మళ్లీ పబ్లిక్‌ ఇష్యూల సందడి | Sirma SGS IPO starts on 12 aug 2022 | Sakshi
Sakshi News home page

మళ్లీ పబ్లిక్‌ ఇష్యూల సందడి

Aug 12 2022 6:13 AM | Updated on Aug 12 2022 6:13 AM

Sirma SGS IPO starts on 12 aug 2022 - Sakshi

న్యూఢిల్లీ: రెండున్నర నెలల తదుపరి మళ్లీ ప్రైమరీ మార్కెట్‌కు జోష్‌ రానుంది. ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ సర్వీసుల కంపెనీలలో సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ పబ్లిక్‌ ఇష్యూ నేడు(12న) ప్రారంభంకానుంది. ఎవలాన్‌ టెక్నాలజీస్‌ అయితే క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. మరోవైపు ఆరోగ్య పరిరక్షణ రంగ సంస్థ యథార్ధ్‌ హాస్పిటల్‌ అండ్‌ ట్రౌమా కేర్‌ సర్వీసెస్‌ ఐపీవో దరఖాస్తుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ బాటలో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా ఫిన్‌కేర్‌ సాŠమ్‌ల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ రెండోసారి సెబీకి దరఖాస్తు చేసింది. వివరాలు చూద్దాం..

ఎస్‌జీఎస్‌ టెక్‌..
నేటి(శుక్రవారం) నుంచి ప్రారంభంకానున్న ఐపీవో ద్వారా సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ రూ. 840 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. 18న ముగియనున్న ఇష్యూకి రూ. 209–220 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇంతక్రితం మే 24–26న ఏథెర్‌ ఇండస్ట్రీస్‌ ఐపీవో చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ 11 కంపెనీలు లిస్టింగ్‌ ద్వారా రూ. 33,254 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. వీటిలో ఎల్‌ఐసీ వాటా రూ. 20,557 కోట్లు. కాగా.. సిర్మా ఎస్‌జీఎస్‌ ఐపీవోలో భాగంగా రూ. 766 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 33.69 లక్షల షేర్లను వీణా కుమారి టాండన్‌ విక్రయానికి ఉంచనున్నారు. నిధులను పెట్టుబడి వ్యయాలు, ఆర్‌అండ్‌డీ విస్తరణ, కార్పొరేట్‌ అవసరాలు తదితరాలకు వినియోగించనుంది. కంపెనీ కస్టమర్లలో ఏవో స్మిత్, టీవీఎస్‌ మోటార్, యురేకా ఫోర్బ్స్‌ తదితరాలున్నాయి.

యథార్ధ్‌.. రెడీ  
ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న యథార్ధ్‌ హాస్పిటల్‌ అండ్‌ ట్రౌమా కేర్‌ సర్వీసెస్‌ ఐపీవోకు సెబీ అనుమతించింది. ఇష్యూలో భాగంగా రూ. 610 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 65.51 లక్షల షేర్లను ప్రమోటర్లు, తదితర సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కంపెనీ ఏప్రిల్‌లో దరఖాస్తు చేసింది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.

ఎవలాన్‌ టెక్‌
ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ సర్వీసుల కంపెనీ ఎవలాన్‌ టెక్నాలజీస్‌ ఐపీవోకు వీలుగా సెబీకి దరఖాస్తు చేసింది. తద్వారా రూ. 1,025 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 625 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించనుంది.

ఫిన్‌కేర్‌.. మళ్లీ
ఐపీవో చేపట్టేందుకు సెబీ నుంచి లభించిన ఏడాది గడువు గత నెలలో ముగియడంతో ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ మరోసారి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు మరో 1.7 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు, భవిష్యత్‌ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ఇంతక్రితం రూ. 1,330 కోట్ల సమీకరణకు 2021 మే నెలలో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయగా.. అదే ఏడాది జులైలో సెబీ ఓకే చేసింది.

బిబాకు చెక్‌
ఫ్యాషన్, సంప్రదాయ దుస్తుల కంపెనీ బిబా ఫ్యాషన్‌ పబ్లిక్‌ ఇష్యూకి క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాత్కాలికంగా చెక్‌ పెట్టింది. వివరాలు వెల్లడికానప్పటికీ దరఖాస్తును పెండింగ్‌లో ఉంచినట్లు సెబీ వెబ్‌సైట్‌ పేర్కొంది. కంపెనీ ఏప్రిల్‌ 12న ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 90 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేసే యోచనలో ఉంది. వీటికి జతగా మరో 2.77 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్‌ చేయనున్నారు. 1986లో ఏర్పాటైన కంపెనీ బిబా బ్రాండుతో మహిళా ఫ్యాషన్‌ దుస్తులను రూపొందిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement