్థానంలో ఉంటే.. చెన్నై అన్నా నగర్, బెంగళూరు కమర్షియల్‌ స్ట్రీట్, నోయిడా సెక్టార్‌ 18 మార్కెట్, బెంగళూరు బ్రిగేడ్‌ రోడ్, చర్చి రోడ్‌ టాప్‌ 10లో ఉన్నాయి.

వీటిని ప్రముఖ ప్రాంతాలుగా చెప్పడానికి అక్కడ పార్కింగ్‌ సౌకర్యాలు, అక్కడకు వెళ్లి రావడంలో ఉండే సౌకర్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా టాప్‌ 8 పట్టణాల్లోని ప్రముఖ మార్కెట్‌ ప్రాంతాల్లో 13.2 మిలియన్‌ చదరపు అడుగుల పరిధిలో రిటైల్‌ స్టోర్లు ఉన్నాయి. ఇందులో 5.7 మిలియన్‌ చదరపు అడుగులు ఆధునిక రిటైల్‌ వసతులకు సంబంధించినది. ఈ టాప్‌–30 మార్కెట్లలో 2023–24లో 2 బిలియన్‌ డాలర్ల వినియోగం నమోదైనట్టు నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top