
కేంద్రం ప్రభుత్వం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ని సవరించింది. జీఎస్టీ సంస్కరణలు దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రధానమైన సానుకూల మార్పు కానున్నాయి. ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ 2.0 నిర్మాణ రంగానికి పెద్ద ఉపశమనమే కలిగిస్తుంది. సామాన్యుల సొంతింటి కల సాకారానికి కాస్త సాయం చేయనుంది.
నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు, గ్రానైట్, మార్బుల్స్, టైల్స్, రంగులు వంటి పలు నిర్మాణ సామగ్రి ధరలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. సాధారణంగా ఇంటి నిర్మాణంలో అయ్యే ఖర్చులో 40–45 శాతం వ్యయం నిర్మాణ సామగ్రిదే ఉంటుంది. తాజా జీఎస్టీ సవరణతో నిర్మాణ సామగ్రిపై అయ్యే ఖర్చులో 10–15 శాతం వరకు ఆదా అవుతుంది. ఫలితంగా మొత్తం ఇంటి నిర్మాణ వ్యయం 4–6 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది.
ఏ నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ ఎంతంటే?
➤సిమెంట్, రెడీమిక్స్ కాంక్రీట్(ఆర్‌ఎంసీ): గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. 18 శాతానికి తగ్గింది.
➤టైల్స్, ఇసుక, ఇటుకలు: 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది.
➤రంగులు, వార్నిష్: 28 శాతం నుంచి 18 శాతం తగ్గింది.
➤మార్బుల్, గ్రానైట్: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.
➤సహజ ఇసుక: 5 శాతం ఉండగా.. సున్నా శాతానికి తగ్గింది.
➤స్టోన్ ఇన్లే వర్క్: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.
➤వుడెన్ ఫ్లోరింగ్: 28 శాతం నుంచి 18 శాతం తగ్గింది.
➤వెదురు ఫ్లోరింగ్: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.
➤సానిటరీవేర్: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.
➤పీవీసీ, యూపీవీసీ పైపులు, ఫిట్టింగ్లు: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.
➤ఇనుము, ఉక్కు ఉత్పత్తులు: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.
➤వాల్పేపర్లు: 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది
➤కరెంట్ వైర్లు: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.
➤ప్లైవుడ్, పార్టికల్, ఫైబర్ బోర్డులు: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.
➤హ్యుండ్మేడ్ కార్పెట్లు, ఫ్లోర్ కార్వింగ్లు: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.